నటీనటులు: అంజలి, యోగి బాబు, మైమ్ గోపి తదితరులు.
దర్శకత్వం: రాజు విశ్వనాధ్
నిర్మాతలు: సురేష్ కొండేటి
సంగీతం: సంతోష్ దయానిధి
సినిమాటోగ్రఫర్: పి. జి. ముత్తయ్య
విడుదల తేదీ: మే 24, 2019
రేటింగ్: 2/ 5
భయపెట్టడంలో ఎన్ని రకాలున్నాయో అవన్నీ ప్రయత్నించేశారు మనోళ్లు. దెయ్యం కథని కామెడీ చేసేశారు. కామెడీ సినిమాలో దెయ్యాన్ని తీసుకొచ్చారు. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడిపోవడం మరో ఫార్ములా. అలా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఈ దెయ్యం కథలకు కొత్త సాంకేతిక హంగులు అద్దడానికి ప్రయత్నిస్తున్నారు. త్రీడీలో భయపెడితే ఎలా ఉంటుందా?? అనే ఆలోచనకు ప్రతిరూపం... `లీసా`. దెయ్యం కథలకు పేటెంట్ హక్కులు తీసేసుకున్న అంజలి ఈ సినిమాలో నటించడం, త్రీడీ హంగులు కలసి రావడం, పైగా నాణ్యమైన డబ్బింగ్ చిత్రాలు అందించిన ఎస్.కె. పిక్చర్స్ సంస్థ నుంచి ఈ సినిమా రావడం... ఇవన్నీ కలిసి `లీసా`పై ఓ కన్నేసేలా చేశాయి. మరి లీసా ఎలా ఉంది? భయపెట్టిందా? థ్రిల్ కలిగించిందా?
* కథ
లీసా (అంజలి) తండ్రికి దూరమైన ఓ ఆడపిల్ల. చిన్నప్పటి నుంచే తల్లే లోకంగా బతుకుతుంది. చదువు పూర్తయిన తరవాత అమెరికాలో స్థిరపడాలని భావిస్తోంది. అయితే ఇండియాలో తన తల్లి ఒంటరైపోతుందన్నది లీసా బాధ. తల్లికి ఓ తోడు కావాలనుకుంటుంది. అందుకే... తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని భావిస్తుంది. అందుకు లీసా తల్లి ఒప్పుకోదు. తన అమ్మమ్మ, తాతయ్యలు చెబితే - అమ్మ దారిలోకి వస్తుందని భావించిన లీసా... అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. అక్కడి నుంచి లీసాకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. లీసా అనుకోని ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ఇబ్బందులేంటి? అందులోంచి ఆమె ఎలా బయటపడింది? అనేదే కథ.
* నటీనటులు
అంజలి నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. తన వరకూ న్యాయం చేసింది. కొన్ని సందర్భాల్లో తాను ఎంత మంచి నటి అనే విషయం తెలుస్తూ ఉంటుంది. సన్నివేశంలో బలం లేనప్పుడు కూడా తన అనుభవంతో, నటనతో నెట్టుకొచ్చింది. అయితే కథల ఎంపికలోనే తను కాస్త జాగ్రత్త పడాలి. కొంత కాలం పాటు ఇలాంటి కథలకు దూరంగా ఉంటే మరీ మంచిది. బ్రహ్మానందం పాత్ర కేవలం సన్నివేశాల్ని సాగదీయడానికే ఉపయోగపడింది. ఆ సన్నివేశాలన్నీ అతుకుల బొంతలా సాగాయి. మిగిలినవాళ్లంతా తమిళ నటీనటులే.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా `లీసా` ఓ చక్కటి అనుభూతి కలిగిస్తుంది. త్రీడీలో తెరకెక్కించిన సినిమా కావడం కలిసొచ్చే అంశం. త్రీడీలో హారర్ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం అనుకుని జనాలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. సౌండింగ్ కూడా బాగుంది. కొన్ని చోట్ల.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత బాగుంది. కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు ఈ సాంకేతిక నైపుణ్యం అంతా బూడిదలో పోసిన పన్నీరు చేశాడు. అసలేమాత్రం ఆసక్తి లేని కథని తీసుకొచ్చి, నీరసంతో నింపేశాడు. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషి ఫలించలేదు.
* విశ్లేషణ
ఇదో హారర్ థ్రిల్లర్ చిత్రం. ముందు నుంచీ ఈ సినిమాని అలానే ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఇందులో సెంటిమెంట్ పాళ్లు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. సాధారణంగా హారర్ సినిమాలంటే కుటుంబ ప్రేక్షకులు దూరం పెడతారు. వాళ్లనీ ఆకట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో సెంటిమెంట్‌కి దర్శకుడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడనిపిస్తుంది.
ఓ చిన్న లైన్ తీసుకుని దానికి హారర్, థ్రిల్లర్ కోటింగు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కథలకు `లైన్` బాగుంటే సరిపోతుంది. `లీసా` కథాంశం కూడా మంచిదే. కాకపోతే.. దాని చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాల్ని జోడించడంలో మాత్రం దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంటుంది. సినిమా మొదలైన చాలా సేపటి వరకూ అసలు కథలోకి వెళ్లదు. సన్నివేశాల్ని పేర్చుకుంటూ వెళ్లాడు గానీ, వాటికీ అసలు కథకీ ఉన్న కనక్షన్ ఏమిటో అంతు పట్టదు.
కొన్ని సన్నివేశాలైతే కేవలం నిడివి పెంచడానికి తప్ప దేనికీ ఉపయోగపడవు. దర్శకుడు మరీ ఇంత బోర్ కొట్టిస్తున్నాడేంటి? అనుకున్న దశలో కథలో ఓ మలుపు చోటు చేసుకుంటుంది. విశ్రాంతి ముందొచ్చే సన్నివేశాలు తప్పకుండా ఉత్కంఠతకు గురి చేస్తాయి. ఇంట్రవెల్ సమయానికి లీసా గాడిలో పడినట్టే కనిపిస్తుంది.
ద్వితీయార్థం కూడా అదే ఫ్లో కొనసాగితే బాగుండేది. కానీ... దర్శకుడు మళ్లీ దారి తప్పేస్తాడు. తన దగ్గరకున్న పాయింట్ చాలా చిన్నది. ద్వితీయార్థంలో ఐదారు సన్నివేశాల తరవాత శుభం కార్డు వేసేయొచ్చు. మరీ అలా తీస్తే షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది కదా... అందుకే సినిమాని వీలైనంత వరకూ సాగదీసుకుంటూ వెళ్లాడు. కామెడీ పండించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. వింత వింత శబ్దాలతో భయపెట్టాలని చూశాడు. అయితే ఇవేం వర్కవుట్ కాలేదు. త్రీడీ ఎఫెక్టుల వల్ల కొన్ని సార్లు ఉలిక్కి పడడం మినహాయిస్తే... కథన పరంగా గగుర్పాటుకి గురి చేసే వీలు లేకుండా పోయింది. తాను చెప్పాలనుకున్న పాయింట్‌కి క్లైమాక్స్ వరకూ దాచి పెట్టాడు. ఆ పాయింట్ బాగానే ఉన్నా - అప్పటికే జనాలలో నీరసం వచ్చేస్తుంది. పైగా తమిళ నేటివిటీ బాగా ఎక్కువైపోయింది. ఇది తెలుగు సినిమా కాదని, తమిళంలో తీసి అనువాదం చేశారని అడుగడుగునా తెలుస్తూనే ఉంటుంది.
* ప్లస్ పాయింట్స్
+అంజలి
+స్పెషల్ ఎఫెక్ట్స్
* మైనస్ పాయింట్స్
-కథ, కథనం
-సాగదీత
* ఫైనల్ వర్డిక్ట్: త్రీడీలోనూ భయపెట్టలేదు
- రివ్యూ రాసింది శ్రీ.