'దర్బార్' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : రజినీకాంత్, నయనతార, సునీల్ శెట్టి తదితరులు 
దర్శకత్వం : ఎ.ఆర్.మురుగదాస్ 
నిర్మాత‌లు : లైకా ప్రొడక్షన్స్
సంగీతం : అనిరుద్
సినిమాటోగ్రఫర్ : సంతోష్ శివన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

 

రేటింగ్‌: 3/5

 

ర‌జ‌నీ అంటే స్టైల్‌.
ర‌జ‌నీ అంటే మాస్‌.
ఒక ఎక్స్‌ప్రెష‌న్‌తో సీన్ పండిస్తాడు.
హావ‌భావాల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాడు.
ఇదెలా ఉందంటే చాలు... అదిరింది అనాల్సిందే.
ఏ ద‌ర్శ‌కుడు ఆయ‌న‌తో సినిమా తీసినా వాళ్ల శైలి కంటే కూడా ర‌జనీ స్టైలే ప్ర‌ధానంగా మారిపోతుంటుంది. మ‌రి బ‌ల‌మైన క‌థ‌ల్ని తీసే ద‌ర్శ‌కుడిగా పేరున్న మురుగ‌దాస్ ర‌జ‌నీని ఎలా చూపించాడు? `ద‌ర్బార్` ఎలా ఉంది? స‌ంక్రాంతి సినిమాల్లో బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోణీ చేసేందుకు వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని ఏ మేర‌కు మెప్పిస్తుంది?  తెలుసుకుందాం ప‌దండి.

 

*క‌థ

 

ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌. బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రు క్ష‌ణం నుంచే రంగంలోకి దిగుతాడు. చీక‌టి సామ్రాజ్యాల భ‌ర‌తం ప‌డ‌తాడు. మాన‌వ హ‌క్కుల సంఘాలు అడ్డు చెప్పినా లెక్క చేయ‌డు. ముంబైలో మాద‌క ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రా ముఠా, మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా ముఠాల్ని అంతం చేస్తాడు. దీనివెన‌క ఉన్న పారిశ్రామిక వేత్త కొడుకు అజ‌య్ మ‌ల్హోత్రా (ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌)ని క‌ట‌క‌టాల్లోకి పంపుతాడు. కానీ మ‌ల్హోత్రా పేరుకు పారిశ్రామిక వేత్త కొడుకు కానీ, వాస్త‌వం వేరు. దాంతో పోలీసుల క‌ళ్లుగ‌ప్పి, జైల్లో నుంచే విదేశాల‌కి వెళ్లిపోతాడు. అలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌ల్హోత్రాని ఆదిత్య తిరిగి ఎలా ర‌ప్పించాడు? ఈ క్ర‌మంలో త‌న కూతురు వ‌ల్లి(నివిథా థామ‌స్‌)ని ఎలా పోగొట్టుకున్నాడు?  చీక‌టి సామ్రాజ్యం వెన‌క ఉన్న హ‌రిచోప్రా (సునీల్ శెట్టి)ని ఎలాబ‌య‌టికి ర‌ప్పించి అంతం చేశాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


*విశ్లేష‌ణ‌

 

నిజానికి చెప్పుకోద‌గ్గ క‌థేమీ లేదు. పైపెచ్చు ఇలాంటి పోలీస్ - చీక‌టి సామ్రాజ్య‌పు క‌థ‌ల్ని చాలానే చూశాం. కానీ చూడాల‌నిపించేలా, చూసినంత‌సేపూ బోర్ కొట్ట‌కుండా సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుందంతే కార‌ణం ర‌జ‌నీ స్టైల్‌, మురుగ‌దాస్ మార్క్ క‌థ‌న‌మే.  ర‌జ‌నీ - మురుగ‌దాస్ సినిమా అంటే క‌థ‌, క‌థ‌నాల గురించి చాలా అంచ‌నాలుంటాయి. కానీ ఇక్క‌డ మురుగ కూడా ర‌జ‌నీని ఒక ప్రొఫెష‌న‌ల్ ద‌ర్శ‌కుడిగా కంటే కూడా, ఒక అభిమానిగానే చూశాడు. దాంతో క‌థ పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ర‌జ‌నీని తానెలా చూడాల‌నుకుంటాడు, అభిమానుల‌కి ఆయ‌నెలా క‌నిపిస్తే బాగుంటుందో అలాగే చూపించాడు. దాంతో ఇది మ‌రో ర‌జ‌నీ సినిమా అనిపిస్తుందే త‌ప్ప‌, దీనిపై మురుగ ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌దు. 


క‌థ‌నం ప‌రంగా మాత్రం అక్క‌డ‌క్క‌డా త‌న‌దైన ముద్ర వేశారు. ర‌జ‌నీకాంత్‌ని ఇందులో మ‌రింత అందంగా, ఇంకా చాలా కాలంపాటు ఇలాంటి సినిమాలు మ‌రిన్ని చేయొచ్చ‌నిపించేలా చూపించాడు మురుగ‌దాస్‌. అవ‌న్నీ కూడా అభిమానుల్ని మెప్పించే విష‌యాలే.  ఎన్‌కౌంట‌ర్‌తో సినిమాని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు, త‌న మార్క్ క‌థ‌నంతో ప్రేక్ష‌కుల్ని సినిమాలో లీనం చేసేస్తాడు. డిప్యూటీ సీఎం కూతురు, ఆ అమ్మాయి స్నేహితులు కిడ్నాప్ కావ‌డం, ఆ కేసుని మైండ్ గేమ్‌తో మొద‌లుపెట్టి ఛేదించిన తీరు మెప్పిస్తుంది. ఆ స‌న్నివేశాల‌న్నీ కూడా `తుపాకీ` సినిమాని గుర్తు చేస్తాయి. ర‌జ‌నీ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌డం ఈ సినిమాకి ప్ల‌స్ అయ్యింది. హీరోయిజం డ‌బుల్ డోస్‌ని జోడించిన‌ట్టైంది. విదేశాల‌కి వెళ్లిపోయిన మ‌ల్హోత్రాని తిరిగి ర‌ప్పించి, జైల్లోనే మ‌ట్టుబెట్టిన తీరు మెప్పిస్తుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో న‌య‌న‌తార - ర‌జ‌నీకాంత్‌ల మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ ప్రపోజ‌ల్ స‌న్నివేశాలు వినోదాన్ని పంచుతాయి.  


ద్వితీయార్థంలో మాత్రం తండ్రీ కూతురు సెంటిమెంటే హైలెట్ అయ్యింది.  విలన్ హ‌రిచోప్రాని బ‌య‌టికి ర‌ప్పించేందుకు వేసే ఎత్తుగ‌డ‌లు, అక్క‌డ మైండ్‌గేమ్  ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు మ‌రింత మెరుగ్గా ఉండాల్సింద‌నిపిస్తుంది. ర‌జ‌నీ అభిమానుల‌కి పండ‌గ ఆనందాన్నిచ్చే చిత్ర‌మే ఇది.

 

*న‌టీన‌టులు

 

ర‌జ‌నీకాంత్ షో ఇది. ఆయ‌న న‌ట‌న‌, ఆయ‌న  స్టైలే సినిమాకి హైలెట్ అయ్యింది. చాలా హుషారుగా, కుర్రాళ్ల‌లాగా కండ‌లు కూడా చూపించాడు. అవ‌న్నీ కూడా అభిమానుల‌తో విజ‌ల్స్ వేయించే అంశాలే.  ఫైట్, డ్యాన్సుల్లోనూ అద‌ర‌గొట్టాడు ర‌జ‌నీ. నివేతాతో క‌లిసి సెంటిమెంట్నీ, న‌య‌న‌తార‌తో రొమాన్స్‌ని పండించాడు. న‌య‌న‌తార పాత్ర చిన్న‌దే. కానీ ఉన్నంత‌లో మెప్పిస్తుంది. నివేదా కూతురుగా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. కొన్ని స‌న్నివేశాల్లో క‌న్నీళ్లు తెప్పిస్తుంది.  సునీల్ శెట్టి ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపిస్తాడు. ఆయ‌న లుక్స్‌తోనే బ‌య‌పెట్టాడు. కానీ ఆ పాత్ర‌ని మ‌రింత శ‌క్తివంతంగా తీర్చిదిద్దాల్సిందేమో అనిపిస్తుంది. యోగిబాబు న‌వ్వించాడు.

 

*సాంకేతిక‌త‌

 

సాంకేతికంగా సినిమా బాగుంది. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, అనిరుధ్ సంగీతం  అదిరింద‌నిపించేలా ఉంది. దుమ్ము ధూళి పాటలో ర‌జ‌నీ స్టైల్‌ని చూపించారు. మురుగ‌దాస్ స్క్రీన్‌ప్లే, మైండ్‌గేమ్ స‌న్నివేశాలు హైలెట్గా నిలిచాయి. లైకా స్థాయి నిర్మాణ విలువ‌లు సినిమాలో క‌నిపిస్తాయి.

 

*ప్ల‌స్ పాయింట్స్‌

ర‌జ‌నీకాంత్ స్టైల్‌, ఆయ‌న న‌ట‌న  
మైండ్ గేమ్ స‌న్నివేశాలు
సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ

 

*మైన‌స్ పాయింట్స్‌

క‌థ
ప‌తాక స‌న్నివేశాలు
 

*ఫైన‌ల్ వర్డిక్ట్‌: `ద‌ర్బార్‌`... ర‌జ‌నీ అభిమానుల‌కి పండగే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS