గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు

చిత్రం: 'గౌతమీ పుత్ర శాతకర్ణి' 
తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రియశరన్‌, హేమామాలిని, కబీర్‌ బేడీ, శివరాజ్‌ కుమార్‌ తదితరులు 
నిర్మాణం: ఫస్ట్‌ప్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ 
నిర్మాత: వై.రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు 
దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి 
సంగీతం: చిరంతన్‌ భట్‌ 
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ 
విడుదల తేదీ: 12 జనవరి 2017

కథా కమామిషు:
బాలయ్య వందో చిత్రంగా తెరకెక్కిన చిత్రమిది. ఇంతవరకూ ఎవ్వరికీ తెలియని చరిత్ర గౌతమి పుత్ర శాతకర్ణిది. ఉన్న సమాచారంతోనే ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాడు దర్శకుడు క్రిష్‌. ఆ కథా కమామిషులోకి వెళదాం. తల్లి గౌతమీ బాలాశ్రీ (హేమా మాలిని)కి ఇచ్చిన మాట ప్రకారం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన భారతదేశాన్ని ఏకపాలన కిందకి తీసుకురావాలనుకుంటాడు. ఈ క్రమంలో కుటుంబ పట్ల నిర్లక్ష్యం చూపుతున్నాడని కొంత అసహనం వ్యక్తం చేస్తుంది అతని భార్య వశిష్టిదేవి (శ్రియ). కొడుకుని తీసుకుని కూడా యుద్ధ క్షేత్రంలోకి వెళ్ళేంతటి యుద్ధ కాంక్ష శాతకర్ణిలో ఉంటుంది. దానిక్కారణం, అమ్మకిచ్చిన మాట. మరి ఆ మాటని శాతకర్ణి నిలబెట్టుకున్నాడా? తెరపై చూడాల్సిందే.

నటీనటులు ఎలా చేశారు?
ఈ తరహా పాత్రలంటే బాలకృష్ణకి ఎంతో ఇష్టం. 100వ చిత్రంగా కమర్షియల్‌ సినిమాని ఎంచుకోకుండా, కొత్తదనం కోసం ఆలోచించడంలోనే బాలకృష్ణ గొప్పతనం అర్థమవుతుంది. శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ నటించారనడం కన్నా, జీవించారనడం సబబు. సంభాషణలు, హావభావాలతో శాతకర్ణి పాత్రకు వన్నెతెచ్చారాయన. పోరాట సన్నివేశాల్లో బాలయ్య తెగువ, చొరవ అభినందనీయం. సెంటిమెంట్‌ సీన్స్‌లోనూ, పౌరుషం ప్రదర్శించే సన్నివేశాల్లోనూ, డైలాగులు చెబుతున్నప్పుడూ బాలయ్యని చూస్తే నభూతో నభవిష్యతి అనిపించకమానదు. సినిమా అంతా బాలయ్య భుజస్కంధాలపై నడిచింది. వన్‌ మాన్‌ షో అనిపించేలా బాలయ్య అద్భుతంగా చేశారు. రాజసం ఉట్టిపడే పాత్రలో బాలయ్యను అలా తెరపై చూడ్డం అభిమానులకి పండగే. గెటప్‌ దగ్గర్నుంచి, ఆహార్యం దాకా అన్నిట్లోనూ బాలకృష్ణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. వశిష్టిదేవి పాత్రలో శ్రియ అందంగా, అద్భుతంగా నటించింది. బాలీవుడ్‌ నటి హేమమాలిని, శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీ పాత్రలో ఒదిగిపోయారు. ఆమె పాత్ర ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ అతిథి పాత్రలో మెరిశారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర చాలా బాగా చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు
పూర్తిగా తెలిసిన కథను, సినిమాకి అనుగుణంగా మార్చడం పెద్ద విశేషం కాదు. కానీ తెలియని కథ, పైగా అది చారిత్రక గాధ. దాంతో పరిశోధన అవసరం. అంతలా పరిశోధించి, తనకు అందించిన సమాచారం మేరకు అద్భుతంగా కథను అల్లాడు దర్శకుడు క్రిష్‌. స్క్రీన్‌ప్లే చాలా చక్కగా ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాడు. అలాగే డైలాగ్స్‌ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ తరహా సినిమాలకు డైలాగులు అంటే కత్తిమీద సామే. డైలాగ్స్‌ని ఖచ్చితంగా అభినందించాలి. సంగీత పరంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది. మ్యూజిక్‌కి లిరికల్‌ వాల్యూస్‌ తోడయ్యాయి. ఎడిటింగ్‌ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఇలాంటి సినిమాలకి ఎంతో కీలకం. ఆ విభాగాల బాగా పనిచేశాయి. సినిమాటోగ్రఫీ అద్భుతం. గ్రాఫిక్స్‌ క్వాలిటీ కూడా బాగుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ
ఈ తరహా సినిమాలకి ఓ యుద్ధ సన్నివేశం చిత్రీకరించి, దాన్నే హైలైట్‌ చేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ క్రిష్‌ అలా ఆలోచించలేదు. యుద్ధాలు సినిమా కథకు ఎంత కీలకమో భావించి, వాటి విషయంలో మాత్రం రాజీ పడలేదు. యుద్ధం చేయడం, రావడం, మళ్ళీ యుద్ధానికి వెళ్ళడం. ఇదే తంతు. అయినా ఎక్కడా బోర్‌ కొట్టనివ్వలేదు. యుద్ధాలు అత్యంత సహజంగా ఉండేందుకు ప్రయత్నించాడు. అలాగే గ్రాఫిక్స్‌ని కూడా అవసరమైన వాడుకున్నారు. తెలియని కథని తెలిసేలా చెప్పడంలో క్రిష్‌ పడ్డ శ్రమ వృధా పోలేదు. బాలకృష్ణ నటన క్రిష్‌ ప్రయత్నానికి తోడైంది. బాలయ ఇమేజ్‌ ఈ చిత్రానికి సరిపడా రాజసం తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. ఉన్న వనరుల్ని సక్రమంగా వాడుకుని, రికార్డు సమయంలో అనుకున్న విధంగా సినిమాని తెరకెక్కించి, విడుదల చేయడంలోనే క్రిష్‌ సగం విజయం సాధించాడు. ఆ కష్టమంతా తెరపై కన్పించడంతో, మిగతా విజయాన్ని ప్రేక్షకులు కట్టబెట్టడం పెద్ద కష్టం కాబోదు. సినిమా అంతా ఒక ఎత్తు, సినిమా చివర్లో క్రిష్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఇంకో ఎత్తు. ఓవరాల్‌గా సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. తెలుగువారికి వారి చరిత్రను తెలియజేస్తుంది.

ఫైనల్‌ వర్డ్‌
తెలుగుదనం, తెలుగు ఆత్మగౌరవం శాతకర్ణి!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS