నటీనటులు : శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, వర్ష బొల్లమ్మ, గౌరీ కిషన్, రఘుబాబు తదితరులు
దర్శకత్వం : సి. ప్రేమ్ కుమార్
నిర్మాతలు : దిల్ రాజు
సంగీతం : గోవింద్ వసంత
సినిమాటోగ్రఫర్ : మహేంద్రన్ జయరాజు
ఎడిటర్: ప్రవీణ్ కే ఎల్
రేటింగ్: 3/5
రీమేక్ సేఫ్ గేమ్ అనుకుంటాం గానీ, దాన్ని తెరకెక్కించడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా ఫీల్ గుడ్ లాంటి సినిమాలకు. ఆ మ్యాజిక్ మళ్లీ రీ క్రియేట్ చేయడం తలకు మించిన సామే. కమర్షియల్ సినిమాలు రీమేక్ చేసేటప్పుడు, ఇక్కడి హీరో తాలుకూ ఇమేజ్‌కీ, ఫ్యాన్స్‌ల ఆలోచన ధోరణికి అనుగుణంగా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రేమ కథలూ, ఫీల్ గుడ్ సినిమాలకు ఆ ఛాన్స్ కూడా ఉండదు.
ఉన్నది ఉన్నట్టుగా తీస్తే, కట్ - కాపీ - పేస్ట్ అంటారు, కొత్తగా ప్రయత్నించి చేతులు కాల్చుకుంటే - ఎందుకు పాడు చేశారు? అని నిలదీస్తారు. `96`లాంటి క్లాసిక్ కథల జోలికి అస్సలు వెళ్లకూడదని చాలామంది గట్టిగా చెబుతుంటారు. కానీ దిల్ రాజు మాత్రం ధైర్యం చేసి, `96`ని కావాలని ఎంచుకున్నాడు. మరి ఈ ఈ ప్రయత్నం సాహసం అనుకోవాలా? మొండితనం అనుకోవాలా? పిచ్చి అనుకోవాలా? ఇంతకీ ఈ రీమేక్ ఎలా సాగింది?
*కథ
రామ్ (శర్వానంద్) ఓ ట్రావెల్ ఫొటోగ్రాఫర్. ఫొటోగ్రఫీ నేర్పిస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు తన పుట్టిన ఊరు విశాఖపట్నం వెళ్లాడు. తాను చదివిన స్కూల్ కనిపించగానే బాల్యస్మృతులు మొదలైపోతాయి. ఒక్కసారి తన చిననాటి స్నేహితులందరినీ చూడాలనిపిస్తుంది. అందరూ మళ్లీ టచ్‌లోకి వస్తారు. రెండు నెలల తరవాత హైదరాబాద్‌లో కలుద్దామని ఫిక్సవుతారు. రీ యూనియన్‌లా మారి, ఓ పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీకి జాను (సమంత) కూడా వస్తుంది. జానుని చూడగానే - తన స్కూలు రోజుల నాటి ప్రేమ కథ గుర్తొస్తుంది రామ్‌కి. అసలు స్కూలు రోజుల్లో జానూ, రామ్ మధ్య ఏం జరిగింది? వాళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఈ రీ యూనియన్ వాళ్ల జీవితాలకు ఇచ్చిన కానుక ఎలాంటిది? అనేదే `జాను` కథ.
*విశ్లేషణ
రీమేక్ చేస్తున్నప్పుడు రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. కథని మార్చాలా? లేదంటే, ఉన్నది ఉన్నట్టుగా తీయాలా? అని. అయితే... ఈసారి మాత్రం కథని మార్చే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. 96లో ఏముందో... జానూలోనూ అదే ఉంది. కొన్ని సన్నివేశాలు కట్, కాపీ, పేస్ట్ లా కనిపిస్తాయి. మార్పులు, చేర్పులకు దర్శకుడు ఏమాత్రం ధైర్యం చేయలేదు. నిర్మాత కూడా చేయనివ్వలేదేమో..? అయితే 96ని చూసివాళ్లు, ఆ ఫీలింగ్స్‌ని పక్కన పెట్టి చూస్తే గనుక... జానూ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారిగా బాల్యపు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి, అప్పటి మన ప్రేమకథనో, స్నేహితుల ప్రేమకథనో, అప్పుడు మనం చూసొచ్చిన జీవితాలనో తెరపైకి తీసుకొస్తుంది. రామ్ తన హైస్కూల్ దగ్గరకు వచ్చి, పాత జ్ఞాపకాలన్ని నెమరేసుకోవడంతో - ఈ కథ అనుభూతుల మయంగా మారడం మొదలెడుతుంది.
పాత స్నేహితులు కలవడం, వాళ్ల మధ్య చిలిపి అల్లర్లు వీటితో హాయిగా సాగుతుంది. జానూ ఎప్పుడైతే వస్తుందో.. అప్పటి నుంచీ కథలో ఓ అర్థ్రత కలుస్తుంది. స్కూల్ డేస్ రోజులు తప్పకుండా మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. చిన్నప్పుడు ప్రేమించుకుని, విడిపోయిన జంట ఇప్పుడు కొత్తగా కలిస్తే, వాళ్ల మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది? వాళ్లేం మాట్లాడుకుంటారు? వాళ్లిద్దరూ ఓ రాత్రి ప్రయాణం చేయగలిగితే... అది ఎలా ఉంటుంది? అనేది దర్శకుడు చాలా స్వచ్ఛంగా, నిజాయతీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా చూస్తున్నంత సేపూ జానూ, రామ్ ఎందుకు కలుసుకోలేకపోయారో.. అనే బాధ వెంటాడుతుంటుంది. ఇప్పుడైనా కలిసి బతికే ఛాన్సుంటే బాగుంటుందనిపిస్తుంటుంది. ఇదంతా తెరపై దర్శకుడు చేసే మ్యాజిక్. పాటలు ఎప్పుడొచ్చాయో, ఎప్పుడెళ్లాయో కూడా తెలీకుండా కథతో పాటు సమాంతరంగా ప్రయాణం చేస్తాయి.
సినిమాలో ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటే, అది స్లో నేరేషన్ మాత్రమే. ఈ కథని ఇలానే చెప్పాలని దర్శకుడు ఫిక్సయి ఉంటాడు. అందుకే ప్రతీదీ చాలా డిటైల్డ్‌గా చూపించడం మొదలెట్టాడు. అందుకే ప్రతీ సన్నివేశం మెల్లమెల్లగా హృదయాల్ని ఎక్కేస్తుంటుంది. 96 కూడా చూసి, జానూ చూస్తే.. పోలికలు మొదలైపోతాయి. అక్కడ విజయ్ ఇలా చేశాడు కదా? ఇక్కడ త్రిష ఉంటే బాగుండును.. అనిపించేస్తుంటుంది. అందుకే ముందే 96 జ్ఞాపకాల్ని పక్కన పెట్టి చూడాలన్న నియమం పెట్టుకోవాల్సిందే. అయితే ఇలాంటి మూమెంట్స్ ఇది వరకు కొన్ని తమిళ, మలయాళ సినిమాల్లో చూసుంటే... ఆ ఫీలింగ్స్ కూడా ఫ్రెష్షుగా అనిపించకపోవొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా బోరింగ్‌గానూ ఉండొచ్చు. కానీ లవ్ స్టోరీలూ, ఫీల్ గుడ్ కథలూ ఇష్టపడేవాళ్లకు మాత్రం జానూ మంచి ఛాయిస్.
* నటీనటులు
రామ్ పాత్రలో శర్వా ఒదిగిపోయాడు. ఓ ఫొటోగ్రాఫర్‌గా సీనియారిటీ, ఓ ప్రేమికుడిగా సిన్సియారిటీ రెండూ చూపించాడు. విజయ్ సేతుపతితో పోల్చుకోకూడదు గానీ, తన వరకూ చాలా బాగా చేశాడు. మరీ ముఖ్యంగా ఎమెషనల్ సీన్స్‌లో తన ప్రతిభ పూర్తిగా బయటపెట్టాడు. ఇక సమంత నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది? తను అనుభవాన్ని రంగరించింది. కన్నీరు పెట్టించింది. నవ్వించింది. ఓ భావోద్వేగ ప్రయాణం చేయించింది. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, రఘుబాబు ఓకే అనిపిస్తారు. చిన్నప్పటి సమంత, చిన్నప్పటి శర్వాగా కనిపించిన ఇద్దరూ ఆకట్టుకుంటారు.
*సాంకేతికత
96 తీసిన దర్శకుడికే ఈ రీమేక్ బాధ్యతలు అప్పగించారు. దాంతో... మరోసారి చేసిన పనినే చేశాడు దర్శకుడు. కాకపోతే ఈసారీ మనసు పెట్టాడు. కొన్ని మాటలు ఆకట్టుకుంటాయి. పాటలు బాగున్నాయి. కథతో భాగంగా చూస్తే నచ్చుతాయి. ఫొటోగ్రఫీ నీట్‌గా ఉంది. మరీ ముఖ్యంగా తొలి పాటలో. తక్కువ బడ్జెట్‌లో పూర్తయ్యే సినిమా ఇది. కాబట్టి దిల్ రాజు కూడా ధైర్యం చేసి ఉంటాడు.
*ప్లస్ పాయింట్స్
ఎమోషన్స్
సమంత - శర్వానంద్
సంగీతం
*మైనస్ పాయింట్స్
నిడివి
స్లో నేరేషన్
*ఫైనల్ వర్డిక్ట్: ఓ ప్రేమ జ్ఞాపకం