నటీనటులు: అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర తదితరులు
దర్శకత్వం: వెంకట్ రామ్‌జీ
నిర్మాణం : వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె.
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్: వంశీ పచ్చిపులుసు
విడుదల తేదీ: ఆగస్టు 15, 2019
రేటింగ్: 3/5
క్షణం, గూఢచారి సినిమాలతో థ్రిల్లర్ కథలు జనాలకు ఎంత చేరువ అవుతాయో.. నిరూపించాడు అడవి శేష్. ఈ తరహా కథలకు తను కేరాఫ్ అడ్రస్స్‌గా మారిపోయాడు. ఇప్పుడొచ్చిన తన కొత్త సినిమా `ఎవరు` కూడా థ్రిల్లరే. కాకపోతే... ఈసారి రీమేక్ కథని ఎంచుకున్నాడు. కథ మనది కాకపోయినా... మలుపులకు మాత్రం కొదవ లేకుండా చూసుకున్నాడు. మరి ఈసారి అడవిశేష్ ప్రయత్నం ఏమైంది? మలుపులు ఆకట్టుకున్నాయా? థ్రిల్లర్ చిత్రాల ద్వారా తన విజయ పరంపర కొనసాగించాడా?
* కథ
సమీర (రెజీనా) డీఎస్పీ అశోక్ (నవీన్‌చంద్ర)ని హత్య చేస్తుంది. అశోక్ తనని అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం వల్లే, ఆత్మ రక్షణ కోసం అశోక్‌ని చంపేశానని వాంగ్మూలం ఇస్తుంది. ఈ కేసు విక్రమ్ వాసుదేవ్ (అడవిశేష్) చేతుల్లోకి వెళ్తుంది. తానో లంచగొండి అధికారి. డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు.
సమీరని ఈ కేసు నుంచి కాపాడేందుకు లంచం తీసుకుంటాడు. సమీరని కాపాడే ఉద్దేశంతో తన నుంచి నిజాల్ని రాబట్టే ప్రయత్నం చేస్తాడు. ఓ దశలో వినయ్ వర్మ (మురళీశర్మ) మిస్సింగ్ కేసుకీ, అశోక్ హత్య కేసుకీ ఓ లింకు ఉందినిపిస్తుంది. ఇంతకీ వినయ్ వర్మ ఎవరు? ఈ రెండు కేసులకూ ఉన్న సంబంధం ఏమిటి? సమీర - అశోక్ విషయంలో ఏం జరిగిందన్నదే కథ.
* నటీనటులు
ఈ తరహా చిత్రాల్లో నటించడంలో ఉద్దండుడు అనిపించుకున్నాడు అడవిశేష్. మరోసారి... తనదైన నటన ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. తనకు ఓరకంగా టైలర్ మేడ్ పాత్ర అని చెప్పాలి. చాలా కాలం తరవాత రెజీనాకు మంచి పాత్ర పడింది.
తనలోని నటిని పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చింది. నవీన్ చంద్ర పాత్ర కూడా కథలో కీలకమే. పవిత్ర లోకేష్, మురళీ శర్మ పాత్రల పరిధి మేరనకు నటించి మెప్పించారు.
* సాంకేతిక వర్గం
టెక్నీషియన్లు బలంగా లేకపోతే ఇలాంటి కథలు తేలిపోతుంటాయి. కెమెరా, నేపథ్య సంగీతం పర్‌ఫెక్ట్ గా కుదిరాయి. రన్ టైమ్ కూడా చాలా తక్కువ. ఎడిటింగ్ షార్ప్‌గా చేసుకున్నారు.
ద్వితీయార్థంలో అక్కడక్కడ సినిమా కాస్త నెమ్మదించినా - బోర్ కొట్టకుండా కూర్చోబెట్టగలుగుతుంది. రామ్‌జీ దర్శకుడిగా సక్సెస్ అయినట్టే.
* విశ్లేషణ
బద్లా అనే హిందీ చిత్రానికి ఇది రీమేక్. ఇలాంటి కథల్ని రీమేకులుగా తీసి, మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. మార్పులు, చేర్పుల వల్ల అసలు కథకీ, అందులోని మలుపులకూ విఘాతం కలగకూడదు. ఆ జాగ్రత్తలన్నీ కొత్త దర్శకుడు రామ్ జీ పక్కాగా తీసుకున్నాడు. ఇది పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. పాత్రల తీరు తెన్నులు, వాళ్ల మానసిక పరిపక్వత ఇవన్నీ కథలో అంతర్భాగం అవుతుంటాయి.
ఇలాంటి కథలు చెప్పడానికి చాలా నేర్పు కావాలి. అది తనకు ఉందని రామ్ జీ నిరూపించాడు. నేరుగా ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. తొలి సన్నివేశం నుంచే `ఈ సినిమా కథ ఇదీ` అని చెప్పే ప్రయత్నం చేశాడు. కథలో వస్తున్న మలుపులు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రేక్షకుడ్ని ఓ గెస్‌లో పడేసి, దానికి విరుద్ధమైన మలుపుని తెరపై చూపించి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. కొన్నిసార్లు కొన్ని మలుపుల్ని ప్రేక్షకులకూ పట్టుకోగలరు. ద్వితీయార్థంలో కథనం బాగా నెమ్మదించింది. క్లైమాక్స్‌కి ముందు కాస్త గాడిలో పడింది.
క్లైమాక్స్ ట్విస్టు కూడా ఎవ్వరూ ఉహించనిదే. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇవ్వడం ఈ సినిమాకి ఎంత ప్లస్ అయ్యిందో, అదే మైనస్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. మితిమీరిన మలుపుల వల్ల.. ప్రయాణం సాఫీగా సాగదు. కాకపోతే ఇలాంటి మలుపులే థ్రిల్లర్ చిత్రాలకు బలం.. బలగం. దాంతో.. `ఎవరు` కూడా మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది. కొన్నిచోట్ల ప్రేక్షకులు గందరగోళానికి గురైనా, స్క్రీన్ ప్లే వేగాన్ని అందుకోకపోయినా.. కథ నుంచి పక్కకు జరిగే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు తెరపై ఏం జరిగిందా? అంటూ కాస్త వెనక్కి వెళ్లి ఆలోచించుకోవాల్సివస్తుంది. తరచూ థ్రిల్లర్ చిత్రాలు చూసేవాళ్లు మాత్రం ఈరకమైన స్క్రీన్ ప్లేని ఆస్వాదిస్తారు.
* ప్లస్ పాయింట్స్
శేష్
ట్విస్టులు
టెక్నికల్ టీమ్
* మైనస్ పాయింట్స్
సెకండాఫ్ స్లో
* ఫైనల్ వర్డిక్ట్: ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో...
- రివ్యూ రాసింది శ్రీ