నటీనటులు: ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, శివకార్తికేయన్ తదితరులు
దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు
నిర్మాణం: కే.ఎ వల్లభ
సంగీతం: దిబు నిన్నాన్ థామస్
సినిమాటోగ్రఫర్: బి ఆండ్య్రూ
విడుదల తేదీ: ఆగస్టు 23, 2019
రేటింగ్: 3/5
సినిమా - క్రికెట్... భారతీయులకు ఇష్టమైన కాలక్షేపాలివి. వీటి గురించి ఎంత సేపు మాట్లాడుకోవడానికైనా సిద్ధమే. కొత్త సినిమా వచ్చిందంటే తొలి రోజు తొలి టికెట్ తెగాల్సిందే. క్రికెట్ మ్యాచ్ జరుగుతోంటే, ఎన్ని పనులున్నా పక్కన పెట్టాల్సిందే. క్రికెట్ నేపథ్యంలో ఓ సినిమా వస్తే - దానిపై ఆసక్తి లేకుండా ఎలా ఉంటుంది..?
కౌసల్య కృష్ణమూర్తి` అలాంటి సినిమానే. కాకపోతే.. ఇది ఓ మహిళా క్రికెటర్‌కి సంబంధించిన కథ. తమిళంలో ఘన విజయం సాధించిన `కణ` అనే చిత్రానికి రీమేక్ ఇది. మరి ఈ రీమేక్ ఎలా సాగింది? క్రికెటర్ కథని వెండి తెరపై ఏ రీతిన ఆవిష్కరించారు..?
* కథ
కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) ఓ సామాన్యమైన రైతు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇండియా ఓడిపోవడం అస్సలు తట్టుకోలేడు. చంటిపిల్లాడిలా ఏడ్చేస్తుంటాడు. అతని బాధ చూసి కూతురు కౌసల్య కూడా చలించిపోతుంది.
ఎప్పటికైనా ఇండియా తరపున క్రికెట్ ఆడి, కప్పు గెలిచి తండ్రిని సంతోషపెట్టాలనుకుంటుంది. మరి ఆ ప్రయత్నంలో కౌసల్య విజయం సాధించిందా, లేదా? ఆ ప్రయాణంలో తనకు ఎదురైన ఆటంకాలేమిటి? అనేదే కథ.
* నటీనటులు
ఐశ్వర్య రాజేష్‌కి ఇదే తొలి చిత్రం. కణలోనూ తనే చేసింది కాబట్టి, ఈ పాత్ర కోసం పెద్దగా శ్రమించాల్సిన పని లేకుండా పోయింది. తన నటన చాలా సహజంగా ఉంది. మేకప్ లేకపోవడం వల్ల మరింత సహజత్వం అబ్బింది.
శివకార్తికేయన్ ద్వితీయార్థాన్ని నడిపించేశాడు. రాజేంద్రప్రసాద్ కి మరోసారి మంచి పాత్ర దక్కింది. తండ్రీ కూతుర్ల మధ్య ఎమోషన్స్ బాగా పండాయి. కార్తీక్ సపోర్టింగ్ రోల్‌లో చక్కగా నటించాడు.
* సాంకేతిక వర్గం
నేపథ్య సంగీతం ఈ కథకు మరింత వన్నె తెచ్చింది. క్రికెట్ నేపథ్యంలోని సన్నివేశాల్నీ బాగా తీశారు. చాలా చోట్ల తమిళంలో షాట్స్‌ని యధావిధిగా వాడేశారు. రీమేక్ లు తీయడం తనకు నల్లేరుమీద నడక అని భీమనేని నిరూపించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు నచ్చుతుంది. కణ చూసినవాళ్లకు కౌసల్య పెద్దగా కదిలించకపోవొచ్చు. కానీ.. కౌసల్యని ఓ తెలుగు సినిమాగా చూస్తే మాత్రం తప్పకుండా నచ్చుతుంది.
* విశ్లేషణ
తమిళంలో విజయవంతమైన `కణ`కి ఇది రీమేక్. అక్కడ చాలా మంచి విజయాన్ని అందుకుంది. కథలో ఎమోషన్స్‌కి చోటెక్కువ. ఉన్నది ఉన్నట్టుగా తీసినా - ప్రేక్షకులకు నచ్చుతుంది. అందుకే పెద్దగా ప్రయోగాల జోలికి, మార్పులూ చేర్పుల జోలికి వెళ్లకుండా `కణ`ని ఫాలో అయిపోయింది చిత్రబృందం. రీమేక్ చిత్రాలు తీయడంలో సిద్దహస్తుడైన భీమనేని శ్రీనివాసరావు - మరోసారి తన పంథాలోనే ఈ సినిమాని తీసేశారు. మాతృకని ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా, అందులోని ఎమోషన్స్ ఇక్కడా పండించే ప్రయత్నం చేశారు.
కౌసల్య కు క్రికెట్ పట్ల మక్కువ పెరగడం, క్రికెటర్‌గా ఎదగడం, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కుంటూ, వాటిని దాటుకుంటూ రావడం ఇవన్నీ ఆసక్తిగా చూపించారు. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉండడంతో కథలోకి ఈజీగానే ప్రవేశిస్తాడు ప్రేక్షకుడు. వెన్నెల కిషోర్‌కు కథ చెబుతున్నట్టుగా.. కౌసల్య కృష్ణమూర్తి మొదలవుతుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే వల్ల టెన్షన్‌ను బిల్డప్ చేస్తూ, మధ్యమధ్యలో వెన్నెల కిషోర్ కామెడీని యాడ్ చేస్తూ, విశ్రాంతి వరకూ... బండిని ఎలాంటి కుదుపులూ లేకుండా నడిపించగలిగారు. పోలీస్ స్టేషన్‌లో సన్నివేశం... విశ్రాంతికి ముందు కాస్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.
ద్వితీయార్థం మొత్తాన్ని శివ కార్తికేయన్ టేకొవర్ చేసుకున్నాడు. కణలో శివకార్తికేయన్ నటించిన సన్నివేశాలు ఈ సినిమా కోసం యధావిధిగా వాడుకున్నారు. దాని వల్ల డబ్బు, సమయం రెండూ ఆదా అయ్యాయి. ఆ సన్నివేశాల్లో శివకార్తికేయన్ నటన కూడా నచ్చుతుంది. అలాంటి నటుడు ఉండడం వల్ల స్టార్ వాల్యూ తోడై.. ద్వితీయార్థం కూడా ఇబ్బంది పెట్టకుండా సాగిపోతుంది. అయితే.. అక్కడక్కడ కాస్త స్లో ఫేజ్‌ని భరించాల్సివస్తుంది. క్రీడా నేపథ్యంలో సాగే కథలు ఎలా ముగుస్తాయో, ఇది కూడా అలానే ముగిసింది. అయితే రైతుల సమస్యపై చర్చించడం వల్ల... క్రీడా కథలో కొత్త కోణం దొరికినట్టైంది.
* ప్లస్ పాయింట్స్
కథలోని ఎమోషన్స్
తండ్రీ కూతుర్ల అనుబంధం
క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
మాతృకని యధావిధిగా ఫాలో అయిపోవడం
ఎక్కవ సన్నివేశాలు అక్కడివే వాడుకోవడం
* ఫైనల్ వర్డిక్ట్: కౌసల్య.. కప్పు కొట్టింది
- రివ్యూ రాసింది శ్రీ