నటీనటులు : విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళి శర్మ తదితరులు
దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాతలు : నాని, ప్రశాంతి తిపిర్నేని
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫర్ : ఎస్ మణికంధన్
ఎడిటర్: గ్యారీ బి
రేటింగ్: 2.5/5
థ్రిల్లర్ సినిమాలెప్పుడూ అవుట్‌డేటెడ్ కావు. ఆ సినిమాల్ని ఆదరించడానికి ఓ వర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కాసిన్ని తెలివితేటలు, స్క్రీన్ ప్లే మ్యాజిక్, గమ్మత్తైన ట్విస్టు ఉంటే సరిపోతుంది. భారీ బడ్జెట్లూ, కళ్లు చెదిరే తారాగణం అవసరం లేకపోవడంతో - ఈ తరహా కథలతో నవతరం దర్శకులు ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి వాళ్లకు `నాని` లాంటి నిర్మాత తోడైతే.. ఇక చెప్పేదేముంది? కచ్చితంగా మంచి సినిమాలే వస్తాయి. `అ`తో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు నాని. ఇప్పుడు `హిట్` తో వస్తున్నాడు. మరి ఈ సారి కూడా నాని తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? `హిట్` అనిపించుకునే సినిమా తీశాడా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
*కథ
విక్రమ్ (విశ్వక్ సేన్) ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. తనకు ఓ భయంకరమైన గతం ఉంటుంది. వాటి తాలుకూ జ్ఞాపకాలతో తరచూ ఒత్తిడికి గురవుతుంటాడు. అందులోంచి బయటపడడానికి ఆరు నెలలు ఉద్యోగానికి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకుంటాడు. ఈలోగానే తన ప్రేయసి నేహా (రూహానీ శర్మ) మాయం అవుతుంది. ఆ కేసుని టేకప్ చేద్దామనుకుంటే అప్పటికే దాన్ని మరో ఆఫీసర్ డీల్ చేస్తుంటాడు. దానికి సమాంతరంగా ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్ కేసుని తను ఎంచుకుంటాడు. ఎందుకంటే ప్రీతి కిడ్నాప్... నేహా కిడ్నాప్ ఒకేలా జరిగాయి కాబట్టి. ప్రీతి కేసుని సాల్వ్ చేసుకుంటూ.. నేహా ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తాడు విక్రమ్. మరి ఈ ఇన్వెస్టిగేషన్‌లో విక్రమ్‌కి ఎలాంటి నిజాలు తెలిశాయి. నేహా, ప్రీతీలు ఏమయ్యారు? ఎవరిని ఎలా కాపాడాడు? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
రెండు మిస్సింగ్ కేసుల చుట్టూ తిరిగే కథ ఇది. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ డ్రామాలు తెలుగులో చాలా చూశాం. అయితే.. దర్శకుడు ఇన్వెస్టిగేషన్ మెథడ్స్‌ని ఇంకా క్లియర్ కట్ గా చూపిస్తూ, ఈ సినిమాకి కొత్త కలరింగు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అసలు ఇలాంటి కేసుల్లో పోలీసుల విచారణ ఎంత పకడ్బందీగా జరుగుతుంది? హంతకుల్ని పట్టుకునే క్రమంలో వాళ్ల ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? అనే విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారిందులో. ఎలాంటి కమర్షియల్ దారుల్లోనూ వెళ్లకుండా పక్కాగా ఓ సస్సెన్స్ కథే చెప్పాలన్న ప్రయత్నం బాగుంది. విక్రమ్ తెలివితేటల్ని ప్రేక్షకులకు పరిచయం చేసే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా, ఇంటిలిజెంట్‌గా ఉంటాయి. కథకి మంచి టేకాఫ్ దొరికింది. ప్రీతి కిడ్నాప్‌నుంచి కథ ఊపందుకుంటుంది. సడన్‌గా నేహా కిడ్నాప్ అయ్యేసరికి ముదిరి పాకాన పడుతుంది. `డెడ్ బాడీ` ట్విస్టుతో ఇంట్రవెల్ కార్డు వేశాడు.
ఇలాంటి కథల్లో అసలు సమస్య చిక్కుముడులు విప్పే దగ్గరే వస్తుంది. ద్వితీయార్థంలో దర్శకుడు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సివచ్చింది. అందులో కొన్ని సమాధానాలు సంతృప్తికరంగా అనిపిస్తే.. కొన్ని చోట్ల కప్పదాటు పద్ధతిని అవలంభించాడు. కొన్ని అనవసరమైన డౌట్లు సృష్టించి, కథని లాగే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్ వరకూ హంతకుడు ఎవరో తెలీదు. తీరా తెలిశాక... ఆశ్చర్యపోవాల్సింది పోయి.. ఓస్ ఈమాత్రం దానికా... అన్న ఫీలింగ్ కలిగించాడు.ప్రతీ సన్నివేశాన్నీ డీటైల్‌గా చెప్పే ప్రయత్నంలో సినిమాని సాగదీశాడు. హంతుకుడెవరో తెలిశాక... కథని మరోసారి రీకలెక్ట్ చేసుకుంటే, మరిన్ని కొత్త డౌట్లు పుడతాయి. క్లైమాక్స్ విషయంలో భిన్నంగా ఆలోచించాల్సింది. ప్రేక్షకులకు అసలు సిసలైన షాక్ రుచి చూపిస్తే.. హిట్ నిజంగా హిట్టయ్యేది.
* నటీనటులు
విశ్వక్‌సేన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇమిడిపోయాడు. తన ఎమోషన్స్, ఫైర్.. ఇవన్నీ చక్కగా పలికాయి. తనని తప్ప విక్రమ్ పాత్రలో మరొకరిని ఊహించలేం. ఆ స్థాయిలో నటించాడు. రుహానీది చిన్న పాత్ర. తనని హీరోయిన్ అని కూడా అనలేం. చాలాకాలం తరవాత భానుచందర్‌కి మంచి పాత్ర పడింది. మిగిలినవాళ్లవి మరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాత్రలు కావు. కాకపోతే అందరూ సహజంగా నటించే ప్రయత్నం చేశారు.
* సాంకేతిక వర్గం
స్క్రిప్టుని చాలా పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. మరీ టూమచ్ ట్విస్టులేం ఉండవు.క్లైమాక్స్ పై ఇంకాస్త వర్క్ చేయాల్సింది. సినిమాలో పాటలు లేవు. ఒక్క పాట బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఆ పాట కథని, కథానాయకుడి అంతర్గతాన్నీ చెబుతుంది. ఆర్.ఆర్ బాగుంది. నాని పెద్దగా ఖర్చు పెట్టలేదు. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తయ్యింది.
* ప్లస్ పాయింట్స్
విశ్వక్ సేన్
స్క్రిప్టు
ఇన్వెస్టిగేషన్ మెథడ్స్
* మైనస్ పాయింట్స్
క్లైమాక్స్
టూ మచ్ లాగ్
ఫైనల్ వర్డిక్ట్: యావరేజ్