తారాగణం: అడివి శేష్, శోభితా, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియ యార్లగడ్డ, అనీష్ కురువిల్ల & తదితరులు
నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం:శనెయిల్ డియో
ఎడిటర్: గ్యారీ
రచన సహకారం-మాటలు: అబ్బూరి రవి
కథ: అడివి శేష్
కథనం: అడివి శేష్-శశికిరణ్ తిక్క
నిర్మాత: అభిషేక్ నామ
దర్శకత్వం: శశికిరణ్ తిక్క
రేటింగ్: 3.25/5
కృష్ణ దయ వల్ల.... జెమ్స్ బాండ్ తరహా కథలు తెలుగువాళ్లకీ పరిచయమయ్యాయి. ఆ కథల్లో ఉండే పట్టు, ఆసక్తి తెలిశాయి. సమర్థవంతమైన దర్శకుడు ఉంటే, సరిగ్గా తీస్తే కచ్చితంగా అలాంటి కథలు తెలుగులో విజయవంతమవుతాయన్న నమ్మకం కలిగింది. అయితే కృష్ణ తరవాత ఆ తరహా ప్రయత్నాలెవ్వరూ చేయకపోవడం ఆశ్చర్యమేస్తోంది. ఇలాంటి జోనర్‌లోనూ థ్రిల్లర్లు చేయొచ్చని, ఈతరం ఆడియన్స్‌ని కట్టిపడేయొచ్చని అడవిశేష్ నమ్మాడు. దాని ఫలితమే... 'గూఢచారి'. మరి.. అతని నమ్మకం నిజమయ్యేలా మేకింగ్ ఉందా? అడవి శేష్ అల్లుకున్న కథకి దర్శకుడు ఎంత వరకూ న్యాయం చేశాడు?
* కథ
గోపి (అడవి శేష్) తండ్రి ఓ సీక్రెట్ ఏజెంట్. తన తండ్రికి చిన్నప్పుడే దూరమైన గోపీ... తాను కూడా ఓ సీక్రెట్ ఏజెంట్‌గా మారి దేశానికి సేవ చేద్దామనుకుంటాడు. అయితే... మావయ్య (ప్రకాష్ రాజ్) మాత్రం అడ్డుపడతాడు. పెరిగి పెద్దవాడై.. ఏదోలా `త్రినేత్ర` అనే ఓ ఏజెన్సీలో... సీక్రెట్ ఏజెంట్‌గా స్థానం సంపాదిస్తాడు. అయితే అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఈ సీక్రెట్ ఏజెంట్ కాస్త... తీవ్రవాది అనే ముద్ర వేయించుకోవాల్సివస్తుంది. ఎందుకు? ఏమిటి? ఆ తరవాత జరిగిన కథేంటి? అనేది తెరపైనే చూడాలి.
* నటీనటులు
అడవి శేష్ కథల ఎంపిక బాగుంటుంది. ఈ కథని తాను ఎంపిక చేసుకోవడం కాదు, స్వయంగా రాసుకున్నాడు కూడా. తనకు తగిన పాత్రని సృష్టించుకున్నాడు. నటనలో పరిపక్వత కనిపించింది.
జగపతిబాబు, ప్రకాష్‌రాజ్.. ఇద్దరూ ఉద్దండులే. వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ వేసిన పంచ్‌లు తక్కువే. కానీ ఆ పాత్ర కూడా చివర్లో కీలకమైంది. చాలా కాలం తరవాత సుప్రియ తెరపై కనిపించింది. తనవన్నీ సీరియెస్ లుక్సే.
* విశ్లేషణ
జేమ్స్ బాండ్ కథలెలా సాగుతాయో అందరికీ తెలిసిందే. ఓ మిషన్‌పై బాండ్ రంగంలోకి దిగుతాడు. ఆ మిషన్‌ని తన చాకచక్యంతో పూర్తి చేస్తాడు. అయితే... `గూఢచారి` మాత్రం అలాంటి కథ కాదు. గూఢచారిగా మారాలని కలలుకన్న ఓ యువకుడిపై తీవ్రవాది అనే ముద్ర వేస్తే.. అందులోంచి ఎలా బయటపడ్డాడు? పనిలో పనిగా తన గతం ఎలా తెలుసుకున్నాడు? తన లక్ష్యం ఎలా పూర్తి చేశాడు? అన్నదే `గూఢచారి` కథ.
ఓ థ్రిల్లర్‌కి ఉండాల్సిన లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. `త్రినేత్ర` పరిధిలో జరిగే వ్యవహారాలు, 116గా కథానాయకుడు ఎదిగే క్రమం ఆసక్తి కలిగిస్తాయి. అయితే... కథానాయకుడి తాలుకూ ప్రేమకథ... `గూఢచారి`ని అక్కడక్కడ విసిగిస్తుంటుంది. దాన్ని కూడా తెలివిగా కథలోకి వాడుకోవడం మాత్రం బాగుంది. విశ్రాంతి ముందే `గూఢచారి` పూర్తిగా గ్రిప్పింగ్‌లోకి వస్తుంది.
ద్వితీయార్థంలో యాక్షన్ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. జగపతిబాబు పాత్రని రంగంలోకి దించాక.. కథ ఊపందుకుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ 116 తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది చాలా పకడ్బందీ స్క్రీన్ ప్లేతో చూపించగలిగారు. క్లైమాక్స్ కూడా నచ్చుతుంది. ఓ విధంగా ఈ కథని నిలబెట్టినవి క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దృశ్యాలే.
అయితే.. అప్పటికీ కొన్ని లాజిక్కులు మిస్ అవుతాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు దర్శకుడు. బహుశా.. ప్రేక్షకుల్లో ఎక్కువ ప్రశ్నలు, అనుమానాలు రెకెత్తించడంలో భాగంగా మాత్రమే అలాంటి స్క్రీన్ ప్లే ఫాలో అయి ఉంటాడనినిపిస్తోంది. క్లైమాక్స్ చూస్తే పార్ట్ 2కి రంగం సిద్ధం చేసినట్టే అనిపిస్తోంది. `గూఢచారి` సొమ్ములు చేసుకోగలిగితే... ఈ సిరీస్‌ని మునుముందు కూడా చూడొచ్చు.
* సాంకేతిక వర్గం
ఉన్నంతలో క్వాలిటీగానే తీశారీ సినిమాని. నేపథ్య సంగీతం బాగుంది. కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ప్రధాన బలం. కథలో మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అడవిశేష్ రాసుకున్న కథని, ఎక్కడా విసుగు లేకుండా తెరపై తీసుకురాగలిగాడు దర్శకుడు.
* ప్లస్ పాయింట్స్
+ స్క్రీన్ ప్లే
+ క్లైమాక్స్
* మైనస్ పాయింట్
- అక్కడక్కడ పట్టు తప్పింది
* ఫైనల్ వర్డిక్ట్: 'బాండు' బాగున్నాడు.
రివ్యూ రాసింది శ్రీ