తారాగణం: కార్తి, రకుల్ ప్రీత్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్
ఎడిటర్: అంథోని ఎల్ రూబెన్
సినిమాటోగ్రఫీ: వెల్ రాజ్
నిర్మాత: లక్ష్మణ్ కుమార్
దర్శకత్వం: రజత్ రవి శంకర్
విడుదల: ఫిబ్రవరి 14, 2019
రేటింగ్: 1.5/5
సినిమా అనేది ఓ ఎమోషన్. ఏ సినిమా చూసినా ఏదో ఓ ఎమోషన్‌ని ఇచ్చి తీరాలి. అలాంటి చిత్రాలే నిలబడతాయి. ప్రేమ, స్నేహం లాంటి కథలకు ఇలాంటి భావోద్వేగాలే కీలకం. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు పాత్రలతో ప్రయాణం చేయాలి. ప్రతీ పాత్రనీ తమతో అన్వయించుకోగలగాలి. ఈ విషయంలో ఎంత సక్సెస్ అయితే... సినిమా అంత బాగున్నట్టు.
దర్శకుడు ఏదో చెబుతున్నాడులే, నటీనటులు ఏదో చేస్తున్నారులే.. అని టికెట్టు కొన్న పాపానికి నీరసంగా సినిమాని చూసేస్తూ.. తెరపై కంటే సెల్ ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ దృష్టి పెట్టేటట్టు చేసే సినిమాలూ అప్పుడప్పుడూ వస్తుంటాయి. అలాంటి జాబితాలో 'దేవ్'కీ స్థానం ఉంటుంది.
కథ
దేవ్ (కార్తి) కి స్నేహమంటే ప్రాణం. ప్రతీదీ పాజిటీవ్ గా ఆలోచిస్తుంటాడు. సాహసాలంటే మరింత ఇష్టం. ప్రపంచంలోని అన్ని అందాల్నీ తన కెమెరాలో బంధిస్తుంటాడు. వెళ్లిన ప్రతి చోట నుంచీ మట్టి, నీరు సేకరించడం హాబీగా పెట్టుకుంటాడు. అమ్మాయిల ఊసెత్తడు. కానీ స్నేహితుల బలవంతంపై ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తనే.. మేఘన (రకుల్). మేఘన ప్రపంచం వేరు. చిన్నప్పుడే నాన్న తమని వదిలేసి వెళ్లిపోవడం వల్ల మగాళ్లంటే అయిష్టత పెంచుకుంటుంది. వ్యాపారమే తన ప్రాణం. ప్రతీదీ ఆ కోణంలోంచే ఆలోచిస్తుంటుంది. రెండు భిన్న ధవాల్లాంటి వీరిద్దరూ ఎలా కలిశారు? కలిశాక ఏమైంది? అనేదే కథ.
నటీనటుల పనితీరు..
దేవ్‌గా కార్తి నటన ఆకట్టుకుంటుంది. తన వల్లే ఈ సినిమాకి కాస్తయినా చూడగలం. అయితే దేవ్ పాత్రని రాసుకోవడంలోనే దర్శకుడు కొన్ని తప్పులు చేశాడు. ప్రతీ విషయాన్నీ పాజిటీవ్‌గా తీసుకునే దేవ్... ఒక్కసారిగా భగ్న ప్రేమికుడిగా మారిపోవడం ఏమిటో అర్థం కాదు. రకుల్ మగరాయుడులా కనిపిస్తుంది. ఆమెలో ఇది వరకటి గ్లామర్ కనిపించదు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ఇద్దరి పాత్రలూ సరిగా తీర్చిదిద్దలేదు. వాళ్లకెవరో డబ్బింగ్ చెప్పారు. తెలిసిన గొంతులకు మరొకరు డబ్బింగ్ చెప్పడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. దేవ్ స్నేహితుడిగా కనిపించిన నటుడు మరీ ఓవర్ చేశాడు.
విశ్లేషణ...
ప్రేమ, స్నేహం, సాహసం.. ఇలాంటి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే దర్శకుడు దేనికీ పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు. ఇదో ఫ్రెండ్ షిప్ స్టోరీలా మొదలవుతుంది. ఆ తరవాత... హీరో సాహసాలు కనిపిస్తాయి. ఆ తరవాత ప్రేమ కథలోకి వెళ్లిపోయాడు. లవ్ స్టోరీ చెబుతున్నప్పుడు మిగిలిన రెండు విషయాలూ మర్చిపోయాడు. లవ్ అంటే ఓ ఫీలింగ్. అది ఈ సినిమాలో ఏమాత్రం కనిపించదు. హీరోకి హీరోయిన్‌పై ప్రేమ ఎందుకు పుట్టిందో చెప్పలేదు.
అలానే ..అబ్బాయిలంటే ఏమాత్రం ఇష్టపడని కథానాయిక... దేవ్‌పై ఎలా మనసు పారేసుకుందో తెలీదు. ఈ జంటని కలపడానికే దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఇంట్రవెల్ వరకూ కథ ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. ఈలోగా కథని వినోదంగా నడపాల్సింది పోయి... పరమ బోర్ కొట్టించాడు. ప్రతీ సన్నివేశమూ... కథానాయకుడి పాత్రని ఎలివేట్ చేయడానికే వాడుకున్నాడు. కొన్ని సన్నివేశాలైతే మరీ కృత్రిమంగా అనిపిస్తాయి.
ద్వితీయార్థమైనా సవ్యంగా తీసుకెళ్లాడా అంటే అదీ లేదు. రోడ్ ట్రిప్ పేరిట మరో అరడజను సన్నివేశాలు సాగదీశాడు. అసలు ఈ సినిమాకి స్క్రిప్టు అంటూ ఉందా? లేదంటే దర్శకుడికి ఏం అనిపిస్తే అది తీసుకుంటూ వెళ్లాడా? అనే అనుమానం కూడా వస్తుంటుంది. హీరో హీరోయిన్లు విడిపోవాలి కాబట్టి, కొన్ని సన్నివేశాల్ని ఇరికించేశాడు. చివర్లో హీరో ఎవరెస్ట్ ఎక్కడం ఓ బోసన్. ఆ సన్నివేశాల్లో వాడిన గ్రాఫిక్స్ చూస్తే.. అప్పటి వరకూ ఈ సినిమాలో ఉన్న క్వాలిటీపై కూడా సందేహం వేస్తుంది. ఆఖరికి బైక్ పై వెళ్లిన సీన్లు కూడా సీజీ లో చేసేశారు.
సాంకేతిక వర్గం...
సినిమా లో రిచ్ లుక్ కనిపిస్తుంది. లొకేషన్ల వల్ల మరింత అందం వచ్చింది. నేపథ్య సంగీతం బాగున్నా.. పాటలు కుదరలేదు. డబ్బింగ్ సినిమా చూస్తున్నమన్న ఫీలింగ్‌ని మరింత బలంగా నాటుకుపోయేలా చేశాడు సంగీత దర్శకుడు. కథ, కథనాల్లోని లోపాలు.. ఈ సినిమాకి శాపాలు. పాత కథని, ఏమాత్రం ఆసక్తి లేకుండా నీరసంగా తెరకెక్కించారు.
* ప్లస్ పాయింట్స్
+ కార్తి
+ లొకేషన్లు
* మైనస్ పాయింట్స్
- బోరింగ్ స్క్రీన్ ప్లే
- కథ, కథనం
- దర్శకత్వం
పైనల్ వర్డిక్ట్: 'దేవ్' డే కాపాడాలి
రివ్యూ రాసింది శ్రీ.