Itlu Maredumilli Prajaneekam: 'ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం' రివ్యూ & రేటింగ్‌!

మరిన్ని వార్తలు

నటీనటులు: అల్లరి నరేష్, ఆనంది, ప్రవీణ్, సంపత్ రాజ్
దర్శకుడు : ఏఆర్ మోహన్
నిర్మాత: రాజేష్ దండా
సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకల
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్


రేటింగ్‌: 2.75/5


అల్ల‌రి న‌రేష్.. ఇది వ‌ర‌కు పేరుకు త‌గ్గ‌ట్టుగానే అల్ల‌రి చేసేవాడు. ఇది వ‌ర‌కు.. కామెడీ చిత్రాల‌కు తానే కేరాఫ్ అడ్ర‌స్‌. అయితే... న‌వ్వించీ, న‌వ్వించీ త‌న‌కీ విసుగొచ్చింది. పైగా.. హిట్లు కూడా ప‌డ‌లేదు. ప్రేక్ష‌కులే కాదు.. న‌రేష్ కూడా మార్పు కోరుకొన్నాడు. అందులో భాగంగానే `నాంది` అనే సినిమా చేశాడు. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా బాగా ఆడింది. న‌టుడిగా న‌రేష్‌కి మంచి పేరు తెచ్చింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ద‌క్కాయి. ఇంత‌కంటే ఏం కావాలి? దాంతో.. న‌రేష్ రూటు మారింది. సీరియ‌స్ క‌థ‌లు కూడా న‌రేష్‌పై వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని ఇండ‌స్ట్రీ న‌మ్మింది. నిర్మాత‌లూ న‌మ్మారు. న‌రేష్ కూడా అదే మ‌రింత బ‌లంగా న‌మ్మాడు. అందులో భాగంగా రూపొందిన సినిమా... `ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం`. ఓ సామాజిక ఇతివృత్తంతో తెర‌కెక్కించిన ఈ సినిమా. ఈరోజే (న‌వంబ‌రు 25) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి న‌రేష్ చేసిన ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ ఫ‌లించింది? ఇందులో ద‌ర్శ‌కుడు ఎత్తుకొన్న పాయింట్ ఏంటి?


* కథ‌


శ్రీ‌నివాస్ (అల్ల‌రి న‌రేష్‌) తెలుగు టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. రాజ‌మండ్రికి ద‌గ్గ‌ర్లో ఉన్న మారేడుమిల్లి ప్రాంతానికి ఎన్నిక‌ల అధికారిగా వెళ్తాడు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఎన్నో స‌మ‌స్య‌లు ఉంటాయి. తమ ప్రాంతానికి ఓ స్కూలు, ఆసుప‌త్రి, వంతెన కావాలన్న‌ది వాళ్ల ప్ర‌ధాన‌మైన డిమాండ్లు. అయితే ఏ ప్ర‌భుత్వాధికారీ వాటిని ప‌ట్టించుకోడు. దాంతో ఎన్నిక‌ల్ని బ‌హిష్క‌రిస్తారు. అలాంటి చోట నూటికి నూరుశాతం ఓటింగ్ సాధించాల‌న్న మిష‌న్‌తో అడుగుపెడ‌తాడు శ్రీ‌నివాస్‌. త‌న‌కు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? త‌ను వెళ్లిన ప‌ని జ‌రిగిందా, లేదా? ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు న్యాయం చేకూర్చ‌డానికి తను ఏం చేశాడు? ఇవ‌న్నీ తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.


* విశ్లేష‌ణ‌


మ‌న చుట్టూ క‌నిపిస్తున్న‌దే అభివృద్ది అనుకోవ‌డం త‌ప్పు. క‌నీస సౌక‌ర్యాలకు కూడా నోచుకోని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి చెప్పే క‌థ ఇది. ప్ర‌జ‌ల్ని కేవ‌లం ఓటు బ్యాంకులుగా చూసే రాజ‌కీయ నేత‌లు, గ‌వ‌ర్న‌మెంటు ప్యూనుకి కూడా అలుసైపోయే ప్ర‌జ‌లు.. వీళ్లంతా మ‌న చుట్టూనే ఉన్నారు. వాళ్ల‌కు చుర‌క అంటించే క‌థ ఇది. నిజానికి క‌థ‌, క‌థ‌నం, ఇందులో స‌న్నివేశాలు ఇవేం మ‌న‌కు కొత్త‌గా అనిపించ‌వు. దానికి గ‌ల కార‌ణం.. ఇవ‌న్నీ మ‌న చుట్టూ జ‌రుగుతున్న విష‌యాలే. 2022లో కూడా.. క‌రెంటు కూడా లేని ప్రాంతాలు ఉన్నాయంటే మ‌న‌కు న‌మ్మ‌కం క‌ల‌గ‌దు. ఇక స్కూలు, ఆసుప‌త్రి లాంటి క‌నీస అవ‌స‌రాలు ఎక్క‌డ దొరుకుతాయి? రాజ‌కీయ నేప‌త‌ల‌కు ప్ర‌జ‌లు కేవ‌లం ఓట్లుగా క‌నిపిస్తుంటారు. ఉద్యోగుల‌కు వాళ్లు కాగితాల‌పై అంకెలంతే. ప్ర‌భుత్వ ఉద్యోగులు, నేత‌లు మారేంత వ‌ర‌కూ కొన్ని ప్రాంతాలు ఇంకా చీక‌ట్లోనే మ‌గ్గిపోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతానికి సంబంధించిన క‌థ ఇది.


మారేడుమిల్లిలో ఎన్నిక‌లు ఎందుకు జ‌ర‌గాలి? అక్క‌డి ప్రాధాన్య‌త ఏమిటి? అనే విష‌యాల్ని చెప్ప‌డానికి ద‌ర్శ‌కుడు కొంత స‌మ‌యం తీసుకొన్నాడు. ఆ త‌ర‌వాత శ్రీ‌నివాస్ (న‌రేష్‌) ఎంట్రీ. శ్రీ‌నివాస్ వ్య‌క్తిత్వం ఎఓలాంటిదో చెప్ప‌డానికి మ‌రికొంత స‌మ‌యం గ‌డిచిపోతుంది. మారేడుమిల్లిలో క‌థానాయ‌కుడు అడుగుపెట్టాక క‌థ మొద‌ల‌వుతుంది. అక్క‌డి ప్ర‌జ‌ల్లో మార్పు తీసుకుని రావ‌డానికి త‌ను చేసిన య‌త్నాలతో క‌థ ట్రాకులో ప‌డుతుంది. ఇంట్ర‌వెల్ కి ఓ ట్విస్టు వ‌స్తుంది. అక్క‌డి నుంచి కిడ్నాప్ డ్రామా మొద‌ల‌వుతుంది. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి కిడ్నాప్ అయితే.. ప్ర‌భుత్వ యంత్రాంగం ఎలా స్పందించింది? బ‌్యాలెట్ బాక్సులు వెన‌క్కి తీసుకురావ‌డానికి క‌లెక్ట‌ర్ ఏం చేశాడు? ఇవ‌న్నీ ద్వితీయార్థంలో చూస్తాం. ప్ర‌జ‌ల బాధ‌లు ఓ వైపు చెబుతూనే, ప్ర‌భుత్వ అధికారుల నిర్ల‌క్ష్యం, వాళ్ల ఎత్తుగ‌డ‌లు మ‌రోవైపు క‌ళ్ల‌కు క‌ట్టారు. ప‌తాక స‌న్నివేశాల్లో న‌రేష్ చెప్పే సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకొంటాయి. ఆలోచ‌న‌లో ప‌డేస్తాయి. క్లైమాక్స్ లో ఏం జ‌రుగుతుందో ముందే తెలిసిపోయినా.. చివ‌రి వ‌ర‌కూ కుర్చీల్లో కూర్చోబెట్ట‌గ‌లిగారు.


* న‌టీన‌టులు


నాంది త‌ర‌వాత న‌రేష్ చేసిన మ‌రో మంచి ప్ర‌య‌త్నం ఇది. శ్రీ‌నివాస్ పాత్ర‌లో చ‌క్క‌గా ఇమిడిపోయాడు. తెలుగు భాష గొప్ప‌ద‌నం, ప్ర‌భుత్వ అధికారుల నిర్ల‌క్ష్యం, క‌లెక్ట‌ర్‌కీ, టీచ‌ర్‌కీ ఉన్న తేడా చెప్ప‌డం.. లాంటి సీన్ల‌లో న‌రేష్ న‌ట‌న‌, త‌న‌కు రాసిన సంభాష‌ణ‌లు బాగున్నాయి. హీరోయిజం ఎక్క‌డా క‌నిపించ‌కుండా.. ఓ సామాన్యుడి తిరుగుబాటులానే క‌థ సాగుతుంది.


ఆనందిని పాత్ర బాగుంది. త‌న‌కీ క‌థ‌లో ప్రాధాన్య‌త ఇచ్చారు. వెన్నెల కిషోర్ న‌వ్వించాడు. గూడెం ప్ర‌జ‌లు.. అక్క‌డ చూపించిన పాత్ర‌లూ ఇంపాక్ట్ క‌లిగించాయి. క‌లెక్ట‌ర్ గా సంప‌త్ రాజ్ న‌ట‌న హుందాగా, డీసెంట్‌గా ఉంది.


* సాంకేతిక వ‌ర్గం


ఇలాంటి రాయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. కానీ ఈ క‌థ‌ని న‌మ్మ‌డం మాత్రం పెద్ద రిస్క్‌. ఈ విష‌యంలో నిర్మాత‌ని అభినందించాలి. ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌లూ వేసుకోకుండా చేసిన సినిమా ఇది. నేప‌థ్య సంగీతం, కెమెరా వ‌ర్క్ బాగున్నాయి. ల‌చ్చిమి.. అనే పాట విన‌గా విన‌గా న‌చ్చుతుంది. ముఖ్యంగా అబ్బూరి ర‌వి సంభాష‌ణ‌ల‌కు మంచి మార్కులు ప‌డ‌తాయి.


ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌కి వంక పెట్ట‌లేం.కానీ గ్రాఫిక్స్ విష‌యంలో ఇంకాస్త శ్ర‌ద్ధ తీసుకొంటే బాగుండేది. కొన్ని బోరింగ్ సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి. లెక్చ‌ర్ దంచికొట్టిన ఫీలింగ్ అప్పుడ‌ప్పుడూ వ‌స్తుంది. కానీ.. మంచి విష‌యం చెప్ప‌డానికి, విన‌డానికి వాటిని పెద్ద‌గా ప్ర‌తికూలాంశాలుగా చెప్ప‌లేం.


* ప్ల‌స్ పాయింట్స్‌


క‌థాంశం
న‌రేష్ న‌ట‌న‌
సంభాష‌ణ‌లు
ఫొటోగ్ర‌ఫీ


* మైన‌స్ పాయింట్స్


బోరింగ్ స్క్రీన్ ప్లే
తెలిసిన క‌థే


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: నిజాయ‌తీగా చేసిన ప్ర‌య‌త్నం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS