నటీనటులు : రాజశేఖర్, స్వాతిదీక్షిత్, ఆహుతి ప్రసాద్ తదితరులు
దర్శకత్వం : రామ్‌గోపాల్ వర్మ
నిర్మాతలు : నట్టికుమార్
సంగీతం : డి.ఎస్.ఆర్
సినిమాటోగ్రఫర్ : సతీష్ ముత్యాల
ఎడిటర్: సత్య, అన్వర్
రేటింగ్: 1.5/5
వర్మ నుంచి ఎప్పుడు ఏ సినిమా వస్తుందో చెప్పలేం. ఆయనో ఫిల్మ్ ఫ్యాక్టరీ. ఎప్పుడూ సినిమాలు తయారవుతూనే ఉంటాయి. సినిమాని ఎప్పుడు మొదలెడతాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో, సడన్ గా ఎప్పుడు తీసుకొస్తాడో చెప్పలేం. కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. వాటి గురించి మళ్లీ ఆరా ఉండదు. ఎప్పుడే ఏడేళ్ల క్రితం మొదలైన `పట్టపగలు` సినిమా కూడా అలానే ఆగిపోయింది.
ఆ తరవాత.. ఈసినిమాని ఎవరూ పట్టించుకోలేదు. మర్చిపోయారు కూడా. అయితే సడన్ గా అందరికీ షాక్ ఇస్తూ... `ఆర్జీవీ దెయ్యం`గా పేరు మార్చి.. విడుదల చేశాడు. ఇన్నేళ్ల పాటు... ఆగిపోయిన ఈ దెయ్యం కథ... ఇప్పుడు రక్తి కట్టిందా, లేదా? ఆర్జీవీ దెయ్యం.. ప్రేక్షకుల్ని ఏ మేరకు భయపెట్టింది?
* కథ
శంకర్ (రాజశేఖర్) ఓ మెకానిక్. చాలా సాధారణమైన జీవితం. ఎలాంటి సమస్యలూ లేకుండా సవ్యంగా సాగిపోతుంటుంది. శంకర్ కూతురు విజ్జీ (స్వాతి దీక్షిత్) కాలేజీలో చదువుకుంటుంది. బుద్దిమంతురాలు. అయితే.. సడన్ గా విజ్జీ ప్రవర్తన వింతగా మారిపోతుంది.
దెయ్యం పట్టినదానిలా ప్రవర్తిస్తుంటుంది. గొంతు మార్చి మాట్లాడుతుంటుంది. ఆ ఊర్లో జరిగే హత్యలకు కూడా తానే కారణం అంటుంది. విజ్జీ ప్రవర్తన ఇలా తయారవ్వడానికి కారణమేంటి? విజ్జీలో ఎవరిదైనా ఆత్మ చేరిందా? చేరితే ఆ ఆత్మ ఎవరిది? ఇలాంటి విషయాలు చెప్పే కథ... `దెయ్యం`
* విశ్లేషణ
ఏడేళ్ల క్రితం మొదలైన సినిమా ఇది. కాబట్టి.... ఆసాంతం ఆ `పాత` వాసన కొడుతూనే ఉంటుంది. దెయ్యం సినిమాలు ఎలా తీయాలి? అనే విషయాన్ని ఈ తరానికి చెప్పిందే వర్మ. ఇప్పుడు ఆ దెయ్యం కథలు తీయడంలో.. ఆయన శిష్యులంతా ఆరితేరిపోయారు.
కానీ.. ఇప్పటికీ వర్మ పాత పద్ధతుల్లోనే భయపెట్టడం ఆశ్చర్యం వేస్తుంటుంది. వర్మ ఎప్పుడూ కథలకు ప్రాధాన్యం ఇవ్వడు. కథనం.. ఆ పాత్రలు ప్రవర్తించే తీరుపైనే వర్మ దృష్టి పెడతాడు. ఈసారీ.. అంతే. కాకపోతే.. కథనం, పాత్రీకరణ రెండూ చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. సింపుల్ నోట్ తో సినిమా మొదలవుతుంది. క్రమంగా.. విజ్జీ ప్రవర్తనలో మార్పు చూపించడం ద్వారా ప్రేక్షకుల్ని భయపెడదామనుకున్నాడు వర్మ. కొన్ని సందర్భాల్లో కాస్త ఒళ్లు జలదరిస్తుంది. కానీ పదే పదే పాత టెక్నిక్స్ వాడుకుంటూ పోవడం వల్ల... ఆ భయం కూడా నవ్వు తెప్పించేలా తయారవుతుంది.
ఈ తరహా కథ, కథనాలు, భయాలు.. తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. వర్మ ఇది వరకు చూపించిందే.కానీ పాత్రలు మారాయంతే. సినిమా మొత్తం అయిపోయాక... ఇదంతా సైకలాజికల్ డిజార్డర్ అని చెప్పడం కొన్ని సినిమాల్లో చూశాం. కాదు.. దెయ్యం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పడమూ చూశాం. దెయ్యమే కారణం అనుకుంటే... దర్శకుడి ఊహకు హద్దులుండవు. ఎలాగైనా భయపెట్టొచ్చు. అక్కడ ప్రేక్షకులు లాజిక్ అడగరు. అయినా సరే, భయపెట్టడంలో మరీ... బద్దకించాడు వర్మ. తొలిసగంతో పోలిస్తే.. ద్వితీయార్థమే కాస్త నయం. కాస్త ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. చివర్లో యధాలాపంగా, మరింత రొటీన్ గా సినిమాకి శుభం కార్డు వేసేశారు. సాధారణంగా.. ఎంత దెయ్యం కథైనా కథలో మలుపులు ఆశిస్తారు ప్రేక్షకులు. అవి కూడా ఈ దెయ్యంలో కనిపించలేదు.
* నటీనటులు
రాజశేఖర్ కి ఇది కొత్త తరహా ప్రయత్నం. అయితే ఈ పాత్రని సరిగా ఆయన అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. ఏదో అలా చేసుకుంటూ వెళ్లారు. స్వాతి దీక్షిత్ మాత్రం తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. ముందే చెప్పినట్టే ఏడేళ్ల క్రితం నాటి సినిమా ఇది. ఈమధ్య కాలంలో చనిపోయిన నటీనటులు కూడా తెరపై కనిపిస్తారు. ఉదాహరణకు.. దేవదాస్ కనకాల లాంటి వాళ్లు. ఆయా పాత్రలకు డబ్బింగులు ఎవరితో చెప్పించారో గానీ, అస్సలు సూట్ కాలేదు. దాంతో.. ఆ పాత్రలకు ప్రేక్షకులు కనెక్ట్ కావడం చాలా కష్టంగా మారింది.
* సాంకేతిక వర్గం
టెక్నికల్ గా వర్మ చాలా స్ట్రాంగ్. ఆ కెమెరా పనితనం, ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంటాయి. ఆర్.ఆర్ తో కూడా దడ పుట్టించగలడు. కానీ.. ఈ సినిమాలో అవి కూడా వర్కువుట్ కాలేదు. బడ్జెట్ సమస్యతో సినిమాని చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల ఆర్.ఆర్ మరీ రోత పుట్టించింది. షార్ట్ ఫిల్మ్ స్థాయి నాణ్యత కూడా కొన్ని చోట్ల కనిపించలేదు.
* ప్లస్ పాయింట్స్
వెదకడం కష్టం
* మైనస్ పాయింట్స్
అన్నీ రాయలేం..
* ఫైనల్ వర్డిక్ట్: భయపెట్టని దెయ్యం