గుణ 369 మూవీ రివ్యూ & రేటింగ్!

By iQlikMovies - August 02, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

నటీనటులు: కార్తీకేయ, అనఘ తదితరులు
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత:  అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్: రాంరెడ్డి
విడుదల తేదీ: ఆగస్టు 2,  2019

 

రేటింగ్‌: 2.75/5

 
ఒక్క సినిమాలతో స్టార్లయిపోయినవాళ్లలో... కార్తికేయ కూడా ఉంటాడు. ఆర్.ఎక్స్ 100తో ఓ కుదుపు తీసుకొచ్చాడు. ఆ సినిమాతో చిన్న సినిమాల తయారీ మరింత ఎక్కువైంది. అటు కార్తికేయ కూడా హీరోగా అవకాశాల్ని చేజిక్కించుకున్నాడు. ఆ ఒక్క హిట్టుతో దాదాపు పది సినిమాలు కార్తికేయ చేతిలో చేరాయి.


రెండో సినిమా  హిప్పీ పూర్తిగా నిరాశ పరిచింది. తాను వన్ సినిమా వండర్ కాదని నిరూపించడానికి తన ముందున్న ఒకే ఒక్క దారి... గుణ 369ని విజయవంతం చేయడం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా వుంది?  కార్తికేయ ఈసారి తన మ్యాజిక్ చూపించగలిగాడా? లేదా?

 

* క‌థ‌

 

గుణ (కార్తికేయ) చలాకీ కుర్రాడు. కుటుంబం అంటే చాలా  ఇష్టం. గొడవలకు వెళ్లడానికి భయపడతాడు. ఎవరేమన్నా సర్దుకుపోయే రకం. గీత (అనఘ)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తన వెంట పడతాడు. పెళ్లి చేసుకోమని బతిమాలతాడు. చివరికి తను కూడా ఓకే అంటుంది. ఒంగోలు లోనే పెద్ద రౌడీ రాధ (ఆదిత్య). గుణ స్నేహితుడొకడు రాధ గురించి ఏ మాత్రం తెలియకుండానే తనతో గొడవ పడతాడు.


రాధ నుంచి  తన స్నేహితుడ్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇద్దరి మధ్య రాజీ కుదురుద్దామని ప్రయత్నిస్తాడు గుణ. అయితే ఆ మంచితనమే.. గుణని ముప్పుల్లో నెట్టేస్తుంది. ఓ హత్య కేసులో జైలుకి వెళ్లేలా చేస్తుంది. అక్కడి నుంచి గుణ జీవితమే మారిపోతుంది. ఇదంతా ఎందుకు జరిగింది? గుణ జీవితం ఇలా అవ్వడానికి కారణం ఎవరు?  అనేదే మిగిలిన కథ.

 

* న‌టీన‌టులు


ఆర్.ఎక్స్ 100 తో ఆకట్టుకోగలిగిన కార్తికేయ, హిప్పీ తో ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు. అయితే ఆ లోటుని ఈ సినిమా తీర్చింది. కథానాయకుడి పాత్రలో చాలా కోణాలున్నాయి. వాటిని చాలా చక్కగా ప్రతిబింబించేలా నటించాడు. పతాక సన్నివేశాల్లో తన నటన గుర్తుండిపోతుంది. కథానాయిక పాత్ర చిత్రానికి బలం. అయితే.. అనఘ నటన తేలిపోయింది. తనేం పెద్ద గ్లామర్ గానూ లేదు. ఆదిత్య మీనన్ నటన ఆకట్టుకుంటుంది. మహేష్ మరోసారి మర్చిపోలేని పాత్ర చేశాడు. మిగిలినవాళ్లంతా ఒకే అనిపిస్తారు.


* సాంకేతిక వ‌ర్గం


బోయపాటి దగ్గర శిష్యరికం చేశాడు అర్జున్. అతని దగ్గర మాస్ మంత్రం బాగానే పట్టేశాడు. మాస్ ని ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయార్థం మాస్ కి నచ్చేస్తుంది. తొలి సగంలో పాటలు స్పీడ్ బ్రేకర్లుగా పని చేశాయి. ద్వితీయార్థంలోనూ ఓ పేథాస్ పాట వేస్ట్ అయ్యింది. పోరాట ఘట్టాలు బాగా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బుజ్జి బంగారం.. పాట నచ్చుతుంది.


* విశ్లేష‌ణ

వాస్తవ సంఘటల్ని ఆసరా చేసుకుని ఈ కథ అల్లుకున్నట్టు చిత్ర బ్రందం ముందు నుంచీ చెబుతూనే వుంది. దానికి తగ్గట్టే సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల్ని ఈ సినిమా అద్దంలో చూపించింది. అమ్మాయి జీవితాలతో ఆడుకోవాలని చూసే వాళ్లపై ఓ కథానాయకుడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందన్నది గుణ కథ. సినిమా తొలి సగంలో ప్రేమ, స్నేహం, సెంటిమెంట్, రొమాన్స్.. ఇవన్నీ కలబోశారు. లవ్ సీన్స్ కాస్త బోరింగ్ గా సాగుతాయి.


సినిమా ఇంత రొటీన్ గా ఉందేంటి?  అనుకుంటున్న సమయంలో... విశ్రాంతి ముందు ఈ కథని మలుపు తిప్పాడు దర్శకుడు. ద్వితీయార్థం మొత్తం యాక్షన్ మూడ్ లో సాగుతుంది. కథానాయకుడి ప్రతీకారం, ఫ్లాష్ బ్యాక్ సీన్లు, ఫైట్లు.. ఇవన్నీ మాస్ కి నచ్చేలా ఉంటాయి. సినిమా మరి కాసేపట్లో అయిపోతోందనగా... ఈ కథలో మరో ఊహించని మలుపు వస్తుంది.


ప్రధమార్థంలో ఇంట్రవెల్ ట్విస్ట్ ఈ సినిమాని  ఎలా కాపాడిందో, క్లైమాక్స్ లో వచ్చిన ఈ ట్విస్ట్.. ద్వితీయార్థాన్ని అలా కాపాడగలిగింది. ఈ సినిమా తీయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని పతాక సన్నివేశాల్లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ సన్నివేశాలు మాత్రం తప్పకుండా కదిలిస్తాయి. థియేటర్ నుంచి ఓ మూడ్ తో బయటకు వెళ్లేలా ఈ సీన్లు చేయగలిగాయి.


* ప్ల‌స్ పాయింట్స్‌ 

+ఇంటర్వెల్ ట్విస్ట్ 
+క్లైమాక్స్
+యాక్షన్
 

* మైన‌స్ పాయింట్స్

-లవ్ ట్రాక్

 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: వర్డిక్ట్... గుణవంతుడే

 

- రివ్యూ రాసింది శ్రీ.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS