నటీనటులు: అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్
దర్శకత్వం : అద్వైత్ చందన్
నిర్మాతలు: అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధరే
సంగీత దర్శకుడు: తనూజ్ టికు, ప్రీతమ్
సినిమాటోగ్రఫీ: సత్యజిత్ పాండే (సేతు)
ఎడిటర్: హేమంతి సర్కార్
రేటింగ్: 2.5/5
ఒరిజినల్ ఐడియాస్ కి ఎప్పుడూ విలువ ఉంటుంది. వాలిడిటీ కూడా ఎక్కువే. రీమేక్ అనేసరికి.. ఎంత గొప్పగా తీసినా, పోలికలు వచ్చేస్తాయి. మాతృకే బాగుందనిపిస్తుంది. ఎవరికీ క్రెడిట్ ఇవ్వలేం. పైగా క్లాసిక్ కథని ముట్టుకొంటే ఈ బాధలు మరిన్ని ఎక్కువ అవుతాయి. అందుకే చాలామంది హీరోలు రీమేకుల జోలికి వెళ్లరు. అమీర్ ఖాన్ కూడా అంతే. తన కెరీర్‌లో రీమేకులు చాలా తక్కువ. అయితే... 1994లో వచ్చిన `ఫారెస్ట్ గంప్` సినిమా అంటే అమీర్ కి చాలా ఇష్టం. ఈ సినిమాని ఎప్పుడో రీమేక్ చేద్దామనుకొన్నాడు. కానీ అమెరికన్ సినిమా కావడంతో రీమేక్ రైట్స్ సంపాదించడానికి ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇన్నేళ్ల తరవాత... `లాల్ సింగ్ చడ్దా`గా తనకిష్టమైన కథని రీమేక్ చేశాడు అమీర్. మరి... అమెరికన్ లో క్లాసిక్ గా నిలిచిన ఈ కథ... మన భారతీయ ప్రేక్షకులకు నచ్చుతుందా? అదే స్థాయిలో ఈ చిత్రాన్ని తీశారా? లేదా?
* కథ
లాల్ సింగ్ చెడ్డా (అమీర్ ఖాన్) ఓ రైలులో ప్రయాణిస్తుంటాడు. తన తోటి ప్రయాణికులకు తన కథ చెప్పడం మొదలెడతాడు. లాల్ అమాయకుడు. తల్లి తప్ప మరో ప్రపంచం తెలీదు. తండ్రి ఆర్మీ లో చేరి, దేశం కోసం ప్రాణ త్యాగం చేసి వ్యక్తి. తాతముత్తాతలంతా దేశ సేవలోనే ప్రాణాల్ని కోల్పోయారు. చిన్నప్పుడు స్కూల్లో రూప (కరీనా కపూర్) పరిచయం అవుతుంది. స్కూల్లో తోటి పిల్లలంతా తనని ఆట పట్టిస్తుంటే.. రూపనే చేరదీస్తుంది. స్నేహం చేస్తుంది. అలా.. తల్లి తరవాత రూపని అంతగా ఆరాధిస్తాడు. రూప, లాల్.. ఇద్దరూ పెద్దవాళ్లవుతారు. రూపకి బాగా డబ్బు సంపాదించాలని ఉంటుంది. అందుకే సినిమా అవకాశాల కోసం ముంబై వెళ్లిపోతుంది. లాల్.. ఆర్మీలో చేరతాడు.
కార్గిల్ వార్‌లో ఐదుగురు సైనికుల్నికాపాడినందుకు తనకు ప్రభుత్వం అవార్డులు, రివార్డులు ఇచ్చి సత్కరిస్తుంది. అయితే అదే యుద్ధంలో తన స్నేహితుడు బాలరాజు (నాగచైతన్య)ని కోల్పోతాడు. మరో స్నేహితుడు మహమూద్ ని సంపాదించుకుంటాడు. సైన్యం వదిలేసిన లాల్.. తన స్నేహితుడు బాల కోరిక మేరకు ఓ కంపెనీ స్థాపించి, లాభాలతో పాటు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాడు. ముంబై వెళ్లిన రూప తిరిగి ఎప్పుడొస్తుందా అని లాల్ ఎదురు చూస్తుంటాడు. మరి రూప వచ్చిందా? రూప వచ్చాక లాల్ జీవితం ఎలా మారింది? ఇది మిగిలిన కథ.
* విశ్లేషణ
ఫారెస్ట్ గంప్ వచ్చి ఇరవై ఏళ్లయ్యింది. పైగా అది అమెరికన్ చిత్రం. ఓ నవలకు వెండి తెర రూపం. అప్పటి ప్రేక్షకుల అభిరుచి వేరు. అప్పటి కాలమాన పరిస్థితులు వేరు. అప్పట్లో.. `ఫారెస్ట్ గంప్` ఓ క్లాసిక్ గా మిగిలందంటే.. అప్పటి ప్రేక్షకుల మూడ్ వేరు. ఇప్పుడు మొత్తం ప్రపంచం మారిపోయింది. ప్రేక్షకుల దృష్టి కోణం కూడా. ఓ కథని.. నింపాదిగా.. చెప్పుకుంటూ పోతే ఎవరికీ ఎక్కదు. `లాల్ సింగ్..` అలాంటి కథే. ఓ ఫీల్ గుడ్ డ్రామా ఇది. ఇందులోని సన్నివేశాలన్నీ నిదానంగా నడుస్తుంటాయి. ఒక్కో పాత్రని చాలా డిటైల్ గా చూపించాలని దర్శకుడు తాపత్రయ పడ్డాడు. లాల్ సింగ్, రూప, మహమ్మద్ భాయ్, బాల రాజు... ఈ పాత్రల్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికీ, ఆ పాత్రల్ని అర్థం చేసుకోవడానికీ చాలా సమయం వెచ్చించాడు. దాంతో.. సినిమా బాగా నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఛైల్డ్ ఎపిసోడ్ అయితే అలా నడుస్తూనే ఉంటుంది. ట్రిమ్ చేసుకోవాల్సిన చోట కూడా దర్శకుడు పట్టించుకోకపోవడం.. ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది.
ఫారెస్ట్ గంప్ లోని ప్రధానమైన పాయింట్ ని పట్టుకొని, దాన్ని భారతీయ పరిస్థితులకు అన్వయించుకొన్న దర్శకుడు, ఈతరం అభిరుచుని, సినిమాపై మారిన దృక్పథాన్నీ అర్థం చేసుకోలేకపోయాడు. ఇది లాల్ సింగ్ జీవితమే. కాకపోతే... ఎమర్జెన్సీ దగ్గర్నుంచి ముంబైలోని తాజ్ హోటెల్ పై కసబ్ దాడి వరకూ చాలా విషయాల్ని అంతర్లీనంగా చెప్పుకొంటూ వెళ్లాడు. గత నలభై ఏళ్లలో ఈ దేశ రాజకీయాల్లోని కీలకమైన పరిణామాలకు లాల్ సింగ్ సాక్షిగా కనిపిస్తాడు. అయితే.. వాటిని కామెంటరీ రూపంలో చెబుతాడు తప్ప, ఆయా పరిణామాల వెనుక దర్శకుడు తన అభిప్రాయాల్ని తేటతెల్లంగా స్పష్టం చేయడు. దానికీ ఓ కారణం ఉండే ఉంటుంది. ఈమధ్య అమీర్ ఖాన్ వ్యవహారం, ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామందికి నచ్చలేదు. దాంతో అమీర్ సినిమాల్ని బాన్ చేయాలన్న డిమాండ్ కొన్ని సంఘాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే.. తాను వివాదాస్పద అంశాల్ని పైపైనే సృశించి వదిలేశాడు. మరీ లోపలకు వెళ్లే ధైర్యం చేయలేదు.
అమ్మ పాత్రతో పాటుగా రూప పాత్రనీ బలంగా చూపించాడు. ఎవరి కాళ్లపై వాళ్లు నిలబడాలి, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి.. అనే బలమైన పాయింట్ ని అమ్మ పాత్రతో చెప్పించాడు దర్శకుడు. రూప తన లక్ష్యం కోసం శ్రమించీ, శ్రమించీ అలసిపోతుంది. రూప - లాల్ ల మధ్య స్నేహం, ప్రేమ.. చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేశాడు. బాల రాజు పాత్ర చిన్నదే. కానీ ఈ సినిమాలో అదే కీ పాయింట్. స్నేహానికి లాల్ సింగ్ చద్దా ఇచ్చే విలువ బాలరాజు ఎపిసోడ్ తో చూపించగలిగాడు. మహమ్మద్ పాత్ర కూడా అంతే. అందులోని ఎమోషన్స్ బాగుంటాయి. క్లైమాక్స్ లో సాగదీత మరీ ఎక్కువ అనిపించింది. రెండు గంటల 40 నిమిషాల సినిమా ఇది. కనీసం అరగంట ట్రిమ్ చేయొచ్చు.
* నటీనటులు
అమీర్ ఖాన్ తప్ప మరెవ్వరూ ఈ పాత్ర చేయలేరు. ఆ స్థాయిలో ఇమిడిపోయాడు అమీర్. అయితే.. పీకేలో కూడా అమీర్ అమాయకత్వం, హావభావాలూ ఇలానే ఉంటాయి. కాబట్టి.. ఓరకంగా అమీర్ కు ఇది అలవాటైన పాత్రే. దాదాపుగా అమీర్ లోని అమాయకత్వాన్ని కాస్త ఆడాప్ట్ చేసుకున్నట్టుగా బాలరాజు పాత్రని తీర్చిదిద్దారు.
అమీర్ లాంటి నటుడితో వెండి తెర పంచుకోవడం నాగచైతన్యకు గొప్ప అవకాశం. దాన్ని బాగా వాడుకొన్నాడు కూడా. కరీనా చాలా హుందాగా కనిపించింది. ప్రేమకూ లక్ష్యానికీ మధ్య నలిగిన పాత్ర తనది. కాస్టింగ్ పరంగా ఎక్కడా లోటు చేయలేదు. ఓ చిన్న పాత్రలో షారుఖ్ కూడా మెరుస్తాడు.
* సాంకేతిక వర్గం
పాటలు, నేపథ్య సంగీతం.. ఆహ్లాదకరంగా సాగాయి. తెలుగులో కూడా పాటలు వినసొంపుగా ఉన్నాయి. డబ్బింగ్ పాటలు విన్నట్టుగా లేవు. ఫొటోగ్రఫీ, ఆర్ట్ విభాగం పనితీరు.. ఇవన్నీ అమీర్ సినిమాల స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి.
ఫారెస్ట్ గంప్ ని బాగానే అడాప్ట్ చేసుకొన్నా.. ఈ తరం స్పీడుని ఈ కథ అందుకోలేకపోయింది. చూసిన ఎమోషన్స్‌నే మళ్లీ తెరపై చూసిన ఫీలింగ్ కలిగింది. నిడివి అన్నింటికంటే పెద్ద సమస్య.
* ప్లస్ పాయింట్స్
అమీర్
నాగచైతన్య
కొన్ని ఎమోషనల్ సీన్లు
* మైనస్ పాయింట్స్
నిడివి
క్లైమాక్స్
రాజకీయ అంశాలపై లోతైన చర్చ జరక్కపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: ఓన్లీ ఫర్ అమీర్ ఖాన్