నటీనటులు: విశ్వక్ సేన్, సలోని మిశ్ర, హర్షిత గౌర్, ప్రశాంతి, భాస్కర్, ఉత్తేజ్ తదితరులు.
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాతలు: కరాటే రాజు
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫర్: విద్య సాగర్ చింత
ఎడిటర్: రవి తేజ గిరజాల
విడుదల తేదీ: మే 31, 2019
రేటింగ్: 2.25/ 5
తెలుగు సినిమా `తెలంగాణ` కథల్ని ఎక్కువగా నమ్ముకుంటోంది. ఇక్కడి భాషనీ, యాసనీ, సంస్క్కృతిని, సంప్రదాయాన్నీ, జీవన విధానాన్నీ తెరపై చూపించాలనుకుంటోంది. ఆ టెక్నిక్ తెలిస్తే..ప్రేక్షకులూ ఆదరిస్తారన్న నమ్మకం కలిగింది. విశ్వక్ సేన్ కూడా అదే నమ్మాడు. ఎక్కడో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ కథ ని తీసుకొచ్చి, అందులో తెలంగాణ ఫ్లేవర్ మిక్స్ చేశాడు. దానికి `ఫలక్‌నుమా దాస్` అనే పేరు పెట్టాడు. మరి ఈ దాసు.. తెలంగాణ జీవన విధానంలో ఉన్న అందాన్ని ఎంత వరకూ తెరపైకి తీసుకురాగలిగాడు? అసలు ఫలక్‌నుమాలో ఏం జరిగింది? అక్కడ దాస్ గాడి దందా ఏమిటి?
* కథ
చిన్నప్పటి నుంచీ ఓ గ్యాంగ్ వేసుకుని తిరుగుతూ, తనే దానికి లీడర్ అనుకునే దాసు (విశ్వక్ సేన్) కథ ఇది. తనది ఫలక్‌నుమా దాస్. ఫలక్‌నామాలో దాసు తన దాదాగిరీ చలాయిస్తుంటాడు. డిగ్రీ తప్పడంతో చేసేదేం లేక... తన స్నేహితులతో కలసి మటన్ దందా మొదలెడతాడు. తమ వ్యాపారానికి దాసు అడ్డొస్తున్నాడని రవిరాజా అనే ఇద్దరు రౌడీలు దాసుపై పగ పెంచుకుంటారు. రవిరాజా బామ్మర్ది కూడా దాసుకి శత్రువే. చివరికి దాసు మటన్ దందాని కూడా వదులుకోవాల్సివస్తుంది. అంతేకాదు... ఓ మర్డర్ కేసులోనూ ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి, తన శత్రువుల నుంచీ దాసు ఎలా తప్పించుకున్నాడు? దాదా గిరిని నమ్ముకున్న దాసు జీవితం ఏమైంది? అనేదే సినిమా కథ.
* నటీనటులు
రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమా ఇది. నటన కూడా అలానే ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. రౌడీ గ్యాంగ్, స్నేహితులు, ఉత్తేజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ రాణించారు. కథానాయికలు మాత్రం చూడ్డానికి అదోలా ఉన్నారు. వీళ్లకంటే మంచి మొహాలేం దొరకలేదా? అనిపిస్తే అది మీ తప్పు కాదు. విశ్వక్ సేన్‌కు మంచి మార్కులు పడతాయి. దర్శకుడి కంటే నటుడిగానే ఎక్కువ రాణించాడు. తన తదుపరి సినిమాలో నాని ఎందుకు అవకాశం ఇచ్చాడో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది.
* సాంకేతిక వర్గం
పాటల్లో ఒక్కటీ గుర్తుండవు. రియలిస్టిక్ అప్రోచ్ తో సినిమా తీయాలి అనుకున్నప్పుడు పాటల్ని మినహాయిస్తే బాగుండేది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కెమెరా మెన్ కి ఎక్కువ పడి పడింది. సింగిల్ టేక్ షాట్లు చాలా కనిపిస్తాయి. తెలంగాణ నేపథ్యాన్ని కథలో బాగా వాడుకున్నారు. కాకపోతే... మందు, మటను గోల ఎక్కువ. రీమేక్‌లో ఎలాంటి మార్పులూ చేర్పులూ చేయలేకపోయాడు విశ్వక్. కాకపోతే టేకింగ్ పరంగా తను మెప్పిస్తాడు.
* విశ్లేషణ
ఈ కథని విశ్వక్ సేన్ మలయాళం నుంచి తీసుకొచ్చాడు గానీ, ఇందులో `జగడం` లక్షణాలు పుష్కలంగా కనిపిస్తుంటాయి. జగడంలోనూ కథానాయకుడు ఓ రౌడీ, దాదా అవ్వాలని ఆశ పడతాడు. మరో పెద్ద దాదాతో గొడవ పడతాడు. గుండాయిజాన్ని నమ్ముకున్న యువకుడి కథ... చివరికి అలానే అంతం అవుతుంది. దాదాపు అదే లైన్ పట్టుకుని తీసిన సినిమా `అంగమలై డైరీస్`. ఆ కథని తెలుగులో `ఫలన్‌నుమా దాస్`గా తీశారిప్పుడు.
`అంగమలై డైరీస్`లోని పాత్రల్ని, సంఘటనల్ని, ఆఖరికి కొన్ని కొన్ని సంభాషణల్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశాడు విశ్వక్‌సేన్. కాకపోతే... ఈ కథని ఫలక్‌నామా నేపథ్యంలో మార్చే క్రమంలో సక్సెస్ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఫలక్‌నామాలోనే, దాసు పక్కనే ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రాంతానికి చెందినవాళ్లు ఈకథకు, పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోతారు.
దాసు బాల్యం, శంకరన్నని చూసి దాదాగా మారాలనుకోవడం, అందుకోసం ఓ గ్యాంగ్‌ని సెట్ చేసుకోవడం... ఇవన్నీ ఆకట్టుకుంటాయి. సంభాషణలు, సన్నివేశాల్లో వాస్తవికత కనిపించడంతో ఎక్కడా సినిమాటిక్‌గా అనిపించదు. మటన్ దందాల్లాంటివి తెలుగు ప్రేక్షకులకు కొత్త. ఆ సన్నివేశాల్ని ఎంత వరకూ జీర్ణం చేసుకోగలరో చూడాలి. సినిమా మొత్తం మందు, బోటీ కూర, కొట్టుకోవడం - ఇదే దందా. స్నేహితులు కలిస్తే మందు, మటన్ తప్ప మరో మాట ఉండదు. ఇలాంటి సన్నివేశాలు చూస్తే... తెలంగాణ యువతపై చెడు అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది.
ప్రధమార్థంలో ఎక్కడా బ్రేకులు ఉండవు. సినిమా నిదానంగా సాగుతూనే ఉంటుంది. ద్వితీయార్థంలో మర్డర్ కేనుని మాఫీ చేసేందుకు దాసు కొత్త తప్పులు చేస్తుంటాడు. బెట్టింగ్ దందాల్లాంటివి నిర్వహిస్తుంటాడు. అలాంటి సన్నివేశాలతో మరో గంట కాలక్షేపం చేశారు. రౌడీయిజాన్ని నమ్ముకుని, అదే ప్యాషన్‌గా బతికేస్తున్న హీరోలోనూ, అతని స్నేహితుల్లోనో ఎలాంటి మార్పూరాదు. ఆఖరికి విలన్ గ్యాంగ్ మారినా... ఆ మార్పు హీరోలో కనిపించదు. వాస్తవిక ధోరణిలో సన్నివేశాల్ని చూపించాలన్న తపనతో సినిమాని మరీ ల్యాగ్ చేశారు.
అనవసరమైన సన్నివేశాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. పైగా వాటి నిడివి కూడా చాలా ఎక్కువ. క్లైమాక్స్ 13 నిమిషాలు సాగింది. అయితే ఈ 13 నిమిషాలూ సింగిల్ షాట్‌లో తీయడం గొప్ప విషయం. అలాంటి ప్రయత్నాలు మినహాయిస్తే.. ఫలక్‌నామా దాస్ ఏ విషయంలోనూ మెప్పించలేకపోయాడు.
* ప్లస్ పాయింట్స్
+టేకింగ్
+తెలంగాణ ట్రెడిషన్
+నటీనటులు
+క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
- లెంగ్త్
- హీరోయిన్లు
- అనవసరమైన సన్నివేశాలు
* ఫైనల్ వర్డిక్ట్: గలత్ రిమేక్
- రివ్యూ రాసింది శ్రీ.