చిత్రం: హను మాన్
నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి
సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
ఛాయాగ్రహణం: శివేంద్ర
కూర్పు: ఎస్.బి. రాజు తలారి
బ్యానర్స్: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 12 జనవరి 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3.25/5
నవతరం దర్శకుల్లో తనదైన ప్రత్యేక మార్క్ ని చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. తన ఆలోచనా విధానం ఎలాంటిదో 'అ' ద్వారానే అర్థమైంది. ఆ తరవాత వచ్చిన 'కల్కి' నిరాశ పరిచినా, 'జాంబీ రెడ్డి'తో ఓ సరికొత్త జోనర్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పుడు మనదైన సూపర్ హీరో కథ 'హనుమాన్'ని వెండి తెరపైకి తీసుకొచ్చాడు. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ఇదొకటి. పెద్ద సినిమాల మధ్య పోటీలో ఈ చిన్న సినిమా తట్టుకొంటుందా? థియేటర్లు దొరుకుతాయా? అనే అనుమానాల మధ్య `హనుమాన్` ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హనుమాన్ శక్తి సామర్థ్యాలు పూర్తిగా బయటపడ్డాయా? ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది?
కథ: అంజనాద్రి అనే ఓ ఊహాజనిత ప్రాంతంలో జరిగే కథ ఇది. అక్కడ హనుమంతు (తేజా సజ్జా) తన అక్క అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)తో జీవితం సాగిస్తుంటాడు. హనుమంతుకి చేతి వాటం ఎక్కువ. అక్కపై ఆధారపడి బతికేస్తుంటాడు. ధైర్యం లేదు. బలవంతుడూ కాడు. అలాంటి హనుమంతుకు అనుకోని విధంగా అపార శక్తి ఉన్న రుధిరమణి దొరుకుతుంది. ఆ మణితో తన జీవితం మొత్తం మారిపోతుంది. కొండల్ని పిండి చేసేంత శక్తి... హనుమంతుకు వస్తుంది. అయితే అది కేవలం పగటి పూటే. ఇలాంటి శక్తి కోసం ఎదురు చూస్తున్న మైఖెల్ (వినయ్ రాయ్) హనుమంతుని వెదుక్కొంటూ అంజనాద్రికి వస్తాడు. మైఖెల్ లక్ష్యం ఏమిటి? ఈ రుధిర మణిని సొంతం చేసుకోవడానికి మైఖెల్ ఏం చేశాడు? అంజనాద్రికి వచ్చిన ముప్పుని హనుమంతు ఎలా అడ్డుకొన్నాడు? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ: ఓ అనామకుడుకీ, బలహీనుడికి అపారమైన శక్తి వస్తే ఏమిటన్నది `హనుమాన్` కథ. ఓరకంగా ఇది సోషియో ఫాంటసీ సినిమా అనుకోవొచ్చు. దానికి స్పైడర్ మాన్, సూపర్ మేన్ లాంటి జోనర్‌ని జోడించాడు. మనదైన సూపర్ మాన్ `హనుమాన్`ని రంగంలోకి దించాడు. నిజానికి పైసా వసూల్ ఆలోచన ఇది. ఎవరైనా ఇట్టే కనెక్ట్ అయిపోతారు. దానికి తగిన కథ, కథనాల్ని ఎంచుకోవాలంతే. నెగిటీవ్ ఫోర్స్ నుంచి కథని మొదలెట్టాడు దర్శకుడు. మైఖెల్ పాత్రని పరిచయం చేసి, అతని లక్ష్యాన్ని ప్రేక్షకులకు అర్థయ్యేలా చెప్పి, తన వల్ల ఈ మానవాళికి ఎంత ముప్పుందో చూచాయిగా హింట్ ఇచ్చి, ఆ తరవాత అంజనాద్రి వైపు వెళ్లాడు. ఆ వరల్డ్ ప్రేక్షకులకు ఇంజెక్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా హీరో క్యారెక్టర్‌ని, తన జీవితాన్నీ, లవ్ స్టోరీని మెల్లమెల్లగా రివీల్ చేశాడు. ఎప్పుడైతే రుధిర మణి దొరికిందో.. అప్పుడు కథ జోరందుకొంటుంది. హనుమంతుడి శక్తి... హనుమంతులోకి రావడం, ఆ శక్తి వచ్చాక హనుమంతుడు చేసే విన్యాసాలు ఇవన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయి. ఓ కొతి పాత్రని కథలోకి తీసుకురావడం, ఆ పాత్రకు రవితేజతో వాయిస్ ఓవర్ చెప్పించడం సరదాగా ఉంది. సినిమా చివర్లో ఆ కోతి పాత్ర ఇతోదికంగా ఈ కథకు సహాయం చేసింది కూడా.
యాక్షన్ ఘట్టాల్ని దర్శకుడు ప్రత్యేక శ్రద్దతో డిజైన్ చేసుకొన్నట్టు కనిపిస్తుంది. హనుమంతుడి అండతో హీరో చేసే ఫైట్స్.. అలరించాయి. విజువల్ గా కూడా బాగున్నాయి. అంజనాద్రిని వెదుక్కొంటూ విలన్ రావడం.. ఇంట్రవెల్ బ్యాంగ్. ఆ తరవాత... హీరోకీ, విలన్‌కీ పోటీ మొదలవుతుంది. విలన్ ని ఎంత బలవంతుడిగా చూపిస్తే ఈ కథలు అంతగా రక్తి కడతాయి. అయితే ఇక్కడ విలన్ తేలిపోయాడు. హనుమంతుడ్నే ఎదుర్కొన్నాడంటే ఆ ప్రతినాయకుడు ఎలా ఉండాలి? మైఖైల్ పాత్రకు అంత శక్తి ఉన్నట్టు అనిపించదు. పైగా ఆ పాత్రని సరిగా ఆవిష్కరించలేదు. అయితే.. యాక్షన్ సన్నివేశాల్లో దర్శకుడు చూపించిన నేర్పు, హనుమంతుడి శక్తులు కథకు తగ్గట్టుగా వాడుకోవడం, ఎలివేషన్లు, విజువలైజేషన్... ఈ సినిమాని ముందుండి నడిపించాయి. సినిమా అంతా ఒక ఎత్తు. చివరి 20 నిమిషాలూ మరో ఎత్తు. అక్కడ.. దర్శకుడు ఈ సినిమాని యావరేజ్ నుంచి హిట్ బాట పట్టించాడు. హిమాలయాల్లో తపస్సు చేసుకొనే హనుమంతుడు... మంచు కొండల్ని బద్దలు కొట్టుకొంటూ బయల్దేరడం, అంతకు ముందు సముద్రఖని ఇచ్చిన ఎలివేషన్లూ వేరే లెవల్ లో పండాయి. చిన్న పిల్లలకు ఈ సీన్లు మరింత బాగా నచ్చుతాయి. కథలో కాన్ఫ్లిక్ట్ తేలిపోయానా, హనుమంతుడి ఎలిమెంట్, విజువల్స్ ఈ సినిమాని వీలైనంత వరకూ కాపాడాయి.
నటీనటులు: హనుమాన్ అనేది తేజా సజ్జా కెరీర్‌లో తప్పకుండా నిలిచిపోయే సినిమా అవుతుంది. అండర్ ప్లే చేసే నటుడు మాత్రమే ఈ పాత్రకు పర్‌ఫెక్ట్. తేజాకు ఇప్పటి వరకూ ఎలాంటి ఇమేజ్ లేకపోవడం బాగా కలిసొచ్చింది. తన స్క్రీన్ ఎప్పీరియన్స్ బాగా కుదిరింది. వరలక్ష్మీ శరత్ కుమార్‌కి మంచి మార్కులు పడతాయి. తనపై ఓ యాక్షన్ సీన్ కూడా డిజైన్ చేశారు. హీరోయిన్ కి చాలా ప్రాధాన్యం ఉందని తొలుత అనిపించినా, ఆ తరవాత క్రమంగా రెగ్యులర్ హీరోయిన్ గా మిగిలిపోయింది. వినయ్ రాయ్ పాత్రని మరింత బాగా డిజైన్ చేయొచ్చు. సత్య, గెటప్ శీను నవ్విస్తారు. ఇటీవల చనిపోయిన రాకేశ్ మాస్టర్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు.
సాంకేతిక వర్గం: చిన్న సినిమా అని చెబుతున్నా, టెక్నికల్ గా పెద్ద సినిమానే. విజువల్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. దర్శక నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఎక్కువగా నమ్మింది విజువల్సే. అంజనాద్రి సెట్, ఆ జలపాతాలు, హనుమంతుడి విగ్రహం ఇవన్నీ బాగా కుదిరాయి. ఫైట్స్ బాగా తీర్చిదిద్దారు. నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణ. ఆర్.ఆర్‌తో ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా పండలేదు. కథనంలో లోటు పాట్లు ఉన్నా, దర్శకుడు తన విజువలైజేషన్ స్కిల్స్ తో సినిమాని ముందుండి నడిపించాడు.
ప్లస్ పాయింట్స్
హనుమాన్
నేపథ్యం
నేపథ్య సంగీతం
విజువల్స్
మైనస్ పాయింట్స్
కాన్‌ఫ్లిక్స్ సరిగా లేకపోవడం
ఫైనల్ వర్డిక్ట్: ఆబాలగోపాలాన్ని అలరించే 'హనుమాన్'..