తారాగణం: శ్రీ విష్ణు, చిత్ర శుక్ల
బ్యానర్: వెన్నెల క్రియేషన్స్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫీ: తమశ్యాం
మ్యూజిక్: సురేష్
నిర్మాత: బలగ ప్రకాష్ రావు
దర్శకత్వం: కుమార్ వట్టి
అప్పట్లో ఒకడుండేవాడు సినిమా చూసిన తరవాత శ్రీ విష్ణు పై గౌరవం పెరిగింది. ఫర్లేదు.... ఈ కుర్రాడు కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడనిపించింది. అందుకే శ్రీవిష్ణు నుంచి మరో సినిమా వస్తోందంటే... అందరూ కాకపోయినా కొందరైనా ఆ సినిమాపై దృష్టి పెట్టారు. మా అబ్బాయి పై ఎన్నో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయంటే దానికి కారణం.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమానే. మరి.. మా అబ్బాయి ఎలా ఉంది? ఎప్పట్లా శ్రీవిష్ణు కొత్తదారిలో వెళ్లాడా? లేదా? తెలియాలంటే రివ్యూ లోకి ఎంటర్ అవ్వాల్సిందే.
* కథ ఎలా ఉందంటే..
అబ్బాయి (శ్రీవిష్ఱు) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అందమైన కుటుంబం. నిత్యం సంతోషం తొణికిసలాడుతుంటుంది. అక్క నిశ్చితార్థం వైభవంగా జరుగుతుంది. ఇక పెళ్లే తరువాయి. ఈ దశలో ఆ కుటుంబాన్ని అనుకోని విషాదం కబళిస్తుంది. గుడికెళ్తే.. ఉగ్రవాదులు బాంబు దాడి చేస్తారు. గుళ్లో చాలామంది చనిపోతారు. వాళ్లతో పాటు.. అబ్బాయి కుటుంబం కూడా. తాను తప్ప ఇంకెవ్వరూ మిగలరు. ఒకే ఒక్క విషాదం తన జీవితాన్ని నాశనం చేసేస్తోందన్నమాట. తనే కాదు.. చాలామంది కుటుంబాలు అనాథల్లా పడి ఉండడం చూసి రగిలిపోతాడు ఉగ్రవాదుల్ని అంతమొందిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అక్కడ్నంచి ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రయాణం ఎలా సాగింది? తన గమ్యాన్ని ఎలా చేరుకొన్నాడన్నదే కథ.
* ఎవరెలా నటించారంటే..
శ్రీ విష్ణు హుషారుగా నటించాడు. డాన్సుల్లో ఈజ్ కనిపించింది. అయితే అక్కడక్కడ కాస్త ఓవరాక్షన్ చేశాడనిపిస్తోంది. మాస్ హీరోలా గుర్తింపు దక్కింపు సంపాదించడం కోసం తాపత్రయపడుతన్నట్టు అర్థమైంది. చిత్రశుక్ల అందంగా కనిపించింది. నటన కూడా ఓకే. ఇక ముందు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అనిపిస్తోంది. మిగిలిన ఎవ్వరికీ చెప్పుకోదగిన ప్రాధాన్యం లేదు.
* ఎలా తీశారంటే..
కథలో కథానాయకుడి లక్ష్యం మంచిది. సత్తా ఉన్న పాయింటే. ఓ సామాన్యుడు ఉగ్రవాదుల్ని ఎదిరించడం, వాళ్లని మట్టుపెట్టాలనుకోవడం బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే వెడ్నెస్ డేలాంటి కథన్నమాట. అయితే... అక్కడ హీరో వయసు మళ్లిన వాడు.. ఇక్కడ అబ్బాయి. అంతే తేడా! ఎంతకాదన్నా ఉగ్రవాదులది బలమైన నెట్ వర్క్. వాళ్లని ఒక్కడే ఎదుర్కోవాల్సివచ్చినప్పుడు కథానాయకుడు అపర మేధావి అయ్యుండాలి. ఈ సినిమాలో విష్ణు పాత్ర అలాంటిదే. కాకపోతే.. ఆ క్యారెక్టరైజేషన్ ముందు నుంచీ... డెవలెప్ చేసుకొంటూ రావాల్సింది. గుళ్లో ఉగ్రవాదుల దాడి, అక్కడ కథానాయకుడు ఛాలెంజ్ చేయడం వరకూ.. కథలో ఎలాంటి రసవత్తరమైన మలుపులూ ఉండవు. ఏదో అలా.. అలా సాగిపోతుంటుంది. గుళ్లో ఎటాక్ తరవాత.. హీరోయిజం మేల్కొంటుంది. అక్కడి నుంచి.. హీరోగారి వన్ మాన్ షోనే నడుస్తుంటుంది. హీరో ఏం అనుకొంటే అది జరిగిపోతుంటుంది. అది లాజిక్‌లకు దూరంగా ఉండడం, హీరోకి సరైన ప్రత్యర్థి లేకపోవడంతో కథనం ఏమాత్రం రక్తి కట్టదు. అసలు.. తెరపై జరుగుతున్న సన్నివేశాలకూ నాకూ ఏమాత్రం సంబంధం లేదనుకొంటాడు ప్రేక్షకుడు. అక్కడితో కనక్షన్ కట్ అయిపోతుంది. ప్రధమార్థం కంటే ద్వితీయార్థమే కాస్త బెటర్. పతాక దృశ్యాలు మరీ తేలిపోయాయి. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, కథానాయకుడి ఓవరాక్షన్.. ఈ సినిమాకి ప్రధాన మైనస్‌లు.
సాంకేతికంగా ఈసినిమా బాగుంది. పాటలు అనవసరం అనిపించినా.. పిక్చరైజేషన్ బాగుంది. ఫైట్స్ అయితే మాస్ హీరో సినిమాలకు తగ్గని విధంగా తీశారు. నిర్మాణపరంగా మంచి మార్కులు పడతాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు.
+ ప్లస్ పాయింట్స్
శ్రీ విష్ణు
ఫైట్స్
పిక్చరైజేషన్
- మైనస్ పాయింట్స్
బోరింగ్ స్క్రీన్ ప్లే
లవ్ ట్రాక్
ఫైనల్ వర్డిక్ట్ : ఈ అబ్బాయి చాలా రొటీన్ గురూ!
యూజర్ రేటింగ్: 2.5/5
రివ్యూ బై: శ్రీ