నటీనటులు : సుహాస్, చాందినీ చౌదరి, సునీల్ తదితరులు
దర్శకత్వం : సందీప్ రాజ్
నిర్మాతలు : బెన్నీ ముప్పనేని
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రఫర్ : వెంకట్ శాఖమూరి
ఎడిటర్: కొదాటి పవన్ కళ్యాణ్
ప్రేమకి ఎన్నో అంతరాలు.
డబ్బు, ఆస్తి, అంతస్తు, కులం, గోత్రం, మతం...
ఇవన్నీ చాలా సినిమాల్లో చూసేశాం. మళ్లీ మళ్లీ అవే చూస్తూనే ఉన్నాం. ఓ ప్రేమ కథకు `రంగు` అడ్డయితే. అదే... `కలర్ ఫొటో`. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన మరో సినిమా ఇది. కామెడీ స్కిట్లు చేసి, యూ ట్యూబ్‌లో పాపులర్ అయిన సహాస్.. తొలిసారి హీరోగా నటించడం, సునీల్ ని ప్రతినాయకుడిగా ఎంచుకోవడం ఈ సినిమాపై బజ్ పెంచాయి. దాంతో పాటు ప్రచార చిత్రాలూ ఆకట్టుకున్నాయి. మరి.. ఈ కలర్ ఫొటో ఎలా ఉంది? ప్రింటు కుదిరిందా, లేదా?
* కథ
1997...మచిలీపట్నం నేపథ్యంలో సాగే కథ ఇది. జయకృష్ణ (సుహాస్) కష్టపడి, సంపాదించి, ఆ డబ్బులతో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. మనిషి మంచోడే. కానీ నల్లగా ఉంటాడు. తన కాలేజీలో చదువుతున్న దీప్తి (చాందిని చౌదరి)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. తను మంచి రంగు. నల్లగా ఉన్న తనని, అంత అందంగా ఉన్న అమ్మాయి ప్రేమిస్తుందా, అసలు కన్నెత్తి చూస్తుందా...? అన్నది జయకృష్ణ అనుమానం. అందుకే తన ప్రేమ విషయం చెప్పడు. కానీ జయకృష్ణ నడక, నడవడిక చూసి.. దీప్తి ఇష్టపడుతుంది. ఈ ప్రేమకథకు ఉన్న ఏకైక అడ్డంకి.. ఎస్సై రామరాజు (సునీల్). తనకు ప్రేమన్నా, ప్రేమికులన్నా అస్సలు పడదు. పైగా తన ఇంట్లో అంతా నల్లవాళ్లే. తన చెల్లాయికి కాబోయే భర్త అయినా తెల్లగా ఉండాలని అనుకుంటాడు. మరి... బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎలా కుదిరింది? తమ ప్రేమని పెద్దల చేత ఎలా ఒప్పించారు? అన్నదే మిగిలిన కథ.
* విశ్లేషణ
దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ చాలా చిన్నది. ప్రేమకు కులాలే కాదు, రంగు కూడా అడ్డు కాకూడదు అన్న విషయం చుట్టూ కథని అల్లాడు. తన కథ చిన్నది. పాత్రల పరిధి, సంఖ్య కూడా తక్కువే. కాబట్టి సినిమా అంతా ఒకే పాయింట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇది. అలాంటప్పుడు సన్నివేశాలు బలంగా ఉండాలి. వాటిని రూపొందించడంలో దర్శకుడి నేర్పు కనిపిస్తుంటుంది. ఏమీ లేని చోట.. చిన్న నవ్వో, ఎమోషనో ఇవ్వగలిగాడు. తెరపై కనిపించే నటీనటులంతా చాలా సహజంగా తమ పాత్రలత్లో ఇమిడిపోవడంతో, కథలో, సన్నివేశాల్లో బలం లేకపోయినా... ఏదో ఓ ఫీల్ అయితే ప్రేక్షకుడ్ని కూర్చోబెడుతుంది. అక్కడక్కడ కాస్త కామెడీ, ఎమోషన్ జోడించుకుంటూ వెళ్తుంటాడు. ప్రారంభమే కాస్త నత్త నడకగా ఉంటుంది. ఇంట్రవెల్ ముందు గానీ కథలోకి వెళ్లలేకపోయాడు దర్శకుడు. ఇంట్రవెల్ ముందు.. అసలు కథ ప్రారంభం అవుతుంది.
ద్వితీయార్థంలోనూ ఈ తడబాటు కనిపిస్తుంది. అక్కడక్కడే సినిమాని తిప్పుతున్న ఫీలింగ్. ఇంకా ఏదో ఉంటే బాగుండేది అనిపించకమానదు. అయితే పతాక సన్నివేశాల్లో దర్శకుడు బలం పుంజుకోగలిగాడు. ఎమోషన్ టచ్ ఇస్తూ... సినిమాని ముగించాడు. చివరి పావు గంటా.. దర్శకుడిలోని ప్రతిభ అర్థం అవుతుంది. ఈ సినిమాపై మనకున్న అభిప్రాయాన్ని కాస్త మార్చగలుగుతుంది. సునీల్, సుహాస్, వైవాహర్ష... ఇలా కామెడీ గ్యాంగ్ చాలా ఉన్నా, వాళ్ల నుంచి సరైన విధంగా నవ్వుల్ని రాబట్టుకోలేదు. నిజానికి ఇది కామెడీ సినిమా ఏమో అనుకుని సినిమా మొదలెడితే భంగపాటు తప్పదు. ఎక్కువగా ఎమోషనల్ జర్నీ అనుకోవాలి. వైవాహర్ష చేత కూడా ఎమోషనల్ డైలాగులు పలికించాడంటే దర్శకుడి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవొచ్చు.
* నటీనటులు
సుహాస్ తెలిసిన నటుడే. కాకపోతే హీరోగా ఇదే తొలి సినిమా. తన కామెడీ పంచ్‌లకు అలవాటు పడిన ప్రేక్షకుడికి సుహాస్ ఇంత సీరియస్ గా కనిపించడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే... జయకృష్ణ పాత్ర నడకకు, నడవడికకూ అలవాటైపోతే, ఆ బాధ కూడా ఉండదు. చాందిని అందంగా ఉంది. ఎక్కడా ఓవర్ చేయలేదు. ఈ కాంబో కాస్త ఆడ్ గా ఉంటుంది. కథ మూల ఉద్దేశం అదే కాబట్టి.. సర్దుకుపోవాల్సిందే. వైవాహర్షని బాగా వాడుకున్నారు. తనలోని కామెడీ టచ్‌తో పాటు, ఎమోషనల్ యాంగిల్ కూడా చూపించారు. సునీల్ విలన్ గా రాణించాడు. తన సీరియస్ లుక్స్ నచ్చుతాయి. ఎక్కడా ఓవర్ ది బోర్డ్ వెళ్లలేదు.
* సాంకేతిక వర్గం
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలు తీసిన సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ అందించారు. ఆ దర్శకుడి నుంచి ఇంత ఎమోషనల్ కథ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా మారింది. మాటలు అక్కడక్కడ నవ్విస్తుంటాయి. దర్శకుడిలో విషయం ఉంది. కొన్ని సన్నివేశాల్లో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో అది బాగా కనిపిస్తుంది. బడ్జెట్ పరంగా కొన్ని పరిమితులున్నాయి. అందుకే... క్వాలిటీ అక్కడక్కడ లోపిస్తుంది. తక్కువ లొకేషన్లు. కొన్ని లొకేషన్లలోనే సినిమా నడిపించేసినట్టు అనిపిస్తుంది. కావల్సినంత బడ్జెట్ ఇచ్చి, కోరుకున్న నటీనటుల్ని అందించి ఉంటే.. `కలర్‌ఫొటో` ప్రింటు మరింత బాగుండేది.
* ప్లస్ పాయింట్స్
సుహాస్, హర్ష, సునీల్
నేపథ్య సంగీతం
క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
బలహీనమైన పాయింట్
నిర్మాణ విలువలు
సాగదీత
* ఫైనల్ వర్డిక్ట్: ప్రింటు ఓకే!