చిత్రం: గుంటూరు కారం
నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, రమ్య కృష్ణ, మీనాక్షి చౌదరి, జగపతిబాబు
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
కూర్పు: నవీన్ నూలి
బ్యానర్స్: హారిక అండ్ మాసినీ క్రియేషన్స్
విడుదల తేదీ: 12 జనవరి 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
మహేష్ బాబు త్రివిక్రమ్ .. పోస్టర్ పై ఈ పేర్లు వుంటే ఆటోమేటిక్ అంచనాలు పెరిగిపోతాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ వీళ్ళది. ఇప్పుడు వాళ్ళ హ్యాట్రిక్ సినిమాగా గుంటూరు కారంతో వచ్చారు. సంక్రాంతి బరిలో దిగిన పెద్ద సినిమా ఇదే. టీజర్ ట్రైలర్ లో మహేష్ మాస్ అవతార్ అంచనాలు మరింత పెంచింది. మరా అంచనాలని అందుకున్నారా ? హ్యాట్రిక్ కొట్టారా ?
కథ: వసుంధర (రమ్యకృష్ణ) భర్త సత్యం( జయరాం) ఐదేళ్ళ కొడుకు రమణ (మహేష్ బాబు) విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. రాజకీయాల్లో స్థిరపడుతుంది. పాతికేళ్ల తరవాత మంత్రి కూడా అవుతుంది. అయితే తన రాజకీయ జీవితానికి మొదటి పెళ్లి, ఆ పెళ్లితో పుట్టిన కొడుకు అడ్డు రాకూడదని వసుంధర తండ్రి వెంకట స్వామి (ప్రకాష్ రాజ్) భావిస్తాడు. తనకూ, తన కుటుంబానికీ ఎలాంటి సంబంధం లేదని లీగల్ పేపర్ పై సంతకం చేయించడానికి గుంటూరులో ఉన్న రమణని హైదరాబాద్ పిలిపిస్తాడు. మరి రమణ వచ్చాడా ? సంతకం పెట్టాడా ? అసలు వసుంధర రమణని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది ? అనేది తక్కిన కథ .
విశ్లేషణ: తల్లీ కొడుకుల ప్రేమకథ ఇది. తల్లి లేని లోటుని ఎడబాటుని అనుభవిస్తున్న కొడుకు మళ్ళీ ఆ తల్లి ప్రేమని ఎలా పొందాడు? అసలు కన్నా కొడుకుని దూరం చేసుకునే అవసరం ఆ తల్లి ఏం పట్టింది ? అనేది ఈ కథ.ఆలోచన పేపర్ మీద బావుంది కానీ.. తెరపైకి వచ్చిన తీరు మాత్రం ఉప్పు కారం లేని కూరలా తయారైయింది. మిర్చి యార్డ్ లో జరిగే అగ్ని ప్రమాదంతో ఈ కథని పెట్టారు. రమణ గా మహేష్ పరిచయమైన సన్నివేశాలు. పార్టీ ఆఫీస్ లో గొడవ, సంతకం కోసం నడిచే డ్రామా.. ఇవన్నీ ఆసక్తికరంగా కథని తెరపైకి తెస్తాయి. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ట్రాక్ ఎక్కిన ఈ కథ ఇంక ఎంతకీ ముందుకు కదలదు. సంతకం చుట్టూ నడిపిన డ్రామా అయితే మరీ టూ మచ్ అనిపిస్తుంది.
అటు హీరోయిన్ శ్రీలీల పాత్రని కూడా గ్లామర్ డ్యాన్స్ కోసమే అన్నట్టుగా చూపించారు. రమణ సంతకం కోసం ఆమె ఏకంగా గుంటూరు మకాం మార్చేయడం. అక్కడ పాటలు ఫైట్లు డ్యాన్సులు ఇవన్నీ కథకు సంబంధం లేకుండా సాగిపోతుంటాయి. నాదీ నకిలీసు గొలుసు లాంటి పాటలతో ఓ మెడ్లీ తయారు చేశారు. ఇది శ్రీలీల డ్యాన్స్ ప్రతిభని చూపించడానికి పనికొచ్చింది. సెకండ్ హాఫ్ లో కూడా పరిస్థితి మారలేదు. రెండు సీన్లు కథని నడిపి మిగతా అంతా పిల్లర్స్ లాంటి సీన్స్ తో నింపారు. ఒక దశలో ఈ సినిమా అమ్మగారింటికి దారేది అనే భావన కూడా కలిగిస్తుంది. ఇందులో ఎమోషన్స్ వున్నాయి కానీ అవి సరిగ్గా వర్క్ అవుట్ కాలేదు. యాక్షన్ సీక్వెన్స్ లన్నీ నాన్ సింక్ లో వచ్చాయనే ఫీలింగ్ కలుగుతుంది. పాటల ప్లేస్ మెంట్ కూడా చాలా కుత్రిమంగా వుంది. చివర్లో వచ్చిన మదర్ సెంటిమెంట్ మాత్రం మనసుని హత్తుకునేలా తీయగలిగారు.
నటీనటులు: మహేష్ బాబు వన్ మ్యాన్ షో ఇది. రమణ పాత్రలో ఎప్పుడూ లేనంత కొత్తగా మాస్ గా కనిపించారు. తన యాక్షన్, మాస్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా చేశారు. ఖలేజా లో మహేష్ బాబు కూడా కొన్నిసార్లు గుర్తుకు వస్తాయి. శ్రీలీల ని కేవలం డ్యాన్స్ గ్లామర్ కోసం తీసుకున్నారు. ఆమెకు జూనియర్ ప్రభుదేవా అనే పేరు కూడా పెట్టారు మహేష్. మీనాక్షి పాత్రలు ప్రాధాన్యత లేదు. రమ్యకృష్ణ , ఈశ్వరీ రావు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరాం తమ అనుభవాన్ని చూపించారు. మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి.
టెక్నికల్: తమన్ అందించిన పాటల్లో కుర్చీ మడత పెట్టి, టైటిల్ సాంగ్ బావున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ మరీ గొప్పగా లేదు. మనోజ్ పరమహంస కెమరా పనితనం డీసెంట్గా వుంది. గుర్తుపెట్టుకునే మాటలు వినిపించలేదు. దాదాపుగా త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్
మహేష్ బాబు
యాక్షన్ , డ్యాన్సులు
మైనస్ పాయింట్స్
కథ, కథనం
త్రివిక్రమ్ మార్క్ లేకపోవం
ఎమోషన్స్ పండకపోవడం
ఫైనల్ వర్డిక్ట్ : రమణ గాడు.., కష్టమే..!