నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, సత్య తదితరులు
దర్శకత్వం : అనీష్ కృష్ణ
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ
సమర్పణ: అనిల్ రావిపూడి
సంగీతం : అచ్చు
సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీ రామ్
ఎడిటర్: తమ్మిరాజు
రేటింగ్: 2.75/5
దర్శకుడు అనిల్ రావిపూడికి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అతని అన్ని సినిమాలూ హిట్టే. ఓ రకంగా గోల్డెన్ హ్యాండ్ అన్నట్టు. ఇప్పుడు నిర్మాతగా మారాడు. `గాలి సంపత్` సినిమాతో. ఆ టైటిల్ అందరినీ ఆకట్టుకుంది. ప్రచార చిత్రాలూ.. నచ్చాయి. దాంతో గాలి సంపత్ పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. ఈ సంపత్ ఎలా ఉన్నాడు? నిర్మాతగానూ... అనిల్ రావిపూడి సక్సెస్ అయినట్టేనా? గాలి సంపత్.. గాలి ఎటువైపు?
* కథ
సంపత్ (రాజేంద్ర ప్రసాద్), సూరి (శ్రీవిష్ణు) తండ్రీ కొడుకులు. గాలి సంపత్‌కి నోటి నుంచి మాట రాదు. అంతా గాలే. అందుకే తనని అంతా గాలి సంపత్ అని పిలుస్తారు. తనకి నాటకాల పిచ్చి. నాటకాల పోటీలో పాల్గొని బహుమతి కొట్టాలన్నది తన కోరిక. అందుకోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. తండ్రీ కొడుకుకీ.. అస్సలు పడదు. ఓసారి పెద్ద గొడవ జరుగుతుంది. మరోవైపు.. గాలి సంపత్ అనుకోకుండా... ఓ పాడుపడ్డ నూతిలో పడిపోతాడు. కాపాడండి.. అని అరవడానికి నోరు కూడా లేదు. మరి అలాంటప్పుడు సంపత్ ఆ గొయ్యి నుంచి ఎలా బయటపడ్డాడు? తన కోసం కొడుకు చేసిన ప్రయత్నాలేంటి? తండ్రీ కొడుకుల మధ్య గొడవలు సద్దుమణిగాయా, లేదా? అన్నది మిగిలిన కథ.
* విశ్లేషణ
తండ్రీ కొడుకుల కథ ఇది. దానికి చక్కటి నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఓ మూగవాడు.. గొయ్యిలో పడిపోవడం, అందులోంచి బయటకు రావడానికి చేసే ప్రయత్నాలు అనే నావెల్టీ కథకు.. తండ్రీ కొడుకుల నేపథ్యం జోడించాడు దర్శకుడు. గాలి సంపత్, సూరిల పరిచయ సన్నివేశాలు. గాలి సంపత్ కి ఉన్న నాటకాల పిచ్చి వగైరా సన్నివేశాలతో వినోదం పండించాడు దర్శకుడు. గాలి సంపత్ కి నోట రాకపోవడంతో, పక్కన ట్రాన్స్‌లేటర్ (సత్య) సహాయం తీసుకుంటాడు. వాటి చుట్టూ నడిచిన సన్నివేశాలు కాలక్షేపం పంచుతాయి.
విశ్రాంతి ముందు కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. వాటిని భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దారు. ద్వితీయార్థం అంతా గాలి సంపత్ నూతి నుంచి బయటకు రావడానికి చేసే ప్రయత్నాలు, తండ్రిని వెదికే క్రమంలో.. తన విలువ కొడుకుకి తెలియడం.. ఇలా... ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. తొలి సగం ఫన్.. సెకండాఫ్ థ్రిల్.. ఇదీ దర్శకుడు నమ్ముకున్న ఫార్ములా. అయితే.. రెండూ.. కావల్సినంతగా అమరలేదు. అక్కడక్కడా కొన్ని నవ్వులు పంచితే. ఎమోషనల్ సీన్స్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే మెప్పించాయి. అనిల్ రావిపూడికి వినోదం పండించడం ఎలాగో తెలుసు. తన కామెడీ ట్రాకులు బాగుంటాయి.
అయితే ఈ సినిమాలో.. ఆ ఫన్ మోతాదు కాస్త తగ్గించి, ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌పై దృష్టి పెట్టాడు. అయితే అవి కూడా అంతంత మాత్రంగానే పండాయి. గాలి సంపత్ నూతి లోంచి ఎలా బయటకు వస్తాడు? అనే ఆసక్తి ప్రేక్షకులకు కలిగినా - వాళ్ల అంచనాలకు తగ్గట్టు ఆయా సన్నివేశాల్ని మలచడంలో విఫలం అయ్యాడు. అక్కడ సన్నివేశాల్లో సహజత్వం పోయి, నాటకీయత చోటు చేసుకుంటుంది. దాంతో... ఎమోషన్ బాగా తగ్గిపోయింది. పతాక సన్నివేశాల్లో ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. దాంతో.. క్లైమాక్స్ కూడా అంతగా రక్తి కట్టలేదు.
* నటీనటుల ప్రతిభ
రాజేంద్ర ప్రసాద్ నటన ఈ సినిమాకి వెన్నెముక. ఫిఫీ భాషతో.. తను ఆకట్టుకున్నాడు. తన అనుభవాన్నంతా ఈ పాత్రలో రంగరించాడు. రంగస్థలం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో రాజేంద్ర ప్రసాద్ నటన పతాక స్థాయిలో కనిపిస్తుంది. శ్రీవిష్ఱు కూడా మెప్పించాడు. నిజానికి ఈ తరహా పాత్ర తనకేం కొత్తకాదు. పక్కింటి అబ్బాయి పాత్రలు ఇది వరకు చాలా చేశాడు. కొన్ని సన్నివేశాల్లో రాజేంద్ర ప్రసాద్ కి ధీటుగా నటించాడు. కథానాయిక పాత్రకు ఉన్న ప్రాధాన్యం.. ఆ పాత్రలో లవ్ లీ సింగ్ కనబరిచిన ప్రతిభ అంతంత మాత్రమే. టాన్స్‌లేటర్ గా సత్య నవ్వులు పండించాడు. శ్రీనివాసరెడ్డి కూడా మెప్పించాడు.
* సాంకేతిక వర్గం
కథలో కాస్త వైవిధ్యం ఉంది. దాన్ని స్క్రీన్ ప్లేతో మరింత రక్తి కట్టించొచ్చు. కానీ అది కుదర్లేదు. సంభాషణలు అక్కడక్కడ మనసుని హత్తుకుంటాయి. కెమెరా వర్క్, నేపథ్య సంగీతం బాగున్నాయి. పాటలు ఇంకాస్త బాగుండాల్సింది. గుర్తు పెట్టుకునే పాటలు వినిపించలేదు. పరిమిత బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. ఆ విషయం కొన్ని సన్నివేశాల్లో అర్థమైపోతుంటుంది. ఇంకాస్త బడ్జెట్ ఇచ్చుంటే.. నూతి నేపథ్యంలో సాగే సన్నివేశాలు మరింత రక్తి కట్టేవేమో..?
* ప్లస్ పాయింట్స్
రాజేంద్ర ప్రసాద్
శ్రీవిష్ఱు
ఎమోషనల్ సీన్స్
అక్కడక్కడా కొన్ని నవ్వులు
* మైనస్ పాయింట్స్
పాటలు
బడ్జెట్ పరిమితులు
* ఫైనల్ వర్టిక్ట్: చిరు గాలి