తారాగణం: సాయి ధరం తేజ్, మెహ్రీన్, ప్రసన్న తదితరులు..
నిర్మాణ సంస్థ: అరుణాచల క్రియేషన్స్
సమర్పణ: దిల్ రాజు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: KV గుహన్
ఎడిటర్: SR శేఖర్
నిర్మాత: కృష్ణ
రచన-దర్శకత్వం: BVS రవి
యావరేజ్ యూజర్ రేటింగ్: 3/5
రైటర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న BVS రవి, డైరెక్టర్ గా మాత్రం తన మొదటి ప్రయత్నం (వాంటెడ్) లో తడబడ్డాడు. అయితే సుమారు 6 ఏళ్ళ విరామం తరువాత మళ్ళీ జవాన్ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నాడు. మరి సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ఇచ్చిన ఈ అవకాశాన్ని రైటర్-డైరెక్టర్ ఎంతవరకు ఉపయోగించుకున్నాడు అనేది ఈ క్రింద జవాన్ సమీక్షలో చూద్దాం..
కథ...
జై (సాయి ధరం తేజ్) & కేశవ్ (ప్రసన్న) ఇద్దరు చిన్నప్పుడుకలిసి చదువుకుంటారు. ఇక చిన్నపట్టినుండే హింస వైపు ఆకర్షితుడు అవుతూ చెడు పనులకు అలవాటు పడి పెద్దయ్యే సరికి డబ్బు కోసం తీవ్రవాదులతో సైతం చేతులు కలుపుతాడు. అయితే జై మాత్రం జీవితంలో క్రమశిక్షణతో ఎప్పటికైనా DRDO శాస్త్రవేత్త అవ్వాలన్న లక్ష్యంతో పెరిగి పెద్దవుతాడు.
ఇక చిన్నతనంలోనే విడిపోయిన వీరు మళ్ళీ అనుకోకుండా ఒకే లక్ష్యం కోసం తారసపడతారు. అదే- భారతదేశ మిలిటరీ కోసం DRDOలో తయారు చేసిన ఆక్టోపస్ మిస్సైల్. మిలటరీకి చేరకుండా ఆ మిస్సైల్ ని ఎలాగైనా దొంగిలించి తీవ్రవాదులకి వందల కోట్ల డబ్బు కోసం అమ్మేయాలన్న కేశవ్ ప్రయత్నాలకి అడ్డుతగులుతూ ఉంటాడు జై. మరి చివరికి కేశవ్ ప్రయత్నాలని జై ఎలా అడ్డుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ..
నటీనటుల ప్రతిభ:
సాయి ధరం తేజ్: ప్రతి సినిమాకి తనలోని నటనకి పదునుపెడుతూ ఒక మంచి నటుడి అయ్యే మార్గంలో ఉన్నాడు. జై పాత్రకి తన శక్తి మేర న్యాయం చేశాడు. ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో అభినయం బాగా పలికించాడు.
ప్రసన్న: ప్రతినాయకుడి పాత్రలో ఈ తమిళ నటుడు చాలా బాగా ఒదిగిపోయాడు అని చెప్పొచ్చు. హీరోకి సామానంగా సినిమా మొత్తం సాగే పాత్రకి న్యాయం చేశాడు.
మెహ్రీన్: ఈ సినిమాకి మంచి గ్లామర్ తెచ్చింది. ఒక కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన గ్లామర్ ని ఈ చిత్రం వరకు మెహ్రీన్ అందించింది. ఇక బుగ్గంచున పాటలో అయితే ప్రేక్షకులని కట్టిపడేసింది అనే చెప్పాలి.
సుబ్బరాజు, కోట శ్రీనివాస రావు, సత్యం రాజేష్, నాగబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ:
ఇద్దరు సమాన తెలివిగల వ్యక్తులు ఒకే లక్ష్యం కోసం ఒకరు మంచిగా మరొకరు చెడుగా ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ చిత్ర కథనం. హీరో-విలన్ మధ్య వచ్చే టామ్ & జెర్రీ ఫైట్ పోలిన సన్నివేశాలు ఈ సినేమాకి ఊపిరి లాంటివి. అలాంటి సన్నివేశాలని చాలా జాగ్రత్తగా రాసుకుని అదేవిధంగా తెరకెక్కించడంలో అటు రైటర్ గా ఇటు దర్శకుడిగా విజయవంతం అయ్యాడు రవి.
సెకండ్ హాఫ్ లో కుటుంబసభ్యులందరిని దేశంతో పోల్చి చెప్పే సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. అయితే ఈ సన్నివేశం ఇంత బాగా రావడానికి కారణం అక్కడ హీరో చెప్పిన డైలాగ్స్. దర్శకుడు స్వతాహగా రైటర్ అవ్వడంతో జవాన్ లో సంభాషణలు బాగా కుదిరాయి.
దేశానికి మన అవసరం పడినప్పుడు... నాది నేను అనే పదాలని పక్కనపెట్టి దూకేయ్యాలి..
యుద్ధం మొదలయ్యాక.. పక్కోడు పోయాడు..వెనకోడు ఆగిపోయాడు... ముందోడు కూలిపోయాడు కాదు రా..యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం..
ఇక సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అవ్వడం కూడా జరిగింది. అయితే తెలివిగా అటువంటి సన్నివేశాలని పొడిగించకుండా జాగ్రత్తపడడంతో ప్రేక్షకులకి అవి పెద్దగా రిజిస్టర్ అవ్వకపోవచ్చు.
హీరోని బాగా ఎలివేట్ చేస్తూ రాసిన సీన్స్ ని అంతే బాగా తెరపైన కూడా చూపించాడు. దీనితో BVS రవికి మంచి కమర్షియల్ దర్శకుడు అన్న పేరు కూడా ఈ చిత్రంతో రావచ్చు.
జవాన్ అంటే సరిహద్దులో మనల్ని కాపాడేవాడే కాదు.. దేశం కోసం సొంత కుటుంబానైనా పణంగా పెట్టగలిగిన సామాన్యుడు కూడా ఒక జవాన్ తో సమానం అని ఈ చిత్రం ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు.
సాంకేతిక వర్గం:
KV గుహన్ ఛాయాగ్రహణం సూపర్బ్ అని చెప్పొచ్చు. ముఖ్య సన్నివేశాలు, పాటల్లో ఆయన ప్రతిభయిట్టె కనపడిపోతుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ కి వంక పెట్టే పనిలేదు. ఈ సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్స్ లో తమన్ ఒకడు.
ప్లస్ పాయింట్స్:
+ సాయి ధరం తేజ్
+ కథ
+ తమన్
+ మెహ్రీన్
మైనస్ పాయింట్స్:
- కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం
- క్లైమాక్స్
ఆఖరి మాట:
ఈ ‘జవాన్’ ని ఒకసారి కలవొచ్చు... అదే అదే చూడొచ్చు..
రివ్యూ బై సందీప్