తారాగణం: నయనతార, రామచంద్రన్ దురైరాజ్, సును లక్ష్మి, కిట్టి, వేల రామమూర్తి తదితరులు
విడుదల చేసింది: నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: గిబ్రన్
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్
ఎడిటర్: రూబెన్
రచన-దర్శకత్వం: గోపి నయనార్
రేటింగ్: 3/5
తమిళ దర్శకుల్ని మెచ్చుకుని తీరాలి. వాళ్లూ మాస్ మసాలా సినిమాల్ని తీస్తారు. కానీ అప్పుడప్పుడూ జీవితాల్లోంచి కూడా కథల్ని ఒడిసిపట్టుకుంటారు. పేపర్లో చూసి, చదివి, చలించి, కాసేపటికి మర్చిపోయే సంగతుల్ని సైతం - సినిమాగా మలచి శహభాష్ అనిపించుకుంటారు. కర్తవ్యం కూడా అలాంటి కథే. ఈ సినిమాకి ఎన్ని డబ్బులొస్తాయి, ఎన్ని అవార్దులొస్తాయి, లేదంటే... ఎంతమందికి నచ్చుతుంది? అనే ప్రశ్న వేసుకునే ముందు... అసలు ఇలాంటి పాయింట్‌తోనూ సినిమా తీయొచ్చు అని నిరూపించిన టెక్నీషియన్లనూ, అందులో నటించిన నటీనటుల్నీ అభినందించడం మన మొట్ట మొదటి 'కర్తవ్యం'.
* కథ..
బుల్లబ్బాయి. సుమతి (సునులక్ష్మి)ల కూతురు.. ధన్సిక. సుమతి కూలి పని చేసుకుంటుంటుంది. పొలంలో ఆడుకుంటున్న ధన్సిక అనుకోకుండా అక్కడి బోరుబావిలో పడిపోతుంది. ఆమెను కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? ఆ జిల్లాకి కలెక్టర్‌గా ఉన్న మధువర్షిణి (నయనతార) తన కర్తవ్యాన్ని ఎలా నిర్వహించింది? ఈ ప్రయత్నానికి అడ్డొచ్చిన రాజకీయ శక్తుల్ని ఎలా ఎదుర్కొంది? అనేదే కథ.
* నటీనటుల ప్రతిభ..
నయనతార తప్ప ఈ పాత్రని మరెవ్వరూ చేయలేరేమో అన్నంత అందంగా తెరపై ఒదిగిపోయిందామె. ఈమధ్య కాలంలో ఓ కథానాయిక చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావొచ్చు. వృత్తిలో సిన్సియారిటీ, మనసులో సున్నితత్వం, తెగువ, ధైర్యం ఉన్న అధికారిణిగా నయనతార చక్కగా నటించింది. పాప కోసం ఆమె పడిన తపన... తనలోని మంచి నటిని మన కళ్లముందుకు తీసుకొస్తుంది.
మిగిలిన వాళ్లంతా కొత్తవాళ్లే. కానీ.. గొప్పగా నటించారు. అనుభవజ్ఞులతో పోటీ పడి తమ పాత్రల్ని పండించారు.
* విశ్లేషణ
బోరు బావిలో పడిన బాలిక.. మృత్యువుతో పోరాటం- ఇలాంటి వార్తలు అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. మొదట్లో అయ్యో అనిపిస్తుంది. ఆ తరవాత ఎవరి వ్యాపకాల్లో వాళ్లు పడిపోయి ఆ సంగతే మర్చిపోతాం. అలాంటి ఓ చిన్న ఘటన పట్టుకుని సినిమా తీశాడు దర్శకుడు. అదే.. కర్తవ్యం. ఫక్తు కమర్షియల్ సూత్రాలు, పడికట్టు ఫార్ములాల్ని ఈ సినిమా కోసం పక్కన పెట్టింది చిత్రబృందం.
పాటలు, సినిమాటిక్ డైలాగులూ,ఫైటింగులూ ఇవేం ఉండవు. కేవలం సంఘర్షణ తప్ప. కొంతమంది బడుగు జీవుల వెతల్ని కళ్లముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు. వాళ్ల సంఘర్షణ కళ్లకు కట్టినట్టు చూపించాడు. బోరు బావిలో బాలిక పడిపోతే.. ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది? ఏ యంత్రాంగం ఎలా పనిచేయాలి? అసలు ఎలా పనిచేస్తుంది? ఆ బాలిక కుటుంబ సభ్యుల మనో వేదన ఎలా ఉంటుంది? ప్రభుత్వ అధికారుల పనితీరు ఏమిటి? ఇలా... అన్ని విషయాల్నీ చాలా లోతుగా ఆవిష్కరించాడు.
నయనతార తప్ప.. నటీనటుల్లో తెలిసిన మొహం ఒక్కటీ కనిపించదు. అదే ఈ సినిమాకి సహజత్వం తీసుకొచ్చింది. బోరు బావిలో పడిన బాలిక బయటకు వస్తుందా, రాదా? అనే ఉత్కంఠతని, బయటకు వస్తే బాగుణ్ణు అనే ఆశనీ, ఆలోచననీ సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలోనూ రగిలించగలిగాడు దర్శకుడు. అక్కడే ఈ సినిమా సక్సెస్ కొట్టేసింది.
ఎక్కడ ప్రేక్షకుల మనసుల్ని మెలిపెట్టాలో.. అక్కడ పెడుతూ.. ఎక్కడ ప్రభుత్వంపై కోపం రావాలో... అక్కడ రప్పిస్తూ.. దర్శకుడు ఈ కథని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. కాకపోతే.. మరీ రియలిస్టిక్ పద్ధతిలో వెళ్లడం, డిటైలింగ్ కోసం కాస్త కాలయాపన చేయడం... ఇబ్బంది పెడతాయి. కాకపోతే ఇలాంటి కథలు ఇలానే ఉండాలి. లేదంటే సమస్యల్లోనూ లోటు పాట్లు అర్థం కావు.
* సాంకేతిక వర్గం..
ఇది దర్శకుడి సినిమా. గోపి నయనార్ ఓ చిన్న కథని పట్టుకొని అందులో భావోద్వేగాల్ని పండిస్తూ, ప్రభుత్వ తీరుని ఎండగడుతూ, మనలోని మానవత్వం మేలుకొలుపుతూ అర్థవంతమైన కథని రాసుకున్నాడు. సినిమా అంతా బోరు బావి చుట్టూ తిరుగుతుంది. అయినా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఆ క్రెడిట్ ఆర్ట్, కెమెరాలకు ఇవ్వాల్సిందే. జిబ్రన్ నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.
* ప్లస్ పాయింట్స్
+ నయనతార నటన
+ కథలో భావోద్వేగాలు
+ సాంకేతిక విభాగం
* మైనస్ పాయింట్స్
- అతి సహజత్వం
* ఫైనల్ వర్డిక్ట్: ఇలాంటి చిత్రాల్ని ఆదరించడం మన తక్షణ 'కర్తవ్యం'.
రివ్యూ రాసింది శ్రీ