నటీనటులు : వికాస్ వశిష్ఠ, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర తదితరులు
దర్శకత్వం : ప్రవీణ్ కండ్రెగుల
నిర్మాతలు : రాజ్ అండ్ డీకే
సంగీతం : శిరీశ్ సత్యవోలు
సినిమాటోగ్రఫర్ : అపూర్వ, సాగర్
ఎడిటర్: ధర్మేంద్ర, రవితేజ
రేటింగ్: 2.75/5
సినిమా అనేది వినోద సాధనం. అంతే. ఎవరు తీశారు, అందులో ఎవరున్నారు, నేపథ్యం ఏమిటి? అనేవి తరువాతి విషయాలు. స్టార్లుంటే ఆ సినిమాకి హంగామా ఎక్కువవుతుందంతే. అంతిమంగా ప్రేక్షకులకు నచ్చే విషయాలు అందులో ఉన్నాయా, లేవా... అనేదే ప్రధానం అవుతుంది. చిన్న సినిమాల్ని, అసలేమాత్రం స్టార్ డమ్ లేని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారంటే కారణం... అందులోని కంటెంట్ నచ్చే. అలా కంటెంట్ ని నమ్ముకుని మరో సినిమా వచ్చింది. అదే సినిమా బండి. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా ఈరోజే (మే 14న) స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులోని కంటెంట్ ఏమిటి?
* కథ
గొల్లపాలెం అనే ఊరది. ఆ ఊరికన్నీ కష్టాలే. సరైన రోడ్లు లేవు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి. నీళ్లు ఉండవు. ఇలాంటి ఊర్లోని ఎదుగూ బొదుగూ లేని ఆటోడ్రైవర్ కి ఓసారి కెమెరా దొరుకుతుంది. చాలా ఖరీదైన కెమెరా అది. అద్దెకు తిప్పితే నెలకు 10 వేలైనా వస్తుందనిపిస్తుంది. కానీ.. దాంతో సినిమా తీస్తే, కోట్లు కోట్లు కూడబెట్టొచ్చని, సినిమా తీసే ప్రయత్నం మొదలెడతాడు. పెళ్లిళ్లకు ఫొటోలూ, వీడియోలూ తీసే... తన స్నేహితుడికి కెమెరా బాధ్యతలు అప్పగిస్తాడు. ఊర్లో గెడ్డాలు గీసుకునే మైదేష్ ని హీరో చేస్తాడు. ఓ ముసలి తాతని రాసిన కథతో సినిమా మొదలెడతారు. చివరికి ఆ సినిమా ఎంత వరకూ వచ్చింది? అసలు ఆ కెమెరా ఎవరిది? అన్నది మిగిలిన కథ.
* విశ్లేషణ
ఈ సినిమా ట్రైలర్ లోనే కథంతా చెప్పేశారు. ట్విస్టులూ, టర్న్‌లూ పెద్దగా ఏం లేవు. కథని అలా మెల్లగా, హాయిగా ఫాలో అయిపోవడమే. ఆటో డ్రైవర్ కి కెమెరా దొరకడంతో కథ మొదలవుతుంది. అక్కడి నుంచి.. ఆ స్నేహితుల సినిమా వేట షురూ. హీరో, హీరోయిన్ల అన్వేషణ, స్కూళ్ల దగ్గర.. హీరోయిన్ గా చేస్తావా అంటూ అమ్మాయిల వెంట పడడం, `నీ పేరేమి` అని హీరో అడగ్గానే.. దూరంగా పొదల మాటు నుంచి.. చెంబు పట్టుకుని ఒకడు బయటకు రావడం.. ఇవన్నీ సరదాగా అనిపిస్తాయి. పాత్రల మధ్య ఉండే అమాయకత్వం, సినిమాపై వాళ్లకుండే ప్యాషన్.. ఇదే ఈ కథకు మూలం. సహజమైన నటన, అత్యంత సహజమైన సంభాషణలు వన్నె తెచ్చాయి. భారీ ఎమోషన్లు ఏం లేవు. కెమెరా కిందపడి పగిలిపోవడం కంటే.. సంఘర్షణ ఇంకేం కనిపించదు. ఉన్నదల్లా.. సినిమా.. సినిమా.. సినిమా..
టేకింగ్ లో సైతం.. సినిమాటిక్ అంశాలేం కనిపించవు. సినిమాపై ఏమాత్రం అవగాహన లేని ఓ గ్యాంగ్.. కెమెరా పట్టుకుని, ఎంత సహజంగా సినిమాని తీయాలనుకుంటారో, అంతే సహజంగానూ `సినిమా బండి` తీశారు. ఎవరి మొహానికీ మేకప్ కూడా లేదు. నిజానికి ఆ ఫేసులేవీ సినిమాలకు పనికిరావు. కానీ.. ఆ విషయాన్ని సైతం ప్రేక్షకుల్ని మర్చిపోయి ఆ సన్నివేశాల్ని ఫాలో అయిపోతారంతే. అంతలా వాళ్లంతా ఇమిడిపోయారు. సినిమా తీస్తానంటే చీదరించుకున్న ఊరి జనాలు, వాళ్లే ముందుకొచ్చి సాయం చేయడం, పోయిందన్న కెమెరా మళ్లీ తిరిగిరావడం, ఆ ఊరి జనాల మధ్య పెద్ద తెరపై తీసిన సినిమా ప్రదర్శించడం.. ఇవన్నీ మనసుల్ని సుతిమెత్తగా మెలిపెట్టే సన్నివేశాలు. కొన్నిసార్లు ఆ సహజత్వమే.. కాస్త ఇబ్బంది పెడుతుంటుంది. ఒకే పాయింట్ చుట్టూ కథ నడవడం వల్ల.. రిపీటెడ్ సీన్లు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సహజత్వం పేరుతో కొన్ని బూతుల్ని యదేచ్ఛగా వాడారు.
* నటీనటులు
ఈ సినిమాలో ఇది వరకు మనకు పరిచయమున్న నటులెవరూ కనిపించరు. వాళ్ల పేర్లు కూడా రిజిస్టర్ అవ్వవు. కానీ.. ఆపాత్రల పేర్లతోనే గుర్తిండిపోయేలా నటించారు. ఆటోడ్రైవర్, కెమెరామన్, బార్బర్.. వీళ్లలోలో ఎవరిదీ సినిమాటిక్ ఫేస్ కాదు. కాబట్టే, ఆయా పాత్రలు అత్యంత సహజంగా కుదిరాయి.
* సాంకేతిక వర్గం
సహజమైన లొకేషన్లలో తీసిన సినిమా ఇది. గొల్లపాలెం అనే గ్రామంలో మనం కూడా పాత్రలైపోతాం. నేపథ్య సంగీతం స్మూత్ గా ఉంది. మాటలు, పాత్రల ప్రవర్తన అన్నీ సహజంగా వచ్చాయి. సన్నివేశాల్లోంచే వినోదం పండించారు. టైమ్ పాస్ కి ఏమాత్రం ఢోకా లేని సినిమాగా తీర్చిదిద్దారు.
* ప్లస్ పాయింట్స్
నేపథ్యం
సహజత్వం
వినోదం
* మైనస్ పాయింట్స్
సినిమాటిక్ లక్షణాలకు దూరంగా
* ఫైనల్ వర్డిక్ట్: ఓటీటీకి పర్‌ఫెక్ట్ బండి