చిత్రం: గాండీవధారి అర్జున
నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
సంగీతం: మిక్కీ J. మేయర్
ఛాయాగ్రహణం: ముఖేష్ జి.
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేదీ: 25 ఆగష్టు 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2/5
ఏ కథ చెబుతున్నాం? అనేది ఎంత ముఖ్యమో దాన్ని ఎలా చెబుతున్నాం? అనేది కూడా అంత కంటే ముఖ్యం. కొన్ని కథలు చెప్పడానికీ, వినడానికీ బాగుంటాయి. కానీ తెరపై చూపిస్తున్నప్పుడు సినిమాటిక్ ఫీల్ ఇవ్వలేవు. అలాంటి కథల్ని కూడా ధైర్యంగా నమ్మి సినిమా తీశారంటే.. ఆ గట్స్‌ని మెచ్చుకోవాలి. `గాండీవధారి అర్జున` అలాంటి కథే. పర్యావరణం, చెత్త, కాలుష్యం.. ఇలాంటి సీరియస్ విషయాలపై సాగే కథ ఇది. దాన్ని ఓ యాక్షన్ డ్రామాగా చెప్పాలనుకొన్నారు. మరి.. ఆ ప్రయత్నం ఎంత వరకూ వచ్చింది? ప్రవీణ్ సత్తారు స్టైలీష్ మేకింగ్, వరుణ్ తేజ్ యాక్షన్ ఇమేజ్ ఇవన్నీ ఈ సినిమాని గట్టెక్కించాయా? అసలింతకీ `గాండీవధారి అర్జున` ఎలా ఉంది? ఆ వివరాల్లోకి వెళ్తే..?
కథ: లండన్‌లో జి - 20 దేశాల సదస్సు కోసం భారతదేశ ప్రతినిధిగా ఆదిత్య రాయ్ (నాజర్) హారజవుతాడు. అయితే తన ప్రాణాలకు లండన్ లో ముప్పు వాటిల్లుతుంది. అందుకే ఆదిత్యని కాపాడే బాధ్యత ప్రైవేటు సెక్యురిటీ ఏజెంట్ అయిన అర్జున (వరుణ్‌తేజ్) తీసుకొంటాడు. ఆదిత్య రాయ్ దగ్గరే సెక్రటరీగా పని చేస్తుంది ఐరా (సాక్షి వైద్య). తనకీ అర్జునకీ ఓ గతం ఉంది. అదేంటి? ఆదిత్యకి లండన్‌లో ఎలాంటి ముప్పు వాటిల్దింది? అదీ ఎందుకోసం? ప్రపంచ వ్యాప్తంగా పేరుకు పోతున్న చెత్తకీ.. ఈ జీ 20 సదస్సుకీ ఉన్న లింకేమిటి? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఓ సీరియస్ ఇష్యూని దర్శకుడు ఈ కథలో చెప్పాలనుకొన్నాడు. అదే... పర్యావరణం. డబ్బున్న దేశాలు తమ దేశంలో పేరుకు పోతున్న చెత్తని పేద దేశాలకు తరలిస్తుంటాయి. ఆ చెత్త వల్ల... ఆ దేశాల్లోని పర్యావరణం ఎలా నాశనం అయిపోతుంది? దాని వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి.ఈ సమస్య నుంచి బయటపడే మార్గమేంటి? ఇవన్నీ సీరియస్ విషయాలే. వాటినే తెరపై చూపించాలనుకొన్నాడు. ఎంచుకొన్న పాయింట్ గురించి ఎలాంటి చర్చా అవసరం లేదు. ఎందుకంటే ఇది వాలీడ్ పాయింటే. కానీ దాన్ని చూపించిన విధానం మాత్రం కమర్షియల్ కొలతలకు అతకలేదు. ప్రతీ సీన్ నిదానంగా సాగిపోతుంది. కానీ ఎమోషనల్ గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండవు. ఆదిత్య రాయ్‌కి లండన్‌లో ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో తొలి సన్నివేశాల్లోనేచెప్పి, ఆ తరవాత కథలోకి వెళ్లి ఉంటే బాగుండేది. కానీ ఆదిత్య రాయ్ ని ఎందుకు రక్షించాలి? ఎవరి చేతుల్లోంచి రక్షించాలి? అనే విషయం ఇంట్రవెల్ కి గానీ అర్థం కాదు.
హీరో లవ్ స్టోరీలో దమ్ము లేదు. మదర్ సెంటిమెంట్ కూడా కదిలించదు. యాక్షన్ సీన్లు వస్తూ పోతుంటాయి.కానీ అవి కూడా ఎలాంటి ఇంపాక్ట్ కలిగించవు. తరువాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠత కలిగించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ద్వితీయార్థంలో కన్న కూతుర్ని అడ్డు పెట్టుకొని విలన్ ఆడే గేమ్ కూడా ఆసక్తి కలిగించదు. ఇంత పేలవమైన స్క్రీన్ ప్లే, ఎలాంటి మలుపులూ లేని కథని దర్శకుడు ఎలా రాసుకొన్నాడో అర్థం కాదు. నాజర్‌కి సైతం ఓ కుటుంబం, దాని వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటాయి.కానీ అవి కూడా కథకి సంబంధం లేనివే. పతాక సన్నివేశాలు బోరింగ్ గా సాగాయి. శుభం కార్డు కోసం ప్రేక్షకులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పర్యావరణం గురించి సీరియస్ గా తీసిన డాక్యుమెంటరీలా అనిపిస్తుంది తప్ప, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఏమాత్రం ఇవ్వని కథ ఇది.
నటీనటుల ప్రతిభ: యాక్షన్ కథలు వరుణ్‌తేజ్‌కి బాగా సూటవుతాయి. అర్జున్ గా ఫిట్ గా కనిపించాడు. యాక్షన్ సీన్లు బాగానే చేశాడు. కానీ అంతకు మించి వరుణ్ నుంచి ఏం ఆశించలేం. హీరోయిన్ పాత్రలోనూ డెప్త్ లేదు. లవ్ స్టోరీ కావాలని ఇరికించినట్టే ఉంటుంది. నాజర్ ది కీలకమైన పాత్ర. ఆ పాత్రలో తన అనుభవాన్ని చూపించారు ఆయన. విలన్ గా కనిపించిన వినయ్ రాయ్ కూడా చేసిందేం లేదు. ఆ పాత్రతో కూడా దర్శకుడు భయపెట్టలేకపోయాడు.
సాంకేతిక వర్గం: మిక్కీకి ఇలాంటి జోనర్లు కొత్త. పాటలకు స్కోప్ లేదు. నేపథ్య సంగీతంలో మాత్రం ఇంగ్లీష్ సినిమాలు చూస్తు్న ఫీల్ ఇచ్చాడు. కెమెరా వర్క్ బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. సినిమా రిచ్‌గా కనిపించింది. కానీ కీలకమైన కథ, కథనాల్లో కొత్తదనం లోపించింది. ప్రవీణ్ సత్తారు ఇది వరకు తీసిన ఘోస్ట్ ఛాయలు ఈ కథలోనూ ఉన్నాయి. తన ఫ్లాప్‌సినిమాని మళ్లీ ఎందుకు ఫాలో అయ్యాడో అర్థం కాదు.
ప్లస్ పాయింట్స్:
వరుణ్ లుక్
యాక్షన్ సీన్లు
లండన్ నేపథ్యం
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
సాగదీత
ఎమోషన్ మిస్
ఫైనల్ వర్డిక్ట్: గురి తప్పింది అర్జునా..