తారాగణం: ప్రియా వారియర్, రోషన్, నూరిన్ షెరిఫ్, మాథ్యూ జోసఫ్, వైశాఖ్ పవనన్, అన్‌రాయ్ తదితరులు
సంగీతం: షాన్ రెహమాన్
ఎడిటర్: అచ్చు విజయన్
సినిమాటోగ్రఫీ: శీను సిద్ధార్థ్
నిర్మాతలు: ఎ. గురురాజ్, సి.హెచ్. వినోద్‌రెడ్డి
స్క్రీన్ ప్లే : సారంగ్ జయప్రకాష్, లిజో పనాడా
దర్శకత్వం: ఒమర్ లులు
విడుదల: ఫిబ్రవరి 14, 2019
రేటింగ్: 2/5
కన్నుకొట్టింది...
ముద్దుల గన్ను పేల్చింది...
ప్రపంచవ్యాప్తంగా కుర్రకారు గుండెల్లో అలజడి రేపింది.
ఆమే.. ప్రియా ప్రకాష్ వారియర్. తొలి సినిమా విడుదల కాక ముందే స్టార్ కథానాయికల్ని తలదన్నే రీతిలో ప్రాచుర్యం పొందిన భామ ఈమె. ఆమెని ఫేమస్ చేసిన ముద్దుల సన్నివేశం `ఒరు ఆధార్ లవ్` అనే మలయాళ చిత్రంలోనిదే. ఆ చిత్రం మలయాళంతో పాటు, తెలుగు, తమిళ భాషల్లోనూ అనువాదమై ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైంది. తెలుగులో `లవర్స్‌డే`గా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం...
కథ
రోషన్ (రోషన్)కి కాలేజీలో ఓ బ్యాచ్ ఉంటుంది. ప్రియా (ప్రియా వారియర్), గాథ జాన్ (నూరిన్ షెరిఫ్), మాథ్యూ (మాథ్యూ జోసెఫ్), పవన్ (వైశాఖ్ పవనన్)... వీళ్లంతా ఆ బ్యాచ్‌కి చెందినవాళ్లే. వీళ్లలో రోషన్, ప్రియా ఒకరినొకరు ఇష్టపడతారు. వాళ్లిద్దరి ప్రేమకి స్నేహితురాలు గాథ కూడా సాయపడుతుంది. ఇంతలో కాలేజీ వాట్సాప్ గ్రూప్‌లో అనుకోకుండా కొన్ని వీడియోలు షేర్ అవుతాయి. అవి రోషన్ నెంబర్ నుంచే షేర్ కావడంతో... కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు. అతనిపై ప్రియాకి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. దాంతో బ్రేకప్ చెప్పేస్తుంది. దాంతో స్నేహితులంతా కలిసి గాథని రంగంలోకి దింపుతారు.
రోషన్, గాథ ప్రేమలో ఉన్నట్టు నాటకమాడితే... అది చూసి ప్రియా ఈర్ష్య పడుతుందని, ఆ తర్వాత రోషన్‌కి దగ్గరవుతుందనేది వాళ్ల ఆలోచన. అందుకు తగ్గట్టుగానే రోషన్, గాథ ప్రేమ నాటకానికి సిద్ధమవుతారు. కానీ ఇద్దరి మధ్య నిజంగానే ప్రేమ పుడుతుంది. మరి ఆ ప్రేమ ఎంతదూరం వెళ్లింది? ప‌్రియా తిరిగి రోషన్‌ని ప్రేమించిందా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..
నటీనటుల విషయానికొస్తే ప్రియా వారియర్, మరో కథానాయిక నూరిన్ షెరిఫ్‌లకే ఎక్కు వ మార్కులు పడతాయి. వాళ్లిద్దరూ అందంతో ఆకట్టుకున్నారు. నూరిన్ మరింత హుషారుగా నటించింది. రోషన్ పాత్రకి చాలా ప్రాధాన్యముంది కానీ, అతను ఎప్పుడూ ఒకే రకమైన భావోద్వేగాలతో కనిపిస్తుంటాడు. స్నేహితుల గ్యాంగ్, లెక్చరర్ల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి.
విశ్లేషణ...
కళాశాల నేపథ్యంలో సాగే యువతరం కథలు తెలుగు తెరపైకి తరచుగా వస్తుంటాయి. స్నేహం, ప్రేమ, ఆకర్షణ, సరదాలు... ఇలా అన్ని కోణాల్నీ స్పృశిస్తుంటాయి తెలుగు సినిమాలు. వాటితో పోలిస్తే ఏ రకంగానూ కొత్తదనం లేని కథ ఇది. విషాదాంతంతో కూడిన ఓ కాలేజీ ప్రేమకథని రాసుకొన్న దర్శకుడు... చప్పగా సాగే సన్నివేశాలతో తీర్చిదిద్దాడు. దాంతో ఏ దశలోనూ ఆకట్టుకోదు ఈ సినిమా. ఇలాంటి కథలతో మంచి భావోద్వేగాలు పండించే అవకాశం ఉంటుంది. ప్రేమ చిగురించే సన్నివేశాలతో గిలిగింతలు పెట్టడం, ఎడబాటు సన్నివేశాలతో గుండె బరువెక్కించడం వంటి భావోద్వేగాలు పండినప్పుడే ప్రేమకథలు ఫలిస్తుంటాయి. ఇందులో ఆ ప్రయత్నాలు అస్సలు కనిపించలేదు.
కాలేజీలో విద్యార్థులకీ, లెక్చలర్లకీ మధ్య సన్నివేశాలు అక్కడక్కడా వినోదం పండిస్తాయి మినహా ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. కాలేజీలో చేరడం, ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, ఇష్టపడటం వంటి సన్నివేశాలతో ఆరంభమయ్యే ఈ సినిమా... ఫ్రెషర్స్ డే, యానువల్ డే వంటి సాధారణ సన్నివేశాలతో సాగుతుంది. జబర్దస్త్ ఎపిసోడ్ల తరహాలో యానువల్ డేలో నాటకం సన్నివేశాల్ని తీర్చిదిద్ది వినోదం పండించే ప్రయత్నం చేశారు. ద్వితీయార్థంలో గాథ, రోషన్‌ల మధ్య ప్రేమ పుట్టే సన్నివేశాలే కాస్త ఆసక్తిని పంచుతాయి.
పతాక సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. అయితే అవి అర్ధంతరంగా రావడంతో సినిమా అసంపూర్ణంగా ముగిసినట్టు అనిపిస్తుంది. ఈసినిమాకి మొదట రాసుకొన్న కథ వేరు, ఆ తర్వాత కథ వేరు. ప్రియా వారియర్ కన్నుకొట్టే సన్నివేశం ఆన్‌లైన్‌లో సంచలనం రేపిన తర్వాత కథలో మార్పులు చేశారు. అప్పటిదాకా చిన్న పాత్రకే పరిమితమైన ప్రియా వారియర్ పరిధిని పెంచారు. ఆ ప్రభావం సినిమాపై కథపై బలంగా పడినట్టు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం...
ఈ చిత్రంలో ఎనిమిది పాటలుంటాయి. సంగీతం, పాటల చిత్రీకరణ చిత్రానికి ప్రధాన బలం. కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. డబ్బింగ్ పరంగా మాత్రం చాలా లోపాలు కనిపిస్తాయి. మూడు నాలుగు పాత్రలకి మినహా, మిగిలిన ఏ పాత్రలకీ డబ్బింగ్ అతకలేదు. మాటలు కూడా చాలా చోట్ల కృతకంగా అనిపిస్తాయి. కథ, కథనాల విషయంలో దర్శకుడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. నిర్మాణ విలువలు నాసిరకంగా అనిపిస్తాయి.
విడుదలకి ముందే కావల్సినంత ప్రచారం మూటగట్టుకున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ వాటిని ఏ రకంగా కూడా అందుకోలేని చిత్రమిది. అక్కడక్కడా హాస్యం, కథానాయికల అందం మినహా ఇందులో చెప్పుకోదగ్గ విషయమేమీ లేదు. షార్ట్ ఫిల్మ్‌కి సరిపడా కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు.
* ప్లస్ పాయింట్స్
+ పాటలు
+ ప్రియా వారియర్
* మైనస్ పాయింట్స్
- కథ, కథనం
- నిర్మాణ విలువలు
పైనల్ వర్డిక్ట్: కన్నుకొట్టినా.. కష్టమే
రివ్యూ రాసింది శ్రీ.