నటీనటులు : ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జేమ్స్ కాస్మో, కలైరసన్ తదితరులు
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాణం : వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫర్ : శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: వివేక్ హర్షన్
రేటింగ్: 2/5
గ్యాంగ్ స్టర్ సినిమాలు కొత్తేం కాదు. గాడ్ ఫాదర్ నుంచి నిన్నా మొన్నటి కేజీఎఫ్ వరకూ ప్రతీ భాషలోనూ ఇలాంటి కథలొచ్చాయి. ఓ అనామకుడు గ్యాంగ్ స్టర్ ఎలా అయ్యాడన్నదే అన్నిటి కథ. అయితే.. ప్రతీ కథలోనూ అదే చూపిస్తానంటే కుదరదు. మరో పొర ఉండాల్సిందే. అప్పుడే ఆ తరహా కథలు రక్తి కడతాయి. కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఇప్పుడు `గ్యాంగ్ స్టర్` కథే ఎంచుకున్నాడు. `జగమే తంత్రం`తో. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈరోజు (శుక్రవారం) ఓటీటీలో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న `జగమే తంత్రం`లో గ్యాంగ్ స్టర్ ఎలాంటివాడు? తన నేపథ్యం ఏమిటి? ఈ గ్యాంగ్ స్టర్ కథని.. చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న మరో పొర ఏమిటి?
* కథ
లండన్ నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. అక్కడ రెండు గ్యాంగులు ఎప్పుడూ కొట్టుకుంటుంటాయి. లో శివదాస్ (జోసెఫ్ జోజు) తన ప్రత్యర్థి పీటర్ (జేమ్స్ కోస్మో) ముఠాలోకి కీలకమైన వ్యక్తిని చంపేస్తాడు. దాంతో..శివదాస్ పై పీటర్ పగ మరింత పెరుగుతుంది. తనని అణచి వేయడానికి ఓ వ్యక్తి అవసరం అవుతాడు. తనే.. సురుళి (ధనుష్). తను తమిళనాడులో ఓ చిన్న దాదా. పరోటా హోటెల్ నడుపుకుంటూ దాదాగిరి చేస్తుంటాడు. తనని లండన్ తీసుకొస్తారు.
సురిళి వచ్చీ రాగానే శివదాస్ జోరుకు కళ్లెం వేస్తాడు. తన ముఠా ఆటలు కట్టిస్తాడు. అయితే.. ఓసారి శివదాస్ ముఠాకి సురళి దొరికేస్తాడు. `నిన్ను చంపకుండా వదిలిపెట్టాలంటే ఓ పని చేసి పెట్టాలి` అని ఆఫర్ ఇస్తాడు శివదాస్. ఆ పనేంటి? దానికి ... సురుళి ఒప్పుకున్నాడా, లేదా? నిజానికి లండన్ లో జరుగుతోందేమిటి? శివదాస్, పీటర్ ల మధ్య అసలు గొడవేంటి? అనేది మిగిలిన కథ.
* విశ్లేషణ
ఇది మామూలు గ్యాంగ్ స్టర్ కథే. చెన్నైలోని లోకల్ దాదా - లండన్ దాదాగా ఎలా మారాడు? అనేది కథ. అయితే దర్శకుడు దానికి ఇంకో పొర చేర్చాడు. అదే శరణార్థుల సమస్యలు. తమిళనాడులో ఈ సమస్య ఎక్కువ. ముఖ్యంగా... శ్రీలంకలో తలదాచుకున్న తమిళుల బాధలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. తమిళ్ మాట్లాడుతున్నంత మాత్రాన.. తమిళనాడు వాడు కానక్కర్లెద్దు.. అనే ఓ డైలాగ్ ఈ సినిమాలో వినిపిస్తుంది. అంటే.. ఎక్కడెక్కడో వాళ్లంతా ఉన్నారు. వాళ్లంతా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ల గురించి మాట్లాడే కథ ఇది.
ఒకే చోట ఉంటూ.. కులాలు, మతాల గురించి ఎక్కువ కొట్టుకోకండి.. పరాయి దేశం వెళ్తే. మనల్నందరినీ నీచంగానే చూస్తుంటారు.. అనే మరో డైలాగ్ ఉంది. మనం పోరాడవలసిన సమస్యలు ఇంకెన్నో ఉన్నాయన్న విషయాన్ని దర్శకుడు చూచాయిగా చెప్పే ప్రయత్నం చేశాడు. దర్శకుడి ఆలోచన మంచిదే. అయితే.. దాన్ని అర్థమయ్యేలా, అర్థం చేసుకునేలా, జనరంజకంగా మలచాలి. అక్కడే దర్శకుడు తప్పు చేశాడు. ఈ కథని చాలా రొటీన్ గా మొదలెట్టాడు.
ధనుష్ ఎంట్రీ, లండన్ లో చూపించిన తన ప్రతాపం అన్నీ.. ధనుష్ అభిమానులకైతే నచ్చొచ్చు గాక, కాకపోతే అవన్నీ పరమ రొటీన్ గా, లాజిక్ కి దూరంగా ఉంటాయి. తమిళనాడు నుంచి వచ్చిన ఓ లోకల్ దాదా, అదీ భాష రాకుండా, అదీ అతి తక్కువ రోజుల్లో.. లండన్ నే గడగడలాడిస్తున్న ఓ గ్యాంగ్ స్టర్ ని ఇబ్బంది పెట్టడం నిజంగానే.. లాజిక్ కి అందదు. విశ్రాంతి ముందొచ్చే ట్విస్టు కూడా ఊహించిందే. అక్కడి వరకూ `జగమే తంత్రం` చాలా రెగ్యులర్ గా సాగిపోతుంది. ఎలాంటి విశేషమూ ఉండదు.
అయితే సడన్ గా హీరోయిన్ పాత్ర రివర్స్ అవ్వడంతో.. సినిమా అసలు కథలోకి వెళ్తుంది. శరణార్థుల బాధలు, వాళ్ల వెర్షన్, హీరో చేసిన `ద్రోహం` అర్థమయ్యాక... కథలో డెప్త్ తెలిసొస్తుంది. ఆ తరవాత.. హీరో శరణార్థుల కోసం ఏమైనా చేశాడా, అంటే అంత ఏమీ కనిపించదు. డైరెక్టుగా విలన్ ని చంపి, శరణార్థులకు స్వేచ్ఛ కల్పించినంత బిల్డప్ ఇస్తాడు. `యుద్ధం మొదలెట్టడమే కానీ, ముగించడం మన చేతుల్లో ఉండదు` అనేది ఆఖరి డైలాగ్. అంటే.. శరణార్థుల సమస్య అలా రగులుతూనే ఉంటుంది.. అని పరోక్షంగా చెప్పడమన్నమాట. ఓరకంగా.. ఇది ఉడికీ ఉడకని కూర లాంటిది. బలమైన విషయాన్ని సగం సగం చెప్పాడంతే. కర్ర విరక్కుండా, పామూ చావకుండా.. గట్టు దాటేయడం లాంటిది. యాక్షన్ ఘట్టాల్లో ప్రత్యేకతలేం లేవు. అక్కడక్కడ ధనుష్ కోసం చూడడం తప్ప, ఈ సినిమాలో పెద్దగా విశేషం ఏమీ ఉండదు.
* నటీనటులు
ధనుష్ లోకల్ డాన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. లండన్ వెళ్లాక కాస్త స్టైలీష్ గా కనిపించే ప్రయత్నం చేసినా.. ఆ గెటప్ ధనుష్ కి నప్పలేదు. లండన్ గ్యాంగ్ స్టర్ గా జేమ్స్ మెప్పించాడు. హీరోయిన్ కి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. మిగిలిన వాళ్లలో గుర్తు పెట్టుకునేంత ప్రతిభా పాటవాలు ఎవరూ చూపించలేదు.
* సాంకేతిక వర్గం
స్క్రిప్టుపై దర్శకుడు పూర్తిగా దృష్టి పెట్టలేదు. కాందిశీకుల సమస్యని అర్థం చేసుకున్నా, దానికి పరిష్కార మార్గం చూపించలేకపోయాడు. అటు గ్యాంగ్ స్టర్ కథకూ, ఇటు శరణార్థుల సమస్య రెండింటికీ న్యాయం చేయలేదు. రెండు పాటలున్నాయి. ఒకటి మహా మాస్ గా ఉంటుంది. పాటలకు తక్కవ స్కోప్ ఇవ్వడం వల్ల మంచే జరిగింది. ప్రధమార్థంలో మెరుపుల్లేవు. ద్వితీయార్థం కీలకంగా మారింది. అక్కడ స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది.
* ప్లస్ పాయింట్స్
లండన్
ధనుష్ నటన
* మైనస్ పాయింట్స్
పాత కథ
బలంగా పండని ఎమోషన్స్
* ఫైనల్ వర్డిక్ట్: ఫలించని మంత్రం.