'సర్కార్' సినిమాకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. మెజార్టీ రివ్యూలు సినిమాని ఫ్లాప్‌గా తేల్చాయి. కొన్ని రివ్యూలు సినిమా ఫర్వాలేదంటున్నాయి. చాలా కొద్ది రివ్యూలు మాత్రమే, బాగానే వుందని చెప్పాయి. అయినాగానీ, 'సర్కార్' వసూళ్ళ జాతరకు ఇబ్బంది ఏమీ లేదంటున్నారు 'దళపతి' విజయ్ అభిమానులు. విజయ్ సినిమాలకు రివ్యూలు, టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ళు వచ్చేస్తుంటాయి. అదే అతని ప్రత్యేకత.
'అదిరింది' సినిమాకి నెగెటివ్ రివ్యూస్ వస్తే, ఆ సినిమా వసూళ్ళ ప్రభంజనం సృష్టించేసింది. ఇప్పుడు 'సర్కార్' విషయంలోనూ అదే జరుగుతుందా.? అంటే, అవుననే అంటున్నారు విజయ్ అభిమానులు. ఈ 'సర్కార్' రెండు రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టేసిందన్నది 'సర్కార్' టీమ్ చేస్తోన్న ప్రచారం. సర్కార్ 100 కోట్లు.. అంటూ సోషల్ మీడియా పోటెత్తిపోతోంది.
'దీపావళి' కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సర్కార్' తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో సాగిన సినిమా. ఓటు హక్కు గురించి ఈ సినిమాలో దర్శకుడు మరుగదాస్ చేసిన ప్రస్తావన, పోరాటం.. కొంతమందిని ఆలోచింపజేసిన మాట వాస్తవం. అయితే, ఫస్టాఫ్ బాగానే వున్నా సెకెండాఫ్ డల్‌గా సాగడం 'సర్కార్'కి పెద్ద మైనస్. రివ్యూలు, టాక్‌తో సంబంధం లేకుండా 'సర్కార్' 100 కోట్లను రెండు రోజుల్లోనే దాటేయడంతో, ఈ వీకెండ్‌లో సినిమా వసూళ్ళ ప్రభంజనం కొనసాగడం ఖాయమన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఈ రోజు వర్కింగ్ డే అయినా, రేపట్నుంచి మళ్ళీ వీకెండ్ షురూ అయిపోతుంది. సో, 'సర్కార్' టాక్‌కి భిన్నంగా, వసూళ్ళ జాతర సృష్టించొచ్చేమో!