Gurthunda Seethakalam: 'గుర్తుందా శీతాకాలం' మూవీ రివ్యూ & రేటింగ్!

By iQlikMovies - December 09, 2022 - 15:02 PM IST

మరిన్ని వార్తలు

తారాగణం: సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, ప్రియదర్శి.
దర్శకత్వం : నాగ్ శేఖర్
కెమెరా: సత్య హెగ్డె
సంగీతం: కాలభైరవ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు


రేటింగ్: 2.75/5


మై ఆటోగ్రాఫ్‌. ప్రేమ‌మ్‌, 96.. ఈ సినిమాలనీ అందమైన ప్రేమ జ్ఞాపకాలే. ఇప్పుడు ఈ జాబితాలో చేర‌డానికి మ‌రో సినిమా వ‌చ్చింది. అదే... `గుర్తుందా శీతాకాలం`. క‌న్నడ‌లో విజ‌య‌వంత‌మైన `ల‌వ్ మాక్ టైల్‌`ని సత్యదేవ్ హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. మరీ రిమేక్ ఎంతమేరకు ఆకట్టుకుంది ?ఎలాంటి జ్ఞాపకాలని పంచింది ? ఇందులో గుర్తుపెట్టుకునే అనుభవాలు ఏమిటి ?


కథ :


దేవ్‌ (సత్యదేవ్‌) స్కూల్‌ డేస్‌లో ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. అయితే తనకి ఇంగ్లీష్ రాని కారణంగా ఆ ప్రేమ దూరమౌతుంది. కాలేజీలో అమృత (కావ్య శెట్టి)ని ప్రేమిస్తాడు. అమృత బాగా డబ్బున్న అమ్మాయి. దేవ్‌లోని అమాయకత్వం నచ్చి ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అమ్ముని పెళ్లి చేసుకొని త్వరగా జీవితంలో స్థిరపడాలన్న లక్ష్యంతో సత్య బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే అతనికి వచ్చే అరకొర సంపాదనతో బతకడం కష్టమని తల్లి చెప్పడంతో ఆలోచన మార్చుకుంటుంది. దేవ్ కి బ్రేకప్‌ చెబుతుంది. ఆ బాధ నుంచి దేవ్‌ కోలుకునే లోపే.. అతని జీవితంలోకి నిధి (తమన్నా) ప్రవేశిస్తుంది. నిధిని పెళ్లి చేసుకున్నాక.. దేవ్‌ జీవితం ఎలా సాగింది? అనేది మిగతా కథ.


విశ్లేషణ:


దేవ్ కి ఓ ప్రయాణంలో దివ్య (మేఘా ఆకాష్‌) ప‌రిచ‌యం అవుతుంది. అక్కడి నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. దివ్యకి.. దేవ్ త‌న ప్రేమ‌క‌థ‌లు చెబుతూ ఉంటాడు. దేవ్ జీవితంలో మూడు ప్రేమ కథలు వుంటాయి. దేవ్‌ స్కూల్‌ ప్రేమ కథ చిన్నదే. దేవ్‌ కాలేజీ ప్రేమకథలో మంచి ఫన్‌ వర్కవుట్‌ అయ్యింది. అమృత దృష్టిలో పడేందుకు దేవ్‌ చేసే ప్రయత్నాలు, ఇద్దరి మధ్య నడిచే చాటింగ్‌ ఎపిసోడ్‌ నవ్విస్తాయి. అలాగే దేవ్‌ ఇంటర్వ్యూ ఎపిసోడ్‌ సైతం ఆకట్టుకుంది. దేవ్ ని అమ్ము అవమానించి దూరం పెట్టడం.. అదే సమయంలో అనుకోకుండా నిధి అతని జీవితంలోకి రావడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.


అయితే ప్రథమార్ధమంతా సరదా సరదాగా సాగిన కథ.. ద్వితీయార్ధంలో ఎమోషన్ టర్న్ తీసుకుంటుంది. తొలి రెండు క‌థ‌ల్ని అంద‌మైన జ్ఞాప‌కాలుగా మార్చిన ద‌ర్శకుడు.. కీల‌క‌మైన మూడో క‌థ‌కు వ‌చ్చేస‌రికి.. ఎక్కువగా రొటీన్ సీన్లపై ఆధార‌ప‌డ్డాడు. చివర్లో విషాదం ద‌ట్టించ‌డానికి ప్రయ‌త్నించాడు ద‌ర్శకుడు. ఇది కూడా ఓల్డ్ స్కూల్ ఆఫ్ డ్రామానే. దేవ్ - నిధిల మ‌ధ్య ఎడ‌బాటుని ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలంటే... వాళ్ల మ‌ధ్య ప్రేమ‌ని చాలా శ‌క్తిమంతంగా చూపించ‌గ‌ల‌గాలి. అది జ‌ర‌గ‌లేదు. ప‌తాక స‌న్నివేశాలు కూడా భారంగా సాగుతాయి. తొలి స‌గంలో ఉన్న జోష్‌... రెండో స‌గంలో క‌నిపించ‌క‌పోవ‌డం ప్రధాన మైనస్.


దేవ్‌ పాత్రలో సత్యదేవ్‌ చక్కగా ఒదిగిపోయారు. కాలేజీ ఎపిసోడ్ లో తనదైన కామెడీ టైమింగ్‌తో ఫన్ పంచాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత భాద్యత తెలిసిన యువకుడిగా తన నటన ఆకట్టుకుంది. చాలా మంచి వైవిధ్యాన్ని చక్కగా ప్రదర్శించాడు. కావ్యశెట్టి అందంగా వుంది. తమన్నా మరోసారి తన అనుభవం చూపించింది. చివరి సన్నివేశాల్లో తమన్నా నటన ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి, మేఘా ఆకాష్‌, సుహాసిని, వర్షిని పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.


టెక్నికల్ గా:


లోకేషన్స్ లో ఫ్రెష్ నెస్ కనిపించింది. కెమరాపని పనితనం ఆకట్టుకుంది. ఇలాంటి కథలకు మ్యూజిక్ ప్రాణం. అయితే కాల భైరవ సంగీతంలో పెద్ద మెరుపు కనిపించలేదు. శీతాకాలం పాట బావుంది. లక్ష్మీ భూపాల మాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చాలా మాటలు నవ్విస్తాయి. కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్


సత్యదేవ్, తమన్నా  
ఫస్ట్ హాఫ్ వినోదం
మాటలు, కెమరాపనితనం


మైనస్ పాయింట్స్


బలహీనమైన కథనం
భారంగా సాగిన సెకండ్ హాఫ్


ఫైనల్ వర్డిక్ట్ : అందమైన శీతాకాలం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS