తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, నాగేంద్రబాబు, రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణ, గిరిబాబు &సత్యం రాజేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: GA2 పిక్చర్స్
సమర్పణ: అల్లు అరవింద్
సంగీతం: గోపి సుందర్
ఛాయాగ్రహణం: మణికందన్
నిర్మాత: బన్నీ వాస్
రచన-దర్శకత్వం: పరశురాం
రేటింగ్: 3.25/5
విజయ్ దేవరకొండ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. చేతిలో పెళ్లి చూపులు... అర్జున్ రెడ్డి లాంటి విజయాలు, చూట్టూ బోలెడన్ని సినిమాలు. విజయ్ క్రేజ్ కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. విజయ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే... అటెన్షన్ మొదలైపోతోంది. `గీత గోవిందం` కూడా అలాంటి హైప్ తెచ్చుకుంది.
విడుదలకు ముందే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు బయటకు వచ్చేయడంతో.. చిత్రబృందం కాస్త గాభరా పడింది. కానీ ఈ సినిమాకి మరింత ఎక్కువ ప్రచారం లభించేందుకు దోహదం చేసింది. ఈ నేపథ్యంలో.. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన గీత గోవిందం ఎలా ఉంది?? విజయ్ ఫామ్ ఈ సినిమాతో కొనసాగిందా? దర్శకుడిగా పరశురామ్‌కి మరో విజయం లభించిందా, లేదా?
* కథ
విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) డీసెంట్ కుర్రాడు. ఓ కాలేజీలో లెక్చలర్‌గా పనిచేస్తుంటాడు. అమ్మాయిలు వెంట పడినా పట్టించుకోడు. తనకు కావల్సిన అమ్మాయి ఎలా ఉండాలో... తనకంటూ కొన్ని కలలున్నాయి. అలాంటి లక్షణాలున్న గీత (రష్మిక) అనే అమ్మాయిని చూస్తాడు. తనతో పరిచయం పెంచుకోవాలనుకుంటాడు. కానీ.. అనుకోకుండా ఆ అమ్మాయి ముందు దోషిలా నిలబడాల్సివస్తుంది. విజయ్ చేసిన చిన్న పొరపాటు వల్ల.. తన చెల్లెలు పెళ్లి ఆగిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకీ విజయ్ చేసిన ఆ చిన్న పొరపాటు ఏంటి? దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? గీతతో ప్రేమ, పెళ్లి ఎంత వరకూ వచ్చాయి? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
* నటీనటులు
ఈ సినిమాని తానొక్కడే భుజాలపై వేసుకుని నడిపించేశాడు విజయ్. తన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి బలం. చిన్న చిన్న డైలాగులే అయినా... విజయ్ చెబితే భలే నవ్వొచ్చేస్తుంది. తన లుక్, డ్రస్సింగ్ స్టైల్... ఇవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి.
ఇక రష్మిక మరోసారి ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ సీరియెస్ ఫేస్‌తో కనిపిస్తూ, కథానాయకుడ్ని ఆట పట్టిస్తూ... చివర్లో ప్రేమని కురిపిస్తూ... చాలా వేరియేషన్స్ చూపించింది.
చివర్లో క్రెడిట్ అంతా వెన్నెల కిషోర్ పట్టుకెళ్లిపోతాడు. తన అమాయకత్వం ఈ సినిమాకి మరో ప్లస్.
నాగబాబు, అన్నపూర్ణ, సుబ్బరాజు... ఇలా మిగిలివాళ్లవందరివీ చిన్న పాత్రలే.
* విశ్లేషణ
దర్శకుడు పరశురామ్ ఎంచుకున్నది చాలా చిన్న లైన్. దాన్ని పండించాలంటే స్క్రిప్టు బలంగా ఉండాలి. ఈ విషయంలో పరశురామ్ నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా, సున్నితమైన హాస్యంతో, సరదా సన్నివేశాలతో అల్లుకుంటూ పోయాడు. కథానాయకుడు - నాయిక మధ్య సన్నివేశాలే ఈ చిత్రానికి ప్రధాన బలం. వాటిని నడిపించిన తీరు బాగుంది.
కథానాయిక చేసుకున్న అపార్థం వల్ల... కథానాయకుడు ఎన్ని తిప్పలు పడ్డాడో.. వినోదాత్మకంగా చూపించాడు. తొలి సగమంతా ఎంటర్‌టైనర్ పంచుకుంటూ వెళ్లాడు. అక్కడక్కడ హిలేరియస్ గా నవ్వించాడు. విశ్రాంతి ముందొచ్చే ట్విస్టు ఊహించేదే. సెకండాఫ్‌లో ఈ కథని ఎలా లాగుతాడా? అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా దర్శకుడు వినోదాన్నే నమ్ముకున్నాడు. చూసిన సన్నివేశమే మళ్లీ చూస్తున్నట్టు అనిపించినా.. విజయ్, రష్మికల క్యారెక్టరైజేషన్లు, వాటి చుట్టూ పండే వినోదం వల్ల.. ఎక్కడా బోర్ కొట్టదు.
తొలి సగంలో ఉన్న వినోదం.. సెకండాఫ్‌లో కాస్త తగ్గుతుంది. సినిమా క్రమంగా డౌన్ ఫాల్‌లోకి వెళ్తోందేమో అనుకుంటున్న సమయంలో వెన్నెలకిషోర్ ని రంగంలోకి దింపి తెలివైన పని చేశాడు దర్శకుడు. వెన్నెల కిషోర్ మరోసారి బకరా పెళ్లికొడుకు వేషమే
కట్టినా.. తన వంతు నవ్వులతో థియేటర్లోని వాతావరణాన్ని ఒక్కసారిగా తేలికపరిచాడు. సీరియస్ ముగింపు పలుకుతాడేమో అనుకుంటున్నప్పుడు నవ్విస్తూనే కథని సుఖాంతం చేశాడు.
కథ చిన్నదే అయినా.. దర్శకుడి తెలివితేటల వల్ల కావల్సినంత ఫన్, డ్రామా వర్కవుట్ అయ్యాయి. పైగా అర్జున్ రెడ్డి తరవాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా ఇది. ఆ ప్రభావం... బాక్సాఫీసు దగ్గర కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
* సాంకేతిక వర్గం
గోపీ సుందర్ సంగీతం ప్రధానబలం. ఇంకేం ఇంకేం కావాలే.. పాట ఇప్పటికే మార్మోగిపోతోంది. మిగిలిన పాటలూ నచ్చుతాయి. పరశురామ్ చిన్న లైన్ ని పట్టుకుని కథన బలంతో బాగా నడిపించాడు. గీతా ఆర్ట్స్ పేరుకి తగ్గట్టు భారీ నిర్మాణ విలువలేం కనిపించకపోయినా.. ఆ లోటు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
* ప్లస్ పాయింట్స్
+ విజయ్ నటన, కామెడీ టైమింగ్
+ వినోదం
+ వెన్నెల కిషోర్
* మైనస్ పాయింట్
- ఊహించే ట్విస్టులు
* ఫైనల్ వర్డిక్ట్: ఫన్ రైడ్... గీత గోవిందం.
రివ్యూ రాసింది శ్రీ