చిత్రం: మాక్స్
దర్శకత్వం: విజయ్ కార్తికేయ
కథ - రచన: విజయ్ కార్తికేయ
నటీనటులు: కిచ్చా సుదీప్, సంయుక్త హొర్నాడే, స్రుకృత వాగ్లే, వరలక్ష్మీ శరత్ కుమార్,సునీల్,ఇళవరసు, రెడీన్ కింగ్స్లీ తదితరులు
నిర్మాతలు: కలైపులి ఎస్ థాను, సుదీప్
సంగీతం: బి. అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ: శేఖర్ చంద్ర
ఎడిటర్: ఎస్ ఆర్ గణేష్ బాబు
బ్యానర్: వి. క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్
విడుదల తేదీ: 27 డిసెంబరు 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3/5
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కారణం రాజమౌళి తీసిన 'ఈగ' మూవీలో మెయిన్ లీడ్ చేయటమే. ఈగలో సుదీప్ నటనకి ఫిదా కానీ తెలుగు ప్రేక్షకుడు లేడు. ఈగ మూవీతో తెలుగులో ఫాన్స్ ని సంపాదించుకున్న సుదీప్ తన కన్నడ సినిమాలన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా క్రిస్మస్ సంధర్భంగా 'మాక్స్' అనే మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. తనకి అచ్చొచ్చిన మాస్ ఫార్ములాతో మ్యాక్స్ మూవీ చేసాడు. కన్నడలో 25 న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగులో 27 న రిలీజ్ చేశారు, మాక్స్ మూవీ తెలుగులో హిట్ అయ్యిందో లేదో, సుదీప్ తెలుగువారిని ఆకట్టుకున్నాడో లేదో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీసు ఆఫీసర్ అర్జున్ అలియాస్ మ్యాక్స్ (కిచ్చ సుదీప్). తన నిజాయితీగా కారణంగా సస్పెండ్ అయ్యి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవుతాడు. పోలీస్ ఛార్జ్ తీసుకుని కొత్త ఊరికి వస్తాడు. ట్రైన్ దిగి ఇంటికి వెళ్తుండగా గంజాయి కొట్టిన మైఖేల్, వీర అనే ఇద్దరు పోలీసులని కొట్టి, లేడీ పోలీస్ తో మిస్ బిహేవ్ చేస్తారు. అది చూసి భరించలేని మ్యాక్స్ పోలీస్ గా ఛార్జ్ తీసుకోకుండానే వాళ్ళని జైలులో వేస్తాడు. FIR రాయమని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడున్న పోలీసులంతా వాళ్ళు మంత్రి కొడుకులని, వాళ్ళ వెనక గ్యాంగ్ స్టార్ ఘని(సునీల్) ఉన్నాడని భయపడి ఎదో ఒక కారణంతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. గతంలో అర్జున్ తో పనిచేసిన సీనియర్ హెడ్ కానిస్టేబుల్ రమణ(ఇళవరసు) కూడా భార్యకి హెల్త్ బాగోలేదని స్టేషన్ కి తాళం వేసి వెళ్ళిపోతాడు. తరవాత వచ్చి చూసేసరికి ఆ ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయి ఉంటారు. దీంతో పోలీసులు భయం రెట్టింపు అవుతుంది. వాళ్ళని అరెస్ట్ చేయటమే పెద్ద తప్పు అనుకుంటే, ఇప్పడు వారు చనిపోవటం ఇంకా తమకి కష్టాలు తెచ్చిపెట్టింది అని ఆ గ్యాంగ్ స్టార్స్, మంత్రులు పోలీసుల్ని చంపేస్తారని భయపడుతూ అదే విషయం అర్జున్ కి చెప్తారు. ఈ క్రమంలో అర్జున్ స్టేషన్ కి వచ్చి జరిగింది తెలుసుకుని, పోలీసుల్ని కాపాడాలని ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఏమయ్యారో ఎవ్వరికి తెలియకుండా చేయాలని చూస్తాడు. మంత్రుల కొడుకులు అరెస్ట్ అయ్యారని తెలిసి క్రైమ్ పోలీస్ రూప(వరలక్ష్మి శరత్ కుమార్) పోలీస్ స్టేషన్ కి వచ్చి చూసి వెళ్తుంది. లోపల అరెస్ట్ అయిన మంత్రుల కొడుకులు ఉన్నారని గ్యాంగ్ స్టర్స్ దాడి చేయటం, కొందరు స్టేష్టన్ బయటే కాపలా ఉండటం చేస్తారు. ఇందరి కళ్ళు గప్పి అర్జున్ ఆ శవాల్ని ఎలా మాయం చేసాడు? అసలు వారి చావుకు కారణం ఏంటి? ఎవరు? క్రైమ్ ఇన్ స్పెక్టర్ రూపా, గ్యాంగ్ స్టర్ గని పాత్రలు ఏంటి? చివరికి పోలీసులని అర్జున్ కాపాడాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ట్రాన్స్ఫర్ మీద వచ్చిన ఒక పోలీసు ఆఫిసర్, ఛార్జ్ తీసుకోకుండానే ఒక్క రాత్రిలో ఫేస్ చేసిన సంఘటనల నేపథ్యంలో 'మ్యాక్స్' కథ సాగింది. కొంచెం లోకేష్ కనక రాజ్ మూవీ యూనివర్స్ ని తలపించేలా ఉంది. ఖైదీ, విక్రమ్ సినిమా సీన్స్ కొని గుర్తుకు వస్తాయి. ఈ మూవీ మొత్తం పోలీస్ స్టేషన్‌లోనే ఉంటుంది. ఒక పోలీసు స్టేషన్ లో జరిగే డ్రామాతో ఆడియెన్స్‌ను బాగానే ఎంగేజ్ చేయగలిగాడు దర్శకుడు. లాకప్ డెత్ అంశం మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ వేరు ఈ కథ వేరు. ఈ కథలో లాకప్ లో చనిపోయిన వారు అనాథలు, పలుకుబడి లేని వారు కాదు రాష్ట్ర రాజకీయాలను శాసించే మంత్రుల పిల్లలు. అది కూడా అరెస్టైన ఒక్క రాత్రిలోనే మరణించటం మాములో విషయం కాదు. అరెస్ట్ చేయటానికే బయపడి పారిపోయిన పోలీసులు, వారి మరణ వార్తతో ఇంకెన్ని ఫేస్ చెయ్యాలో అని భయపడటం సహజం. ఇంత చిన్న లైన్ తో ఆసక్తిగా కథ నడిపించాడు దర్శకుడు.
కేవలం పోలీసు స్టేషన్ లో జరిగే డ్రామాగా వదిలేయకుండా మాస్ ఆడియన్స్ మెచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ సూపర్ గా ఉన్నాయి. ఆడియన్స్ ఆశించే థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ప్రేక్షకుడి ఊహకి అందని ట్విస్టులు ఉంటాయి. వీటన్నితో పాటు ఒక మెసెజ్ కూడా పాస్ చేశాడు దర్శకుడు. హీరో ఎంట్రీసీన్ తో స్టార్టింగ్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. తరువాత కొంచెం సేపు బోర్ కొట్టించినా ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. దీనితో సెకండాఫ్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా బయటపడతారా అని హీరోతో పాటు ప్రేక్షుకుడు కూడా ఆలోచిస్తాడు. నిజం బయట పడకూడదని, బయటపడితే పరిస్థితి ఏంటి అని సినిమా చూసే ప్రేక్షకుడు కూడా కంగారు పడేంతగా కథలో లీనం అయిపోతాము. ఇదంతా దర్శకుడి క్రెడిట్ అని చెప్పాలి. క్లైమాక్స్ ఫైట్ హై రేంజ్‌లో ఉంది. కానీ మ్యాక్స్ టైటిల్ ఎందుకు పెట్టారో, హీరోకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పకపోవటం మైనస్.
నటీ నటులు:
సుదీప్ నటనని ఎంచటానికి లేదు. చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్ కథతో వచ్చాడు సుదీప్. ఫాన్స్ కి మంచి మాస్ మసాలా మీల్స్ పెట్టాడు. సిన్సియర్ డైనమిక్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఖాకీ డ్రెస్ లో చాలా హుందాగా ఉన్నాడు. కటౌట్ కి తగ్గట్టు డ్రెస్ కుదిరింది. తనకి అచ్చోచ్చిన జానర్ అని మరొకసారి నిరూపించాడు. యాక్షన్ హీరోగా సుదీప్ సత్తా చాటాడు. తన హీరోయిజాన్ని హైలెట్ చేసే సీన్స్ లో విశ్వరూపం చూపించాడు. ఫాన్స్ తో పాటు సినీప్రియుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్. వరలక్ష్మీ శరత్ కుమార్ తన నటనతో ఆడియెన్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తన పాత్రకి హండ్రడ్ పర్శంట్ న్యాయం చేసింది. గ్యాంగ్ స్టార్ పాత్రలో సునీల్ ని చూస్తే కొత్తదనం లేదు. పైగా ఇంకెవరైనా అయితే బాగుణ్ణు అనిపిస్తుంది. సునీల్ పాత్ర రెగ్యులర్ ఉంది బోర్ కొట్టిస్తుంది. ఇళవరసుకి మంచి పాత్ర పడింది. మిగిలిన పాత్రలు కూడా తన పరిధిమేరకు నటించారు. ప్రతి ఒక్కరికి సినిమాలో స్కోప్ ఉంది.
టెక్నికల్ :
ఖాకీ కథలు సిల్వర్ స్క్రీన్‌పై అదరగొట్టడం ఖాయం అని మరొకసారి నిరూపించాడు దర్శకుడు విజయ కార్తికేయ. మాస్ యాక్షన్ అంశాలతో హీరోయిజాన్నీ పండించాడు. ఇప్పటికే హీరో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇపుడు ఈ లిస్ట్ లో సుదీప్ మాక్స్ కూడా చేరింది. పోలీస్ పాత్రలో హీరోకి ఉన్న అడ్వాంటేజెస్ అన్ని ఉపయోగించుకున్నాడు దర్శకుడు. ఎవడ్నీ లెక్కచేయని తనం, పర్ఫెక్ట్ హీరో ఎలివేషన్స్, మాస్ యాక్షన్, రఫ్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆటిట్యూడ్‌తో హీరో పాత్ర డిఫరెంట్‌గా డిజైన్ చేసాడు దర్శకుడు. మిగతా టెక్నికల్ టీం కష్టం స్క్రీన్ పై కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఒక్క రాత్రిలో జరిగిన స్టోరీ కావటం, ఒకే లోకేషన్, ఈ రెండిటిని బాగా హ్యాండిల్ చేసారు. బోర్ కొట్టించుకుండా కెమెరా వర్క్ తో మెప్పించగలిగారు. అజనీష్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది. కాకపోతే కొంచెం బాదుడు తగ్గించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ బాగా సెట్ అయ్యింది. మరి కొన్ని చోట్ల మోతాదు మించి ఉంది. మాటలు ఆకట్టుకున్నాయి. పాటలు పెద్దగా గుర్తు పెట్టుకునే విధంగా లేవు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
సుదీప్
దర్శకుడు
కథ కథనం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్
విలన్
పాటలు
ఫైనల్ వర్దిక్ట్ : మాస్ మసాలా మీల్స్ 'మాక్స్'