తారాగణం: గోపీచంద్, హన్సిక, కేథరిన్
నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియా
ఎడిటర్: గౌతమ్ రాజు
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్
సంగీతం: తమన్
నిర్మాతలు: భగవాన్, పుల్లారావు
రచన-దర్శకత్వం: సంపత్ నంది
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5
కమర్షియల్ సినిమా చేయడం చాలా ఈజీ. అందులో ఓ బలమైన కథాంశాన్ని మిలితం చేయాలని చూడడం కాస్త రిస్క్. ఎందుకంటే.. చెప్పాలనుకొన్న విషయం లో కాస్త 'సందేశం' ఉన్నప్పుడు దాన్ని కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా తెరకెక్కించడం కష్టం అవుతుంది. ఆ కొలత సరిపోనప్పుడు సినిమా డాక్యుమెంటరీలా తయారవుతుంది. అందుకే కోట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు కథ కంటే కమర్షియాలిటీపైనే దృష్టి పెడుతుంటారు. అయితే సంపత్ నంది.. ఈసారి కథ + కమర్షియల్ అంశాలు + హీరోయిజం అనే ప్యాకేజీతో ఓ సినిమా తయారు చేశాడు. అదే.. 'గౌతమ్ నంద'. వరుసగా మూడు హిట్లు కొట్టి జోరుమీదున్న సంపత్ నంది.. నాలుగోసారీ విజయవంతమైన చిత్రాన్ని అందించాడా? లేదంటే అతని విజయ యాత్రకు బ్రేక్ పడిందా? చూద్దాం రండి.
* కథ..
గౌతమ్ (గోపీచంద్) అపర కుబేరుడు. జల్సాల జీవితం. కష్టం అంటే తెలీదు. అలాంటి గౌతమ్‌ని ఓ సంఘటన మార్చేస్తుంది. మనిషిగా కూడా బతకడానికి తనకు అర్హత లేదని తెలుసుకొన్న గౌతమ్... ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో తనలాంటి పోలికలున్న మరో నంద (గోపీచంద్) కనిపిస్తాడు. తనది గౌతమ్ జీవితంలా కాదు. పైసా పైసాకీ తడుముకోవాల్సిందే. బీదరికం భరించలేక... ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఇద్దరూ ఒక ఒప్పందంపై.. ఒకరి స్థానంలో మరొకరు వెళ్తారు. గౌతమ్ నందగా.. నంద గౌతమ్‌గా మారతారు. ఈ ప్రయాణంలో ఎవరి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? జీవితం విలువ ఎవరెంత తెలుసుకొన్నారు? అనేదే మిగిలిన కథ.
* నటీనటుల ప్రతిభ...
గోపీచంద్ లుక్ పరంగా.. ది బెస్ట్ మూవీ ఇదే అని చెప్పొచ్చు. రెండు రకాల షేడ్స్.. సూపర్బ్‌గా పలికించాడు. తన వరకూ ఏలోటూ లేకుండా చూసుకొన్నాడు. కేథరిన్ పాత్ర గ్లామర్‌కి పరిమితమైతే, హన్సిక కథలో భాగమైంది. వీరిద్దరినీ కమర్షియల్ టచ్ కోసం వాడుకొన్న తీరు బాగుంది. తెరపై కనిపించేవాళ్లంతా అనుభవజ్ఞులే. కాబట్టి.. ఎవరి నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకొనే ఛాన్స్ దర్శకుడికి దొరికింది.
* విశ్లేషణ..
రాముడు - భీముడు కాలంనాటి పాయింట్ ఇది. కాకపోతే... ఈ తరంలో ఇలాంటి పాయింట్‌ని టచ్ చేసి చాలా కాలం అయ్యింది. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లడం కొత్తగా అనిపించకపోవొచ్చు. కానీ.. అందుకు తీసుకొన్న లీడ్.. వెళ్లిన తరవాత జరిగిన పరిణామాలు కొత్తగా తెరకెక్కించాడు. సంపత్ నంది మంచి రచయితే కాదు.. టెక్నీషియన్ కూడా. తన కథని ఎంత లావిష్‌గా చూపించాలో తనకు బాగా తెలుసు. ఈ కథని కళ్లకు ఇంపుగా తెరకెక్కించడంలో సఫలీకృతం అయ్యాడు. గౌతమ్ లైఫ్ స్టైల్ చూస్తే కళ్లు చెదురుతాయి. గౌతమ్ నందగా మారే ప్రయత్నం.. బస్తీలో సన్నివేశాలు ఇవ్వన్నీ ఫస్టాఫ్‌ని చక చక నడిపించేస్తాయి. సెకండాఫ్ దగ్గర కాస్త తడబడ్డాడేమో దర్శకుడు. ఇలాంటి కథల్లో.. సాధారణంగా కనిపించే `స్లో నేరేషన్` కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే.. అక్కడక్కడ కథలో ఊపొచ్చే సన్నివేశాలు జోడించగలడంతో మళ్లీ గౌతమ్ నంద ట్రాక్‌లోకి వచ్చేస్తుంటాడు. సెంటిమెంట్ సన్నివేశాలు దర్శకుడు బాగానే రాసుకొన్నా... ఎందుకో బలవంతంగా ఇరికించినట్టు ఉంటుంది. క్లైమాక్స్‌కి ముందొచ్చే ట్విస్ట్ నిజంగా షాక్ ఇస్తుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకూ కథ మళ్లీ పరుగులు పెడుతుంది. అదే జోరు.. సెకండాఫ్‌లో ఇంకాస్త ఉండి ఉంటే.. గౌతమ్ నంద స్వరూపమే వేరుగా ఉండేది.
* సాంకేతి విభాగం...
తమన్ సంగీతానికి మంచి మార్కులు పడతాయి. పాటలు మాసీగా ఉన్నాయి. బోలే రాం పాట మాస్‌కి మరింత నచ్చుతుంది. నేపథ్య సంగీతంపై మరింత దృష్టి పెట్టాడు తమన్. దాంతో సీన్లలో ఎలివేషన్‌కి ఆస్కారం కుదిరింది. ఫొటోగ్రఫీ కి పూర్తి మార్కులు వేయాల్సిందే. బ్యాంకాక్ సీన్లు.. పాటలు.. ఫైట్లు లావీష్ గా తెరకెక్కించారు. ప్రొడ్యూసర్లు ఎంత ఖర్చు పెట్టారో గానీ... రూ.50 కోట్ల సినిమా తెరపై కనిపిస్తుంటుంది. దర్శకుడు చెప్పాలనుకొన్న పాయింట్ మంచిది. దాన్ని మరీ కలుషితం చేయకుండా, కమర్షియల్ అంశాల్ని వదలకుండా సరిగానే డీల్ చేశాడు. అయినా... ఎక్కడో ఏదో లోటు కనిపిస్తుంటుంది. బహుశా కథనం విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త పడితే బాగుండేదేమో.
* ప్లస్ పాయింట్స్
+ స్టోరీలైన్
+ గోపీచంద్ లుక్
+ టెక్నికల్ టీమ్
*మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
- సెంటిమెంట్ సీన్లు పండకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్:
స్టైల్ బాగుంది.. స్ట్రైంత్ సరిపోలేదు
రివ్యూ బై శ్రీ