హ‌లో గురు ప్రేమ కోస‌మే మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, ప్రణీత, పోసాని, సితార & తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: విజయ్ కే చక్రవర్తి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
కథ: ప్రసన్న
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన  

రేటింగ్ : 2.75/5  

ప్రేక్ష‌కుల‌కు కావాల్సింది వినోద‌మే. అది ఏ రూపంలో అందించారు..?  అనేదానికంటే..  ఏ స్థాయిలో ఇచ్చార‌న్న‌దే ప్ర‌ధానం.  ప్రేమ క‌థ‌, యాక్ష‌న్ చిత్రం, మాస్ మ‌సాలా.. ఏదైనా కావొచ్చు. రెండున్న‌ర గంట‌ల కాల‌క్షేపం జ‌రిగిందా, లేదా అనేది చాలా ముఖ్యం. ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఆ సౌల‌భ్యం ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. యువ‌త‌రానికి కావ‌ల్సిన అంశాల‌న్నీ మేళ‌విస్తూ.. హాయిగా న‌వ్విస్తూ, ఓ ప్రేమ‌క‌థ చెబితే చాలు. బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ‌ట్టెక్కేయొచ్చు. `నేను శైల‌జ`తో ఈ విష‌యం తెలుసుకున్న రామ్‌... ఇప్పుడు `హ‌లో గురు ప్రేమ కోస‌మే`తోనూ అదే పంధాలో వెళ్లిపోయాడు. మ‌రి ఈ సినిమా ఫ‌లితం ఏమిటి?  రామ్ యూత్‌ని ఆక‌ట్టుకున్నాడా?  వినోదం పంచాడా..?

* క‌థ‌

సంజు (రామ్‌)ది కాకినాడ‌. ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. దానికి తోడు  అమ్మ (సితార‌) నాన్న (జేపీ) చేసే అతిగారాభం ఒక‌టి. సొంత ఊరుని మించిన‌ది లేద‌ని చెప్పే సంజు... ఉద్యోగ ప్ర‌య‌త్నాల నిమిత్తం హైద‌రాబాద్ వెళ్లాల్సివ‌స్తుంది. దారిలో అను (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌)ని చూసి ఆట పట్టిస్తాడు. ఆమె ఎవ‌రో కాదు.. విశ్వ‌నాథం (ప్ర‌కాష్ రాజ్‌) కూతురు.  సంజు అమ్మ‌కి విశ్వ క్లోజ్ ఫ్రెండ్‌. హైద‌రాబాద్‌లో సంజూ మ‌కాం.. విశ్వనాథం ఇంట్లోనే. ఆఫీసులో  రీతు (ప్ర‌ణీత‌)ని ప్రేమ‌లో ప‌డేయ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు సంజు. రీతూ కూడా సంజూకి ప‌డిపోతుంది. కానీ ఆ ప్ర‌యాణంలో త‌న‌కు రీతూపై కంటే అనుపైనే ప్రేమ ఉంద‌న్న సంగ‌తి సంజుకి అర్థ‌మ‌వుతుంది. అప్పుడు సంజూ ఏం చేశాడు?  రీతూని కాద‌ని అనుని ప్రేమించ‌డం మొద‌లెట్టాడా?  దానికి విశ్వనాథం ఒప్పుకున్నాడా?  అనేది తెర‌పైనే చూడాలి.

* న‌టీన‌టులు

రామ్‌లో ఎన‌ర్జీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న వ‌ర‌కూ చెల‌రేగిపోయాడు. కొత్త‌గా లేక‌పోయినా.. ఎప్ప‌టిలా అందంగా ఉన్నాడు. త‌న టైమింగ్ చాలా మెరుగుప‌డింది. 

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌న్ మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. త‌న అందం, న‌ట‌న‌.. రామ్‌తో చేసిన స‌న్నివేశాలు ఈ చిత్రానికి బ‌లం. 

ప్ర‌ణీత పాత్ర‌కు అంత ప్రాధాన్యం లేదు. ప్ర‌కాష్ రాజ్ పాజిటీవ్ పాత్ర‌లు చేస్తే భ‌లే ఉంటుంది. మ‌రోసారి అదే నిరూపిత‌మైంది. ప్ర‌కాష్ రాజ్ - రామ్ మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది. 

సితార‌, సురేష్‌... ఇలా ప్ర‌తీ పాత్ర‌కూ అనుభ‌వం ఉన్న‌వాళ్ల‌నే ఎంచుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. వాళ్లూ త‌మ అనుభ‌వాన్ని రంగ‌రించి న‌టించారు కాబ‌ట్టి.. పాత్ర‌లు పండాయి.

* విశ్లేష‌ణ‌

సినిమా చూపిస్త మావ‌, ఎంసీఏ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు త్రినాథ‌రావు న‌క్కిన. త‌న బ‌లం వినోద‌మే. అది మ‌రోసారి నిరూపిత‌మైంది. చాలా సాధార‌ణ‌మైన క‌థ‌ని... వినోదాత్మ‌కంగా తీర్చిదిద్ద‌డంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యాడు. సినిమా ప్రారంభ స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగిపోతాయి. సాఫ్ట్ వేర్ ట్రైనీగా రామ్ ఎంట‌ర్ అవ్వ‌డంతో వినోదం ఇంకాస్త ఎక్కువ‌వుతుంది. రొమాంటిక్ సీన్ల‌నీ బాగానే రాసుకోగ‌లిగాడు.  చెప్పాల్సిన క‌థ ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో... క‌థని అక్క‌డ‌క్క‌డే తిప్పుతూ.. బోర్ కొట్ట‌కుండా చూసుకున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు మ‌రీ అంత జోష్‌గా లేక‌పోయినా.. థియేటర్లో ఓకే అనిపిస్తాయి. విశ్రాంతి ముందు క‌థ తొలిసారి టర్న్ తీసుకుంటుంది. అక్క‌డ్నుంచి ప్ర‌కాష్ రాజ్ - రామ్‌ల మ‌ధ్య జ‌ర్నీ మొద‌ల‌వుతుంది. 

ఫ్రెండూ. ఫ్రెండూ.. అంటూ వాళ్లిద్ద‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు.. కాస్త కొత్త‌గా అనిపిస్తాయి. కూతుర్ని ప్రేమ‌లో ప‌డేయ‌డానికి తండ్రే స‌లహాలు ఇవ్వ‌డం... కాస్త కొత్త‌గా అనిపించేదే. రామ్‌, ప్ర‌కాష్ రాజ్ ఇద్ద‌రూ ప్ర‌తిభావంతులే కాబ‌ట్టి.. ఆయా స‌న్నివేశాలన్నీ న‌ల్లేరుపై న‌డ‌క‌లా సాగిపోతాయి. అయితే స‌న్నివేశాల తీత‌లోనూ, రాత‌లోనూ గ‌త చిత్రాలు కొన్ని గుర్తుకు రావ‌డం స‌హ‌జం. తండ్రిపై ఛాలెంజ్ చేసి కూతుర్ని ప్రేమ‌లో దింప‌డం అన్న‌ది చాలా పాత పాయింటు. అందుకే అక్క‌డ‌క్క‌డ స‌న్నివేశాలు రిపీట్ అయిన భావ‌న క‌లుగుతుంది.  అయితే ఇక్క‌డ తండ్రి పాత్ర లో నెగిటీవ్ ఛాయ‌లేమీ ఉండ‌వు. కాబ‌ట్టి.. ఆ ర‌కంగా... ద‌ర్శ‌కుడు కాస్త కొత్త‌గా ఆలోచించిన‌ట్టు అనిపిస్తుంది. ఎంత వినోదం పంచుతున్నా.. చివ‌ర్లో ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇస్తేనే ఇలాంటి క‌థ‌ల‌కు గుర్తింపు. 

నేను శైల‌జ‌లో బ‌ల‌మైన కాన్లిఫ్ట్ పాయింట్ ఉంటుంది. తండ్రి ప్రేమ కావాలా? ప‌్రియుడు కావాలా?  అనేది తేల్చుకోలేక‌పోతుంది క‌థానాయిక‌. ఇక్క‌డ అలాంటి బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ లేదు. కాబ‌ట్టి.. క‌థంతా కాల‌క్షేపం కోణంలోనే చూడాలి. యువ‌త‌రానికి న‌చ్చే అంశాలు, పాట‌లు, పంచ్‌లు ఉన్నాయి కాబ‌ట్టి - టికెట్టు రేటు గిట్టు బాటు అయిపోయిన‌ట్టే.

* సాంకేతిక వ‌ర్గం

దిల్‌రాజు సినిమాల‌న్నీ సాంకేతికంగా బాగుంటాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు మ‌రీ మరీ వినాల‌న్న స్థాయిలో లేవు గానీ.. బాగున్నాయి. విజువ‌ల్‌గా ఇంకాస్త బాగున్నాయి. మాట‌ల్లో పంచ్‌లు ప‌డ్డాయి. కాక‌పోతే కొన్ని మ‌రీ రొటీన్‌గా, కేవ‌లం పంచ్‌ల కోస‌మే రాశారా.... అన్న‌ట్టున్నాయి. త్రినాధ‌రావు ప్ర‌తిభావంతుడే. కానీ ఆ ప్ర‌తిభ‌కు మంచి క‌థ‌లు తోడ‌వ్వాలి. ఇలాంటి రొటీన్ క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేస్తే.. సేఫ్ జోన‌ర్‌లో ఉంటాడేమో గానీ, ఎక్కువ కాలం నిల‌బ‌డిపోయే సినిమాలు మాత్రం చేయ‌లేడేమో.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ వినోదం
+ రామ్ - అనుప‌మ కెమిస్ట్రీ
+ రామ్ - ప్ర‌కాష్ రాజ్‌ల మ‌ధ్య స‌న్నివేశాలు

* మైన‌స్ పాయింట్స్‌

- రొటీన్ క‌థ‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  హ‌లో గురూ.. కామెడీ కోస‌మే.  

రివ్యూ రాసింది శ్రీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS