నటీనటులు: వసంత్ సమీర్, సహెర్ అఫ్షా, రవి వర్మ, ‘జబర్దస్త్’ రాంప్రసాద్, రఘుబాబు, కాదంబరి కిరణ్, కాశీ విశ్వనాథ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
కూర్పు: ప్రవీణ్ పూడి
నిర్మాత: చదలవాడ పద్మావతి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగు గవర
రేటింగ్: 2/5
స్టార్ హీరోలతో సినిమా అంటే ఇంకేం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల పోస్టర్లని చూసి బిజినెస్ జరిగిపోతోంది. ఫ్యాన్స్ వల్ల ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. సినిమాలో విషయం ఉంటే ఆడుతుంది, లేదంటే లేదు. చిన్న సినిమా అలా కాదు. తన బలం.. బలగం మొత్తం కథే. కథని నమ్ముకునే ప్రయాణం చేయాలి.
గడిచిన దశాబ్దకాలంలో బాగా ఆడిన సినిమాలన్నీ కథా బలం ఉన్న చిత్రాలే. స్టార్ల అండ లేనప్పుడు.. ఆ కథ మరింత శక్తిమంతంగా తయారు చేసుకోవాలి. `చిన్న సినిమా కదా.. చూసేద్దాం..` అనే సింపతీ చిన్న సినిమాకి ఉండదు. తప్పులున్నా క్షమిద్దాం అనే పెద్ద మనసు చేసుకోరు. అందుకే చిన్న సినిమా తీసి ఒప్పించడం కత్తిమీద సాము. `కర్త కర్మ క్రియ` కూడా చిన్న సినిమానే. అందులోనూ స్టార్స్ లేరు. మరి బలంగా ఉండాల్సిన కథ ఎలా ఉంది..? అదైనా ఈ సినిమాని గట్టెక్కించిందా?
* కథ
సెల్ ఫోన్ సిద్దూ (వసంత్ సమీర్) ఓ సగటు మధ్యతరగతి కుర్రాడు. ఆదాయం తక్కువ.. ఆశలు ఎక్కువ. మైత్రీ (సహెర్ అప్షా)ని చూసి ఇష్టపడతాడు. మైత్రీ అక్క ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు ఆమెది ఆత్మహత్య కాదని, దాని వెనుక ఏదో ఓ బలమైన కారణం ఉందని, దాన్ని తెలుసుకోవాలని తాపత్రయపడుతుంటుంది మైత్రీ. ఈ విషయంలో సిద్దూ సహాయం తీసుకోవాలనుకుంటుంది.
అయితే.. ఈ ఆత్మహత్యతో పాటు మరో రెండు ఆత్మహత్యలు పోలీసులకు చిక్కుముడిగా మారతాయి. ఈ మూడు ఆత్మహత్యల వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది. మరి.. అతనెవరు? అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునేలా ఏం చేశాడు? ఈ మిస్టరీ ఎలా వీడింది? అనేదే కథ.
* నటీనటులు
వసంత్ సమీర్ పొడుగ్గా.. మాసీగా ఉన్నాడు. లుక్స్ కూడా బాగున్నాయి. కానీ ద్వితీయార్థంలో ఈ పాత్ర పూర్తిగా పాసీవ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కథానాయిక అక్కడక్కడ చూడ్డానికి బాగుంది. అంతకు మించి ఎక్కువ ఆశించలేం. రవి వర్మ దాదాపుగా హీరో స్థాయి పాత్ర పోషించాడు. తన పాత్రకు హీరో కంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చారు. మిగిలినవాళ్లలో చెప్పుకోదగిన పాత్రేదీ కనిపించదు.
* విశ్లేషణ
ఇప్పటి వరకూ మనం మర్డర్ మిస్టరీలు చూశాం. ఇది ఆత్మహత్యల మిస్టరీ. హైదరాబాద్ నగరంలో జరిగిన మూడు ఆత్మహత్యలకు ఉన్న కామన్ పాయింట్‌పై పోలీసులు విచారణ చేస్తుంటారు. అదెలా సాగింది? ఆ ఆత్మహత్యల వెనుక కర్త కర్మ క్రియ ఎవరు? అన్నది కథాంశం. చెప్పుకోవడానికి పాయింట్ కాస్త ఆసక్తికరంగానే ఉంది. అయితే రెండు గంటల సినిమాకు ఇంత చిన్న పాయింట్ సరిపోదు. అందుకే హీరో ఫ్రెండ్ ఎపిసోడ్లు, లవ్ ట్రాకులు, పాటలు వేసి నడపాలి. కర్త కర్మ క్రియలో ఈ మిక్సింగ్ సరిగా కుదరలేదు.
అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు గంటకు పైగా సమయం తీసుకున్నాడంటే... పరిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. ఈ గంట కాలక్షేపం కోసం తీసిన సన్నివేశాలైనా బాగున్నాయా, ఎంటర్‌టైన్ చేశాయా? ఎంగేజ్ చేశాయా? అంటే అదీ లేదు. హీరో ఇంట్రక్షన్ పాట, తొలి చూపులోనే హీరోయిన్‌ని ప్రేమించేయడం, ఆ తరవాత మరో పాట, ఓ ఫైటు.. మధ్యలో కమెడియన్‌తో ఒకట్రెండు సీన్లు.. ఇలా అక్కడక్కడే తిప్పడంతో థ్రిల్లర్ మూడ్ ఎక్కడా కనిపించదు.
థ్రిల్లర్ లక్షణం.. తొలి సన్నివేశం నుంచే కథ చెప్పడం. ఆ సూత్రాన్ని దర్శకుడు అస్సలు పట్టించుకోలేదు. తెర వెనుక ఏదో జరుగుతోంది అనే హింట్ ఇచ్చినా, అందుకు సంబంధించిన మాంటేజ్ షాట్లు ఏమాత్రం ఆసక్తిని కలిగించవు. ద్వితీయార్థంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అదీ తూతూ మంత్రంగానే, చప్పగా సాగాయి. ఈ ఆత్మహత్యలకు కారణం బూతు వీడియోలు అన్న సంగతి ఎప్పుడో తెలిసిపోతుంది. చివరికి కూడా అదే తేల్చారు.
అలాంటప్పుడు ఇక థ్రిల్లింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది?? ఆడ పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేయడాలు, ఈజీ మనీ కోసం ప్రాకులాడడాలూ అనే సందేశం ఈ కథలో ఇమిడ్చారని దర్శక నిర్మాతలు సంతోషపడిపోవొచ్చు. కానీ.. ఆ విషయాన్ని ఎంత బలంగా చెప్పారు? అనేదీ ఆలోచించుకోవాలి. ఏ సన్నివేశం హృదయాన్ని తాకదు. తరవాత ఏం జరుగుతుందా? అనే ఆసక్తి కలిగించదు. అలాంటప్పుడు థ్రిల్లర్ సినిమాలు చేసి లాభమేంటి?
* సాంకేతిక వర్గం
చిన్న సినిమా, పరిమిత బడ్జెట్‌లో చేసినా.. క్వాలిటీ బాగుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికి బాగున్నాయి. దర్శకుడిగా నాగు గవర చేసిన రెండో సినిమా ఇది. తొలి సినిమా `వీకెండ్ లవ్` సంతృప్తిని ఇవ్వలేదు. దాదాపు నాలుగేళ్ల విరామం తరవాత ఈ సినిమా చేశాడు. ఈసారైనా బలమైన కథా, కథనాలతో రావాల్సింది.
* ప్లస్ పాయింట్స్
+ పతాక సన్నివేశాలు
* మైనస్ పాయింట్స్
- మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: తేలిపోయిన మిస్టరీ.
రివ్యూ రాసింది శ్రీ.