నటీనటులు : ప్రియదర్శి, నందిని రాయ్, పోసాని కృష్ణ మురళి తదితరులు
దర్శకత్వం : విద్య సాగర్ ముత్తుకుమార్
నిర్మాతలు : సురేష్ కృష్ణ
సంగీతం : దీపక్ అలెగ్జాండర్
సినిమాటోగ్రఫర్ : వరుణ్ డీకె
ఎడిటర్ : నిఖిల్ శ్రీకుమార్
రేటింగ్: 2/5
వెబ్ సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్త. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌ల పుణ్యమా అని.. ఇంటర్నేషన్ వెబ్ సిరీస్‌లు చూసే అవకాశం దక్కింది. ఇప్పుడిప్పుడే వాటికి అలవాటు పడుతున్నారు. తెలుగులో జోరుగా వెబ్ సిరీస్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే... ఇప్పటి వరకూ మనదైన ముద్ర వేయలేకపోయాం. కాకపోతే.. ఆ ప్రయత్నాలు జోరుగా సాగడం, కొత్త తరహా కథలకు వెబ్ సిరీస్‌ల ద్వారా పెద్ద పీట వేయడం, కొత్త తరానికి అవకాశాలు ఇవ్వడం నిజంగా ఆహ్వానించదగిన పరిణామమే. తాజాగా `ఆహా`లో ఓ వెబ్ సిరీస్ వచ్చింది. అదే `ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్`. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ప్రియదర్శి ప్రధాన పాత్ర వహించడంతో ఈ వెబ్ సిరీస్‌పై దృష్టి పడింది. మరి... తెలుగులో సరైన వెబ్ సిరీస్ రాలేదన్న అసంతృప్తిని `ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్` దూరం చేసిందా, లేదా? ఈ సిరీస్ కథా కమామిషూ ఏమిటి?
* కథ
ఆది (ప్రియదర్శి) కి జీవితంలో స్థిరత్వం అంటూ ఉండదు. అయ్యప్ప (పోసాని కృష్ణమురళి) దగ్గర చిన్నా చితకా పనులు చేస్తుంటాడు. అమ్మ చనిపోయిన తరవాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో ఓ రిసార్ట్ లీజుకు తీసుకుని నడుపుకోవాలనుకుంటాడు. అయ్యప్ప రెండో భార్య మీనా (నందినిరాయ్) పై ఆది కన్ను పడుతుంది. తనని ఎలాగైనా అనుభవించాలనుకుంటాడుల. అయితే అప్పటికే మీనా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది.
ఈ విషయం అయ్యప్పకి తెలిసిపోతుంది. దాంతో.. ఈ వ్యవహారం ఎక్కడ బయటపడిపోతుందేమో అన్న భయంతో.. అయ్యప్పని మీనా చంపేస్తుంది. ఆ శవాన్ని మాయం చేయడానికి.. ఆదిని పావుగా వాడుకుంటుంది. అక్కడి నుంచి.. ఆదికి కష్టాలు మొదలవుతాయి. అయ్యప్ప దగ్గరున్న హవాలా డబ్బు 5 కోట్లు కూడా ఆదినే దొంగిలించాడన్న అనుమానంతో ఓ ముఠా ఆదిని వెంబడిస్తుంది. ఆ 5 కోట్లూ అయ్యప్ప ఎక్కడ దాచాడన్నది ఎవ్వరికీ అంతుపట్టదు. ఆ డబ్బుని సంపాదించడానికి ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తూనే ఉంటారు. మరి ఆ 5 కోట్లు ఏమయ్యాయి? ఆది ఈ కేసు నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు హంతకులు దొరికారా, లేదా? అనేది మిగిలిన కథ.
* విశ్లేషణ
అత్యాస, మోసం, అక్రమ సంబంధాలు... మనుషులతో ఎన్ని తప్పులు చేయిస్తుందో చెప్పే కథ ఇది. ఇందులో థ్రిల్లర్ కి కావల్సిన అన్ని అంశాలూ ఉన్నాయి. ఆ మాటకొస్తే ఇంకొచెం ఎక్కువే కనిపిస్తాయి. అయితే వాటి పొందికే సరిగా కుదర్లేదు. ఏడు ఎపిసోడ్ల సమాహారం ఈ వెబ్ సిరీస్. తొలి ఎపిసోడ్ తప్పిస్తే..మిగిలినవన్నీ... సీరియల్ లా సాగుతుంటాయి. ఎక్కడ మొదలైందో, ఎక్కడికి వెళ్తుందో.. ఓ పట్టాన అర్థం కాదు. అర్థం పర్థం లేని ఎమోషన్లు, ఏ పాత్రకీ సరైన తీరూ, తెన్నూ లేకపోవడం, అసలు విషయం పక్కన పెట్టేసి, కొత్త విషయాలు చెప్పే క్రమంలో.. కాలయాపన చేశాడు దర్శకుడు.
రూ.5 కోట్ల హవాలా సొమ్ము ఏమైందన్నదే ఈ కథకు కీ పాయింట్. అది వదిలేసి, మిగిలిన విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు దర్శకుడు. ప్రతీ డైలాగ్ కీ ముందో, వెనుకో ఓ బూతు జోడించాడు. అలా బూతులు మాట్లాడుకుంటే ఇదేదో బోల్డ్ సినిమా అయిపోతుందనుకున్న భ్రమల్లో ఉన్నారు దర్శక నిర్మాతలు. కంటెంట్ లో.. బోల్డ్ నెస్ ఉండాలి కానీ, మాటల్లో కాదు. అలా అవసరం ఉన్నా, లేకపోయినా బూతులు మాట్లాడేస్తుంటే.. ప్రేక్షకుడికి ఒకరకమైన ఏహ్య భావం వేస్తుందన్న విషయాన్ని రూపకర్తలు గుర్తించుకోవాలి.
ఆది కి ఓ తండ్రి ఉండడం, ఆ పాత్ర మధ్యలో ఎంటర్ అవ్వడం వల్ల.. సన్నివేశాలు సాగాయే తప్ప.. కథకు ఉపయోగపడలేదు. మీనా సినిమా వేషాల కోసం ప్రయత్నించడం, అందులో విఫలం అవ్వడం మరో ట్రాక్. దాని వల్ల ఉత్కంఠత పెరిగిందేం లేదు. ఇలా సైడ్ ట్రాకులు చాలా ఉంటాయి. కథ ఎటెటో తిరిగి.. మళ్లీ రూ.5 కోట్ల వ్యవహారం దగ్గరకు వస్తుంది. ఆ 5 కోట్ల వెనుక ఏదో మిస్టరీ ఉందనుకుంటే.. అదికూడా తుస్సుమంటుంది. చివర్లో బోలెడన్ని ప్రశ్నలు వదిలేశారు. ఈ సీజన్ హిట్టయితే, సెకండ్ సీజన్ లో వాటికి సమాధానాలు ఇద్దామనుకున్నారేమో..? ఈ సీజన్ లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. వాటికి 4కి కుదించుకుంటే బాగుండేది. కథనంలో వేగం వచ్చేది. ఇందులో క్రైస్తవ మతానికి సంబంధించి కొన్ని సీన్లు ఉన్నాయి. వాటికీ ఈ కథకీ లింకేమిటో అర్థం కాదు. పైగా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే టైటిల్ కీ ఈ కథకీ జస్టిఫికేషన్ ఏమిటో తెలీదు.
* నటీనటులు
ప్రియదర్శిని ఇలాంటి పాత్రల్లో చూడడం చాలా కొత్త. స్వార్థపరుడైన పాత్రలో.. ఓ కొత్త ప్రియదర్శి కనిపిస్తాడు. అయితే ఆ పాత్రని డిజైన్ చేసిన విధానం సవ్యంగా లేదు. తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యని ఎందుకు దూరం పెడతాడో అర్థం కాదు. తనని మోసం చేసినవాడితో వ్యాపారం చేయాలని ఎలా అనుకుంటాడో తెలీదు. ప్రధాన పాత్రలోనే ఇన్ని లూప్ హోల్స్ ఉంటే ఎలా? నందిని రాయ్ సెక్సీగా ఉంది. తన నటన సహజంగా అనిపించింది. పోసాని ఒకే ఒక్క ఎపిసోడ్ కే పరిమితం. ఆ పాత్రతోనూ కావల్సినదానికంటే ఎక్కువ బూతులు పలికించారు. రోసి పాత్ర వెరైటీగా ఉంటుంది. తన పేరుతో పాటు ప్రవర్తన కూడా. చాలా పాత్రలు ఉన్నా... దేనికీ సరైన ముగింపు లేదు. అన్నీ అస్తవ్యస్తంగానే సాగాయి.
* సాంకేతిక వర్గం
టేకింగ్ సహజంగా ఉంది. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. అయితే స్క్రిప్టులోనే చాలా లోపాలున్నాయి. కథలో కంటెంట్ ఉన్నా, ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నా, దర్శకుడు సరిగా వాడుకోలేదు. అసలు విషయాన్ని వదిలేసి, కొసరు విషయాలు చెప్పుకుంటూ వెళ్లి, బోర్ కొట్టించాడు. వెబ్ సిరీస్ తీతలో మనవాళ్లు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న విషయాన్ని ఈ వెబ్ సిరీస్ మరోసారి నిరూపించింది. ఇలానే అర్థం పర్థం లేని వెబ్ సిరీస్‌లు తీసుకుంటూ పోతే.. తెలుగులో వెబ్ సిరీస్ చూడాలన్న ఆసక్తి తగ్గిపోవడం ఖాయం.
* ప్లస్ పాయింట్స్
నటీనటుల ప్రతిభ
ఒకట్రెండు ఎపిసోడ్లు
* మైనస్ పాయింట్స్
పేలవమైన స్క్రీన్ ప్లే
పట్టులేని సన్నివేశాలు, పాత్రలు
* ఫైనల్ వర్డిక్ట్: హింస - బూతు