నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్, పవిత్రా లోకేష్, రావు రమేష్ తదితరులు
దర్శకుడు : త్రినాధరావు నక్కిన
నిర్మాత: టి.జీ. విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రేటింగ్: 2.75/5
రవితేజకు ఈమధ్య అస్సలు కలసి రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా, వాటికి ఎంత హైప్ క్రియేట్ చేసినా... వర్కవుట్ అవ్వడం లేదు. ఈ యేడాది వచ్చిన రెండు సినిమాలూ (రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ) ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా వచ్చింది. అదే `ధమాకా`. రవితేజ రెండు పాత్రలు పోషించడం, శ్రీలీలని హీరోయిన్‌గా ఎంచుకోవడం, పాటలన్నీ హిట్టవడం, హిట్లతో మంచి ఊపుమీదున్న త్రినాథరావు నక్కిన దర్శకుడు కావడం.. ఇవన్నీ కలిపి `ధమాకా`పై హైప్ పెంచేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట పడిందా, లేదా?
* కథ
స్వామి, ఆనంద్ (రవితేజ) ఇద్దరూ ఒకేలా ఉంటారు. స్వామి మాస్ అయితే... ఆనంద్ క్లాస్. నెల రోజుల్లో ఉద్యోగం సంపాదించాలని స్వామి చూస్తుంటే, నెలలో వెయ్యిమందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆనంద్ ప్రయత్నిస్తుంటాడు. ఆనంద్ కంపెనీపై జేపీ (జయరాం) కన్నుపడుతుంది. జేపీ పరమ దుర్మార్గుడు. తాను ఎదగడం కోసం ఎంతమందినైనా తొక్కుకుంటూ వెళ్తాడు. టాప్ లో ఉన్న కంపెనీలను బెదిరించి లాక్కుంటాడు. అలా ఆనంద్ కంపెనీని హస్తగతం చేసుకోవాలని చూస్తాడు. మరి ఈ ప్రయత్నాన్ని ఆనంద్ ఎలా అడ్డుకొన్నాడు? అసలు స్వామి, ఆనంద్ ఒక్కరేనా? ఇద్దరా? వీరిద్దరినీ ఒకేసారి ప్రేమించిన ప్రణవి (శ్రీలీల) చివరికి ఎవరిని పెళ్లి చేసుకొంది? ఇవన్నీ `ధమాకా` చూసి తెలుసుకోవాల్సిందే.
* విశ్లేషణ
రవితేజ సినిమాల్లో ఈమధ్య కథాబలం అస్సలు ఉండడం లేదు. కేవలం కొన్ని సీన్లు, మాస్ మసాలా ఎలిమెంట్స్ నమ్ముకొని సినిమాలు లాగించేస్తున్నాడు. `ధమాకా` కూడా అంతే. ఇలాంటి రొడ్డకొట్టుడు మాస్, మసాలా సినిమాల్ని ఇది వరకు చాలాసార్లు చూసేశారు జనాలు. రవితేజ మళ్లీ దాన్నే నమ్ముకొన్నాడు. ఇద్దరిలా నటించే ఒక్కడి కథ ఇది. అలా ఎందుకు నటిస్తున్నాడు అనేదే అసలైన ట్విస్టు. ఆ ట్విస్టులో బలం లేదు. ఫ్లాష్ బ్యాక్ నీరసంగా సాగుతుంది. కాకపోతే.. అక్కడక్కడ రవితేజ మార్క్ సీన్లు బాగా పండాయి. రవితేజ ఎంట్రీ, లవ్ ట్రాక్.. హుషారుగా సాగిపోతాయి. రావు రమేష్ - హైపర్ ఆది ట్రాక్ నవ్విస్తుంది. ముఖ్యంగా... ఇంద్రకి స్పూఫ్ సీన్ చాలా బాగా పేలింది. దాంతో పాటు.. రావు రమేష్ - రవితేజల తిట్ల దండకం.. హైలెట్ అయ్యింది. ఇంట్రవెల్ లో ట్విస్టు ముందే తెలిసిపోయినా.. థియేటర్లో ఓ కిక్ వస్తుంది. పల్సరు బండి పాటని సరైన ప్లేస్‌మెంట్ లో వాడుకొన్నారు. ఆ పాట వచ్చినప్పుడు థియేటర్లు ఊగిపోతాయి.
ద్వితీయార్థం చాలా చప్పగా మొదలవుతుంది. అప్పటి వరకూ భీకరంగా చూపించిన విలన్.... హీరో వేసే లాజిక్ లెస్ ఎత్తులకు చిత్తయిపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హీరో ఆడే డ్రామా కళ్ల ముందు తెలిసిపోతున్నా... అంత పెద్ద విలన్ ఎందుకు సైలెంట్ గా ఉండిపోతాడో అర్థం కాదు. చాలా సన్నివేశాలకు లాజిక్ ఉండుద. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంతే. క్లైమాక్స్ అయితే మరింత రొటీన్ గా సాగుతుంది. మధ్య మధ్యలో భీమ్స్ అందించిన పాటలు, హైపర్ ఆది పంచ్‌లు ఓకే అనిపిస్తాయి. అలీ లాంటి నటుడు ఉన్నా సరిగ్గా వాడుకోలేదు. తనకు ఇచ్చినవి రెండు మూడు డైలాగులే.
* నటీనటులు
రవితేజ ఎనర్జీ ఈసినిమాలో వరదలై పొంగింది. తన వరకూ న్యాయం చేసేశాడు. తన ఫ్యాన్స్‌కి ఏం కావాలో అవి ఇచ్చేశాడు. శ్రీలీల మరీ అంత గ్లామర్ గా ఏం కనిపించలేదు. కాకపోతే.. పాటల్లో హుషారుగా స్టెప్పులేసింది. పల్సరు బండి, జింతాత పాటల్లో రవితేజను మించిన ఎనర్జీ చూపించింది. సచిన్ ఖేడ్కర్‌ది రొటీన్ పాత్ర. జయరాం పాత్రని బాగా డిజైన్ చేశారు. అయితే చివరి వరకూ అంతే ఇంపాక్ట్ గా ఆ పాత్ర ని చూపించలేకపోయారు.
* సాంకేతిక వర్గం
భీమ్స్ బాణీలు బాగున్నాయి. ఈ సినిమాకి బలం తన పాటలే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడు. పాటల్లో, ఫైట్లలో కొరియోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. అయితే కథ, కథనాల విషయంలో తప్పు జరిగింది. రొటీన్ కథని అంతే రొటీన్ గా తీశారు. రవితేజ ఎనర్జీ, పాటలే ఈ సినిమాకి ప్రధానమైన బలం. ఈ సినిమా మాస్ సెంటర్లలో కాస్తో కూస్తో నిలబడుతుంది. కానీ క్లాస్‌కి నచ్చకపోవొచ్చు. రొటీన్ కథ కావడం, సన్నివేశాల్లో బలం లేకపోవడం, కేవలం హీరో చేసే మ్యాజిక్ ని నమ్ముకోవడం ప్రతికూల అంశాలు.
* ప్లస్ పాయింట్స్
రవితేజ
పాటలు
హైపర్ ఆది ట్రాక్
* మైనస్ పాయింట్స్
కథ, కథనం
ట్విస్టు తేలిపోవడం
రొటీన్ క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: మాస్ రాజాకీ.. ఈసారీ సారీనే