నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక, రావు రమేష్, సుకన్య తదితరులు
దర్శకత్వం: భరత్ కమ్మ
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్.
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫర్: సుజిత్ సారంగ్
విడుదల తేదీ: 26 జులై, 2019
రేటింగ్: 2.75/5
విజయ్ దేవరకొండ రేంజ్ వేరిప్పుడు. తను స్టార్ హీరో అయిపోయాడు. సినిమా సినిమాకీ తన రేంజ్ పెరుగుతోంది. ఆశలు, అంచనాలూ పెరుగుతున్నాయి. దాన్ని బట్టే కథల్ని ఎంచుకుంటున్నాడు. సరికొత్త దర్శకులతో కలసి పనిచేస్తున్నాడు. యువతరానికి ప్రతినిధిగా మారిపోయాడు.
ఇప్పుడు విజయ్ సినిమా వస్తోందంటే థియేటర్లో కనిపించేది వాళ్లే. ప్రేమ, ఎమోషన్, కెమిస్ట్రీ, ఆప్రేమలో సంఘర్షణ,కాలేజీ నేపథ్యం, అక్కడి రాజకీయాలు - ఇలా వాళ్లకు కావల్సిన కథనే ఎంచుకున్నాడు. అదే.. `డియర్ కామ్రేడ్`. మరి ఈ సినిమాతో మరోసారి యువ ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టాడా?? మరో హిట్టు కొట్టాడా?
* కథ
చైతన్య (విజయ్ దేవరకొండ) కాకినాడలో చదువుతుంటాడు. అతనో విద్యార్థి నాయకుడు. ఇష్టపడినదాని కోసం పోరాడడం, సాధించడం తన నైజం. పక్కింట్లో లిల్లీ (రష్మిక) జాతీయ స్థాయి క్రికెటర్ కావాలని ఆశ పడుతుంది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అయితే ఆ ప్రేమకు, చైతన్యలోని ఆశయాలకు మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది.
ఆ సంఘర్షణ నుంచి వీరిద్దరూ ఎలా బయటపడ్డారు. తనలోని పోరాటతత్వాన్ని లిల్లీకి ఎలా అందించాడు? లిల్లీ ప్రేమ కోసం బాబీ అని పిలుచుకునే చైతన్య ఏమైనా మారాడా? తన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్నీ, ఆశయాల్నీ వదులుకున్నాడా? ఈ ప్రేమకథ చివరికి ఎలాంటి పరిస్థితుల మధ్య చిక్కుకుంది? అనేదే కథ.
* నటీనటులు
విజయ్ మరోసారి తన ప్రతిభను నూటికి నూరు పాళ్లూ బయటకు తీశాడు. మూడు షేడ్స్ ఉన్న పాత్ర అది. ఆ మూడింటిలోనూ తేడా స్పష్టంగా కనిపించింది. విద్యార్థి నాయకుడిగా ఎంత చలాకీగా కనిపిస్తాడో, ఆ తరవాతి దశలో అంతే మెచ్యూర్డ్‌గా నటించాడు. రష్మిక గురించి చెప్పాల్సిన పనిలేదు. ద్వితీయార్థంలో తన డామినేషనే ఎక్కువ.
తనకు దొరికిన మరో మంచి పాత్ర ఇది. వీరిద్దరి కెమిస్ట్రీనే ఈ సినిమాకి అండ, దండ. విజయ్ స్నేహితుల గ్యాంగ్‌లో అందరూ సహజంగా నటించారు. ఏ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో, ఎవరిని ఎంతలో వాడుకోవాలో దర్శకుడికి బాగా తెలుసు. అందుకే ప్రతీ పాత్ర తెరపై రాణించింది.
* సాంకేతిక వర్గం
ఎనిమిది పాటలున్న సినిమా ఇది. బహుశా ఈమధ్య కాలంలో ఇన్ని పాటలు ఏ సినిమాలోనూ వాడలేదేమో. ట్యూన్స్, సాహిత్యం.. రెండూ ఆకట్టుకున్నాయి. పాటల ప్లేస్‌మెంట్ కూడా బాగుంది. కథలో భాగంగానే ప్రతీ పాట వస్తుంది.
నేపథ్య సంగీతం, కెమెరా పనితనం ఇవి రెండూ కథ మూడ్‌ని బట్టే సాగాయి. మాటలు సహజంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు కాస్త ఆసక్తికరమైన ఎత్తుగడ ఎంచుకుంటే బాగుండేది. ట్రిమ్ చేయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వాటిపై దర్శకుడు దృష్టి పెట్టలేదు.
* విశ్లేషణ
డియర్ కామ్రేడ్ అంటే ఈ సినిమా అంతా విద్యార్థి రాజకీయాల చుట్టూ తిరిగే ప్రేమకథ అనుకుంటాం. కానీ.. అదేం కాదు. విద్యార్థి జీవితం ఓ భాగం మాత్రమే. ఇది బాబీ - లిల్లీల ప్రేమ ప్రయాణం. ఆ ప్రేమ కథ 5 ఏళ్లు సాగిన వైనం. ఈ మధ్యలో వచ్చే కోపతాపాలు, ఎమోషన్స్ ని తెరపై చూపించే ప్రయత్నం చేశారు. కాలేజీ నేపథ్యంలో కథ మొదలవుతుంది. లిల్లీ - బాబీల మధ్య సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. పాటలు హృదయానికి హత్తుకుంటాయి. మెల్లమెల్లగా కథలో ఎమోషన్ పార్ట్ మొదలవుతుంది. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మళ్లీ విడిపోవడానికి పరిస్థితులు, మళ్లీ కలుసుకోవడానికి కారణమైన వైనాలే `డియర్ కామ్రేడ్`.
ఈతరం దర్శకులు ఎలాంటి ఎమోషన్‌ని అయినా... రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ విషయంలో దర్శకుడు భరత్ కమ్మ కూడా అదే దారి ఎంచుకున్నాడు. ఈ కథ విషయంలో ఎన్నాళ్లు రిసెర్చ్ చేశాడో గానీ.. ప్రతీ విషయాన్నీ, ప్రతి ఫ్రేమునీ తెరపై వాస్తవిక కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు. దానికి తగిన నటీనటుల్ని, లొకేషన్లనీ ఎంచుకున్నాడు. చాలాసార్లు దర్శకుడి ఆలోచన చూస్తే ముచ్చటేస్తుంటుంది. కానీ.. అదే రియలిజం... కథని, కథనాన్ని నెమ్మదించేలా చేస్తుంది. చాలాసార్లు... సినిమా నిదానంగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
ప్రతీ విషయాన్నీ డిటైలింగ్‌గా చెప్పాలనుకునడంలో ఉండే ఇబ్బందే ఇది. ద్వితీయార్థంలో ఆ ఇబ్బంది మరింత ఇబ్బంది పెడుతుంటుంది. అయితే.. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడం, ఆ జంటని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించడం వల్ల... కాస్తలో కాస్త అందులోనూ ఉపశమనం దొరుకుతుంది. కథగా ఆలోచిస్తే... డియర్ కామ్రేడ్ సగటు కథే అనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ వల్ల కథలో కాన్లిఫ్ట్ పుడుతుందంతే.
అయితే ఆ కథనే వాస్తవిక కోణంలో చూపించాలనుకోవడం కొత్తగా అనిపిస్తుంది. విజయ్ నుంచి ఆశించే ఎనర్జిటిక్ సన్నివేశాలు ఈ సినిమాలో చాలా తక్కువగానే కనిపిస్తాయి. తొలిసగంతో పోలిస్తే ద్వితీయార్థం బాగా నెమ్మదిగా సాగుతుంది. ఇలాంటి ఫీల్ గుడ్, ఎమోఫన్ సినిమాలు చూసేవాళ్లకు బాగానే ఉన్నా - స్పీడ్ నేరేషన్ ఇష్టపడేవాళ్లకు మాత్రం ఈ ప్రయత్నం అంతగా రుచించదు.
* ప్లస్ పాయింట్స్
+విజయ్ - రష్మిక
+రొమాంటిక్ సీన్స్
+పాటలు
* మైనస్ పాయింట్స్
+ద్వితీయార్థం
+స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: విజయ్ - రష్మికల కోసం...
- రివ్యూ రాసింది శ్రీ.