ఈ న‌గ‌రానికి ఏమైంది రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి. అభినవ్, వెంకటేష్, సిమ్రాన్ & అనిషా అంబ్రోస్
నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మినేని
నిర్మాత: సురేష్ బాబు
రచన-దర్శకత్వం: తరుణ్ భాస్కర్

రేటింగ్: 3.25/5

కొత్త‌త‌రం సినిమా అంటారు క‌దా, అది ఎలా ఉంటుందో పెళ్లి చూపులుతో చూపించాడు త‌రుణ్ భాస్క‌ర్‌. అందులో పెద్ద క‌థేం ఉండ‌దు. కానీ దాన్ని చెప్పిన విధానం బాగుంటుంది. డ్రామా ఉండ‌దు... కానీ మాట‌ల్లో, పాత్ర‌ల న‌డ‌క‌లో.. న‌డ‌త‌లో స‌హ‌జ‌త్వం ఉంటుంది.

తెలుగు సినిమా మూల సూత్రాల్ని.. ప‌ట్టించుకోన‌ట్టు వ‌దిలేసి తీసిన సినిమా అది. యంగ్ ఏజ్ సినిమాకి కొత్త అర్థం ఇచ్చిన సినిమా అది. దాంతో కొత్త‌త‌రం ద‌ర్శ‌కుల్ని న‌మ్మి అవ‌కాశాలు ఇవ్వొచ్చు అన్న ధీమా వ‌చ్చింది. మ‌ళ్లీ అదే త‌రుణ్ భాస్క‌ర్ ఇప్పుడు `ఈ న‌గ‌రానికి ఏమైంది` అంటూ... మ‌రో ప్ర‌య‌త్నం చేశాడు. మ‌రి ఇది ఏ స్టైల్‌లో ఉంది?  త‌రుణ్ భాస్క‌ర్ పెళ్లి చూపులు సినిమాని గుర్తు చేశాడా?  లేదంటే.. కొత్త స్టైల్ నేర్పించాడా, లేదంటే తానే మారిపోయాడా?

* క‌థ‌

న‌లుగురు స్నేహితులు. సినిమా అంటే పిచ్చి. షార్ట్ ఫిల్మ్స్ తీసి.. తమ టాలెంట్‌ని నిరూపించుకుందామ‌నుకుంటారు. ఒక‌రు డైరెక్ట‌ర్‌, ఇంకొక‌రు కెమెరామెన్‌, ఒక‌రు.. న‌టుడు, మిగిలిన వాడు అసిస్టెంట్‌. కానీ ఇందులో ఒక‌రి ల‌వ్ ఫెయిల్యూర్‌, యాటిట్యూడ్‌.. గ్యాంగ్ మ‌ధ్య స్నేహాన్ని దెబ్బ‌తీస్తుంది. కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ క‌ల‌సి స‌ర‌దాగా గోవా వెళ్తారు. అక్క‌డో షార్ట్ ఫిల్మ్ తీద్దామ‌నుకుంటారు. ఆ ప్ర‌య‌త్నంలో, ఆ ప్ర‌యాణంలో ఏం జ‌రిగింది? అనేదే `ఈ న‌గ‌రానికి  ఏమైంది` క‌థ‌.

* న‌టీన‌టులు 

న‌లుగురు స్నేహితులుగా క‌నిపించిన‌వాళ్లూ. తెలుగు తెరకు కొత్త‌వాళ్లే. కానీ... అనుభ‌వం ఉన్న‌వాళ్లుగా న‌టించారు. వివేక్ న‌ట‌న బాగుంది. చూడ్డానికి అందంగా ఉన్నాడు. కౌశిక్ గా క‌నిపించిన కుర్రాడు ఇంకొన్ని రోజులు గుర్తుండిపోతాడు. వినోదం పంచే బాధ్య‌త తానొక్క‌డే తీసుకున్నాడు. తాను వేసిన ప్ర‌తీ డైలాగూ.. ఇచ్చిన ప్ర‌తీ చిన్న ఎక్స్‌ప్రెష‌నూ ఆడియ‌న్స్‌కి న‌చ్చుతుంది. అనీషా అంబ్రోస్ ఇంత‌కాలానికి చ‌క్క‌గా క‌నిపించింది. ఇదంతా ద‌ర్శ‌కుడి, కెమెరా మెన్ నైపుణ్యం అనుకోవాలి.

* విశ్లేష‌ణ‌ 

నిజంగా ఇలాంటి క‌థ త‌రుణ్ భాస్క‌ర్ కాకుండా మ‌రొక‌రు ప‌ట్టుకెళ్తే.. సురేష్ బాబు ఒప్పుకునేవాడా? క‌చ్చితంగా కాదు. కానీ.. త‌రుణ్ భాస్క‌ర్ లైన్ చెప్ప‌గానే మరేమి ఆలోచించ‌కుండా `షూటింగ్ ఎక్క‌డ పెట్టుకుంటారు` అని అడిగాడు. దానికి కార‌ణం `పెళ్లి చూపులు` ఇచ్చిన న‌మ్మ‌కం. క‌థ లేక‌పోయినా.. త‌రుణ్ భాస్క‌ర్ చేయ‌గ‌ల మ్యాజిక్ ఏమిటో సురేష్ బాబుకి బాగా తెలుసు. అందుకే.. ఈ సినిమా ప‌ట్టాలెక్కింది.

 

త‌రుణ్ కూడా త‌న న‌మ్మ‌కాన్ని ఎక్క‌డా వ‌మ్ము చేయ‌లేదు. ఓ న్యూ ఏజ్ స్టోరీ ని చూపించాడు. న‌వ‌త‌రం ఎలా ఉంది? ఎలా మాట్లాడుకుంటుంది?  ఏం చేస్తుంది?  వాళ్ల ఆలోచ‌న‌లు, చిలిపి ప‌నులు, తాగితే వేసే వేషాలు ఎలా ఉన్నాయి?  ఇవ‌న్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు. ఎక్క‌డా డ్రామా లేదు. అంత‌టా స‌హ‌జ‌త్వమే. దాంతో ఆ గ్యాంగ్‌లో మ‌న‌మూ ఒక‌రేమో అన్న ఫీలింగ్ వ‌స్తుంది. ఆ పాత్ర‌ల‌తో క‌ల‌సి ప్ర‌యాణం చేయాల‌నిపిస్తుంది. పాత్ర‌ల యాటిడ్యూడ్ అర్థం కావ‌డానికి, ఏ పాత్ర ఎలా మ‌సులుకుంటుందో తెలియ‌డానికి కాస్త టైమ్ ప‌డుతుంది. ఆ త‌ర‌వాత మెల్ల‌గా క‌థ‌లోకి పాత్ర‌ల్లోకి వెళ్లిపోతాం. 

`ట్రూత్ ఆర్ డేర్‌` కాన్సెప్టు నుంచి న‌లుగురు స్నేహితుల ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వ‌డం.. అక్క‌డ ఒకొక్క‌రి క‌థ చెప్ప‌డం బాగుంది. గోవా ట్రిప్‌కి వెళ్లాల‌నుకోవ‌డం, అందుకోసం చేసే ప్ర‌య‌త్నాలు న‌వ్విస్తాయి. సెకండాఫ్ అంతా గోవాలోనే. తొలి భాగంతో పోలిస్తే... ద్వితీయార్థం నెమ్మ‌దించిన‌ట్టు అనిపిస్తుంది. కానీ.. అక్క‌డ‌క్క‌డ త‌రుణ్ భాస్క‌ర్ ర‌చ‌యిత‌గా మెరవ‌డం, క్లైమాక్స్ లో మ‌ళ్లీ.. ఫ్రెండ్ షిప్‌, ఎమోష‌న్‌ని ట‌చ్ చేయ‌డంతో లైన్‌లోకి వ‌చ్చేస్తాడు. 

జింద‌గీ నా మిలేగీ దుబారా, దిల్ చ‌హ‌తాహై, హ్యాంగోవ‌ర్‌.... ఇలాంటి క‌థ‌ల్ని చూసి, మెచ్చుకుని ఊరుకున్నాం. కానీ త‌రుణ్ భాస్క‌ర్ మాత్రం అలాంటి క‌థ‌ని తెలుగు తెర‌పై చూడాల‌నే ప్ర‌య‌త్నం చేశాడు. అదే ఈ సినిమా. అక్క‌డ‌క్క‌డ కొన్ని సినిమాల రిఫ‌రెన్సులు క‌నిపించాయి. కానీ.. వాటినీ పెద్ద మ‌న‌సుతో క్ష‌మించేయొచ్చు.

* సాంకేతికంగా..

ఇది భారీ బ‌డ్జెట్ సినిమా కాదు. సెట్టింగులు లేవు. క‌థ‌కు ఏం కావాలో అదే క‌నిపించింది. న‌డి రోడ్డుపై తీసినా.. స‌న్నివేశం, సంభాష‌ణ‌ల్లో బ‌లం వ‌ల్ల‌.. అన్ని సీన్లూ నిల‌బ‌డిపోయాయి. ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా, మాట‌ల ర‌చ‌యిత‌గా త‌రుణ్ మ‌ళ్లీ స‌క్సెస్ అయ్యాడు. వివేక్ సాగ‌ర్ సంగీతం హాయిగా, ట్రెండీగా ఉంది. పాట ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పూర్త‌య్యిందో తెలియ‌నంత లీన‌మైపోయింది క‌థ‌లో.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ డైలాగులు
+ వినోదం
+ పాత్ర‌ల్లో స‌హ‌జ‌త్వం
+ సంగీతం

* మైన‌స్ పాయింట్స్‌

- కేవ‌లం యూత్ కోస‌మే

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  న‌గ‌ర‌మంతా చూడొచ్చు 

రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS