నటీనటులు: రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ తదితరులు
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాతలు: సి కళ్యాణ్
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్: దాశరథి శివేంద్ర
విడుదల తేదీ: జూన్ 28, 2019
రేటింగ్: 2.5/5
చాలా రోజుల తర్వాత `గరుడవేగ`తో అందిన విజయాన్ని నిలబెట్టుకోవాలన్న తపన రాజశేఖర్‌ది. అందుకే ఆ చిత్రం విడుదలైన చాలా రోజుల తర్వాత కానీ కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. కథల విషయంలో ఆయన ఆచితూచి అడుగేస్తున్నారని స్పష్టమైంది. నవతరం దర్శకులవైపే మొగ్గు చూపుతూ `కల్కి` కోసం ప్రశాంత్ వర్మని ఎంచుకున్నారు.
`అ!`తో కొత్త ఆలోచనలున్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌వర్మతో రాజశేఖర్ సినిమా అనగానే పరిశ్రమ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ప్రచార చిత్రాలతో మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి `కల్కి`తో రాజశేఖర్ విజయాన్ని నిలబెట్టుకున్నట్టేనా? ప్రశాంత్ వర్మ రెండో ప్రయత్నం ఎలా ఉంది? తదితర విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
* కథ
కొల్లాపూర్ సంస్థానాన్ని చేజిక్కించుకున్న నర్సప్ప (అశుతోష్ రాణా) ఆ తర్వాత పెరుమాండ్లు (శత్రు)తో కలిసి ఎన్నో అరాచకాలకి పాల్పడుతుంటాడు. మధ్యలో ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. మరోపక్క నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు (సిద్ధు జొన్నలగడ్డ) ఊరి జనాలకి చేదోడువాదోడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇంతలో పట్నం నుంచి వచ్చిన శేఖర్‌బాబు హత్యకి గురవుతాడు.
తమ్ముడికి మంచి పేరు రావడంతో తట్టుకోలేని నర్సప్పే ఆ హత్య చేయించాడని కొంతమంది, ఊళ్లో దెయ్యం చంపిందని కొంతమంది, పెరుమాండ్లు చంపాడని మరికొంతమంది మాట్లాడుకుంటుంటాడు. ఆ హత్య కేసుని పరిశోధించడానికే ఐపీఎస్ అధికారి కల్కి (రాజశేఖర్) ఊళ్లోకి అడుగుపెడతాడు. మరి ఆ క్రమంలో కల్కికి ఎలాంటి విషయాలు తెలిశాయి? పాత్రికేయుడు దేవదత్తా (రాహుల్ రామకృష్ణ ) కేసు పరిశోధనలో ఎలా సాయం చేశాడు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
* నటీనటులు
రాజశేఖర్ తనకి అలవాటైన పాత్రలోనే కనిపించాడు. కానీ ఇదివరకటిలా ఆయన నటనలో ఛార్మ్ లేదు. ఆద్యంతం బలహీనంగా కనిపించారు. ఆయనతో పెద్దగా సంభాషణలు కూడా చెప్పించలేదు దర్శకుడు. యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకుంటారు. రాహుల్ రామకృష్ణ దేవదత్తా అనే పాత్రికేయుడి పాత్రలో కనిపిస్తాడు. పిరికివాడిగా అతని అభినయం, తెలంగాణ యాస నవ్విస్తుంది.
కథని నడిపి కీలకమైన ఆ పాత్రలో ఆద్యంతం కనిపిస్తాడు రాహుల్ రామకృష్ణ. అశుతోష్ రాణా, శత్రు ప్రతినాయకులుగా కనిపిస్తారు. సిద్ధు పాత్ర బాగుంది. కథానాయికలు ఆదాశర్మ, నందితశ్వేత పాత్రలు చిన్నవే. కానీ నందిత శ్వేత కీలకమైన పాత్రతో ఆకట్టుకుంది. పూజిత పొన్నాడ, నాజర్, చరణ్‌దీప్‌తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.
* సాంకేతిక వర్గం
సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు పడతాయి. దాశరథి శివేంద్ర కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఆర్ట్ విభాగం 80లనాటి వాతావరణాన్ని సృష్టించిన విధానం బాగుంది. నేపథ్య సంగీతం బాగుంది. ప్రశాంత్ వర్మ టేకింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప‌్రేక్షకుల్ని థ్రిల్ చేయాలనుకోవడంలో తప్పు లేదు కానీ.. గందరగోళానికి గురిచేయకూడదు.
ఊహించని మలుపులతో కథ చెప్పే క్రమంలో ప్రేక్షకుల్ని గందరగోళానికి గురిచేస్తున్నారు. మలుపులు, లెక్కలేనన్ని పాత్రలు, మంచి నేపథ్యం... ఇలా అన్నీ కుదిరినా ఇంకా ఏదో లోటు అనిపించిన చిత్రం `కల్కి`. అక్కడక్కడా కాస్త ఆసక్తిని పెంచుతుంది కానీ... ప్రేక్షకుల్ని పూర్తిగా థ్రిల్‌కి గురిచేయలేకపోయిన చిత్రమిది.
* విశ్లేషణ
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రమిది. కానీ ఈ కథ సాగే నేపథ్యమే కొత్తగా ఉంటుంది. ఒక హత్య, దానివెనక కారణాల చుట్టూ సాగే చిత్రాలు తరచుగా వస్తుంటాయి. గత వారం విడుదలైన ఓ సినిమా కూడా ఇలాంటి కథతో తెరకెక్కిందే. కాకపోతే అందులో ఇన్వెస్టిగేషన్ ఓ డిటెక్టివ్ చేస్తాడు, ఇందులో ఓ పోలీసు చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ అనేది ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా సాగాలి. ఏ దశలోనూ, ఏ చిన్న మలుపు కూడా ప్రేక్షకుడి ఊహకు అందకూడదు.
మరోపక్క కథ పరుగులు పెడుతూ ఉండాలి. అప్పుడే ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తాయి. ప్రశాంత్ వర్మ, ఆయన బృందం కూడా అదే ప్లాన్ చేసింది. కానీ కథ మరీ పలచగా ఉండటం, కథనంలో మేజిక్ లేకపోవడంతో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయిందీ చిత్రం. తొలి సగభాగం సన్నివేశాలు చాలా సాదాసీదాగా సాగుతాయి. కథలోకి బోలెడన్ని పాత్రల్ని తీసుకొచ్చి ఈ హత్య వీళ్లు చేసుంటారా లేక వాళ్లు చేసుంటారా అనే అనుమానాల్ని ప్రేక్షకుల్లో రేకెత్తిస్తూ సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు దర్శకుడు.
కథ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. మధ్యలో ఓ పాతకాలంనాటి ప్రేమకథ. అలా ప్రథమార్థం ఏ దశలోనూ మెప్పించలేదు. విరామం సమయానికి కాస్త కథలో వేగం మొదలవుతుంది. ఒకొక్క ముడిని విప్పుకుంటూ వెళతారు. కానీ ఆ మలుపులు చాలా వరకు ప్రేక్షకుడి ఊహకు అందేలా ఉంటాయి. హత్య ఎలా జరిగిందన్న విషయం చివర్లో బయటపెట్టారు. ఆ పది నిమిషాలే సినిమాకి కీలకం. వాటిని నమ్ముకొనే ఈ సినిమాని తీశారా అనిపిస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు.
* ప్లస్ పాయింట్స్
+క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
- మిగిలినది
- రివ్యూ రాసింది శ్రీ.