'ఎఫ్ 3' మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, మురళీశర్మ, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
సంగీత దర్శకుడు: దేవీశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు


రేటింగ్: 3/5


తెలుగు ప్రేక్షకులకు బోర్ కొట్టని జోనర్.. కామెడీ. నవ్వించే సినిమాలని ఆదరించడానికి ఎప్పుడూ సిద్దంగా వుంటారు. అందుకే ఎఫ్ 2కి బ్రహ్మరధం పట్టారు ప్రేక్షకులు . ఎవరూ ఊహించని విజయాన్ని ఇచ్చారు. ఎఫ్ 2ఇచ్చిన జోష్ తో ఎఫ్ 3ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చింది దిల్ రాజు అండ్ టీమ్. ఎఫ్ 2కి మించిన వినోదం ఎఫ్ 3లో వుంటుందని ప్రామిస్ చేశారు. నవ్వులు గ్యారంటీ గా ఇచ్చారు. నవ్వించాలని కంకణం కట్టుకున్నామన్నారు. రాజేంద్ర ప్రసాద్ మరో అడుగు ముందుకు వేసి ఈ సినిమా ఆడకపోతే మళ్ళీ కనిపించని శపథం కూడా చేశారు. మరి ఎఫ్ 3టీం ఇంత ధీమాగా హామీ ఇచ్చిన నవ్వులు సినిమాలో పండాయా? ఎఫ్ 2కి మించిన వినోదం అందించడంలో ఎఫ్ 3 సక్సెస్ అయ్యిందా ? అసలీ సమ్మరు సోగ్గాళ్ళా కథలోకి వెళితే.... 


కథ:


వెంకీ (వెంకటేష్ ) మిడిల్ క్లాస్ మ్యాన్. బోనస్ గా రేచీకటి కూడా వుంటుంది. పొద్దున్న లేచిన దగ్గరనుండే అన్నీ మనీ కష్టాలు. అందుకే ఎలాగైనా షార్ట్ కట్ లో డబ్బు సంపాయించాలని షార్ట్ కట్ బిజినెస్ లు చేస్తుంటాడు. హారిక (తమన్నా) ఫ్యామిలీని నమ్మి రఘుబాబుతో కలసి 60 లక్షలు పెట్టుబడి మంగ టిఫిన్ సెంటర్ పెట్టిస్తాడు. తమన్నా ఫ్యామిలీ పెద్ద కంచు. ఆ డబ్బులన్నీ స్వాహా చేస్తుంది తమన్నా ఫ్యామిలీ. కట్ చేస్తే వరుణ్ యాదవ్ ( వరుణ్ తేజ్) అనాధ. బోనస్ గా నత్తి వుంటుంది. ఎలాగైనా కోటీశ్వరుడై పోవాలని పగటి కలలు కంటుంటాడు. హనీని (మెహరీన్) చూసి ఇష్టపడతాడు. ఐతే ఆ ఇష్టం ప్రేమతో వచ్చింది కాదు.. హనీ రిచ్ అని భ్రమపడి ఆమెని ముగ్గులో దించడానికి ఇష్టపడతాడు.


వీరి ప్రేమకి వెంకీ డబ్బులు స్పాన్సర్ చేస్తాడు. హనీ ఆస్తి కొట్టేసి సెటిల్ అయిపోవాలని వెంకీ వరుణ్ ప్లాన్.. కట్ చేస్తే హానీ పునుగుల పొట్లాలు కట్టుకునే బాపతని తెలిసీ మూర్చపోతారు వెంకీ, వరుణ్. ఈలోగ ఎస్ ఐ నాగరాజు( రాజేంద్ర ప్రసాద్ ) రూపంలో రెండు కోట్ల డబ్బు, డైమండ్స్ దొంగతనంలో ఇరుక్కుంటారు. ఈ కష్టాలన్నీ తీరాలంటే విజయనగరం వెళ్ళటమే మార్గమని నిర్ణయించుకుంటారు. ఇంతకీ విజయనగరంలో ఏముంది ? దొంగతనం కేసు నుండి బయటపడ్డారా ? వీరి డబ్బు కష్టాలు తీరయా ? అనేది మిగిలిన కథ. 


విశ్లేషణ:


సినిమాలు తీయడంలో ఒక్కోదర్శకుడిది ఒక్కో విధానం. కొందరు దర్శకులు పదికాలాలు నిలిచిపోయే సినిమాలు చేస్తారు. మరికొందరు ఆ పూటకి నవ్విస్తే చాలు అనుకోని రంగంలోకి దిగుతారు. అనిల్ రావిపూడి ఎఫ్ 2 సిరిస్ రెండో కేటగిరిలోకి వస్తుంది. లాజిక్కులు వెతకొద్దు, కంటిన్యూటీ అడగొద్దు.. జస్ట్ నవ్వండి చాలు.. ఇదే అనిల్ రావిపూడి స్టయిల్. ఎఫ్ 2ఇదే స్టయిల్ లో నవ్వులు పంచారు. ఇప్పుడు ఎఫ్3లో కూడా ట్రిపుల్ డోస్ ఫన్ ఇవ్వడంలో విజయం సాధించారు. డబ్బు చుట్టూ తిరిగే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డబ్బు పిచ్చిలో భర్తని అమ్మేసిన భార్యకథ శుభలగ్నంలో చూశాం. ఆహానా పెళ్ళాంటా కూడా డబ్బు పిసినారి కథే. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వేంకటేషా, ఆ ఒక్కటి అడక్కూ.. ఇలా చాలా సినిమాలు డబ్బు చుట్టూ తిరిగే కధలే. అలాంటి ఓ డబ్బు కథనే ఎఫ్ 3లో చూపించాడు అనిల్ రావిపూడి. అయితే ఈ కథకు అనిల్ ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం హిలేరియస్ గా వుంది. 


ఎఫ్ 2 సక్సెస్ అనిల్ రావిపూడిలో చాలా కాన్ఫిడెన్స్ నింపింది. అందుకే ఎఫ్ 3లో ఇంకాస్త స్వేఛ్చ తీసుకున్నాడు. ఎక్కువగా అలోచించలేదు. ప్రతి సీన్ లో నవ్వుతున్నారా లేదా ? అనే కొలత మాత్రమే తీసుకున్నాడు. సినిమా మొదలైనప్పటి నుండే ఫన్ కోసం వెతుక్కున్నాడు. ప్రతి పాత్రలో వినోదాన్ని దాదాపుగా పిండేశాడు. సినిమా ఫస్ట్ అంతా నవ్వులు వానే. తమన్నా ఫ్యామిలీని నమ్మి వెంకీ మోసపోవడం, వరుణ్ హనీ ప్రేమలో మోసపోవడం, రాజేంద్ర ప్రసాద్ నిజాయితీలో మోసపోవడం, పాల బేబీగా అలీ వినోదం, వెంకీ రేచీకటి ఎపిసోడ్స్ హిలేరియస్ గా వచ్చాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా అడుగడుగునా వినోదాల్ని పంచుకుంటూ వెళ్ళిపోయారు. 


సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి బిగినింగ్ లో కొంచెం తడబాటు కనిపించింది. విజయనగరం మురళీ శర్మ ఇంట్లో నడిపించిన 'చంటబ్బాయి' డ్రామా పుంజుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నారు. ఐతే సోనాల్ పాత్ర ఎంట్రీ చంటబ్బాయి డ్రామా కూడా అదిరిపోయింది. వూఆహ ,లైఫ్ అంటే ఇట్లా వుండాలా పాటలు కూడా సెకండ్ హాఫ్ కి కలిసొచ్చాయి. కిడ్స్ టాయ్స్ ఎపిసోడ్ కూడా భలే వాడేశారు. అందరి హీరోల ఇమేజ్ ని వాడుకుంటూ థియేటర్ లో విజల్స్ వేయించారు.
ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి నవ్వుల వాన కాస్త తుఫాన్ గా మారిపోయింది. లాజిక్కులు లేవు .. ఓన్లీ లాఫింగులే. పాన్ ఇండియా క్లైమాక్స్ తో చేసిన హంగామా మామూలుగా లేదు.


నారప్పగా వెంకటేష్, వకీల్ సాబ్ గా వరుణ్ తేజ్ వారెవ్వా .,. అది మామూలు వినోదం కాదు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి ఎఫ్ 4తో మళ్ళీ వస్తున్నాం నవ్వడానికి రెడీగా ఉండండని చెప్పి శుభం కార్డు వేశారు. మొత్తానికి సినిమా థియేటర్ లో నవ్వులు వర్షం కురిపించింది. ఐతే ఇంత హిలేరియస్ గా సాగిన ఎఫ్ 3లో కొన్ని లోపాలు కూడా కనిపిస్తాయి. ఎఫ్ 2తో పోలిస్తే ఎఫ్ 3లో ఒరిజినాలిటీ తగ్గింది. ఫస్ట్ హాఫ్ లో 'తిరుమల తిరుపతి వెంకటేశా' ట్రాక్ ని వాడేశారు. అలాగే సెకండ్ హాఫ్ చంటబ్బాయ్ ట్రాక్ ని దించేశారు. అలాగే క్లైమాక్స్ లో టాయ్స్ ఎపిసోడ్ లో బొమ్మల మార్కెట్ పెంచే విధానం 'ఆ ఒక్కటి అడక్కూ'' లో అటుకుల చిట్టిబాబుని గుర్తు తెస్తుంది. ఇవే కాదు..చాలా సినిమాల రిఫరెన్స్ లు ట్రాకులు ఇందులో కనిపిస్తాయి. అయితే అనిల్ రావిపూడి చాలా తెలివిగా కొత్త ట్రీట్ మెంట్ తో వాటిని ప్రజంట్ చేశాడు . 


నటీనటులు :


వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ ఈ చిత్రానికి సోల్. వెంకటేష్ టైమింగ్, ఎనర్జీ ఎఫ్ 2కి మించిపోయాయి. చాలా హుషారుగా కనిపించారు. కామెడీ, డ్యాన్స్, యాక్షన్ ఇలా అన్నీ అద్భుతంగా చేశారు. రికార్డింగ్ డ్యాన్స్ పాటలో వెంకీ ఎనర్జీ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. రేచీకటి ఎపిసోడ్స్ కూడా భలే వచ్చాయి. వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ ఇంకా బెటర్ అయ్యింది. కొన్ని సీన్స్ లో వెంకీతో పోటిపడి నటించాడు. నత్తి మ్యానరిజం కూడా ఆకట్టుకుంది.


తమన్నాకి సెకండ్ హాఫ్ లో డిఫరెంట్ రోల్ ఇచ్చారు. హానీ పాత్రలో మెహరీన్ మరోసారి ఆకట్టుకుంది. సునీల్ టైమింగ్ ని మరోసారి పట్టుకున్నాడు అనిల్ రావిపూడి. చాలా చోట్ల పాత సునీల్ కనిపిస్తాడు. రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు, రఘుబాబు పాత్ర కూడా బావుంది. అలీ పాల బేబీగా నవ్వించారు. సోనాల్ చౌహాన్ డి గెస్ట్ రోల్ లాంటి పాత్ర. వెన్నెల కిషోర్, మురళీ శర్మ, సత్య , అన్నపూర్ణ, వై విజయ,పృద్వీ ఇలా తెరపై కనిపించిన అందరూ వినోదాన్ని పంచారు


టెక్నికల్ గా సినిమా రిచ్ గా వుంది. దేవిశ్రీ మ్యూజిక్ ఆకట్టుకుంది. పాటలన్నీ బావున్నాయి. నేపధ్య సంగీతం కూడా బావుంది. కెమరా పని తనం రిచ్ గా వుంది. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు 


ప్లస్ పాయింట్స్ 


వెంకటేష్, వరుణ్ తేజ్ అండ్ కో 
అవుట్ అండ్ అవుట్ కామెడీ 
మ్యూజిక్ 


మైనస్ పాయింట్స్ 


సెకండ్ హాఫ్ లో కొన్ని రొటీన్ సీన్లు


ఫైనల్ వర్దిక్ట్  : ఎఫ్ 3.. నవ్వుల వర్షం!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS