మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం మూవీ రివ్యూ & రేటింగ్‌!

మరిన్ని వార్తలు

నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా తదితరులు.
దర్శకత్వం : ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు


రేటింగ్‌: 2/5


ఓ కొత్త ద‌ర్శ‌కుడికి హీరో న‌మ్మి అవ‌కాశం ఇచ్చాడంటే.. క‌చ్చితంగా అబ్బుర ప‌రిచే క‌థ అయ్యిఉంటుంద‌న్న‌ది అంద‌రి న‌మ్మ‌కం. `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`పై అంచనాలు పెర‌గ‌డానికి కూడా అదే కార‌ణం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనే ఎడిట‌ర్ ని ఈ సినిమాతో నితిన్ ద‌ర్శ‌కుడిగా మార్చాడు. అంటే.. క‌చ్చితంగా నితిన్ ని క‌థ బాగా ఇంప్రెస్ చేసింద‌న్న భ‌రోసా క‌లుగుతుంది. దానికి తోడు.. ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. బాగా ఖ‌ర్చు పెట్టారు. త‌న సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ లో నితిన్ తీసిన సినిమాల‌న్నీ దాదాపుగా హిట్టే. కాబ‌ట్టి `మాచ‌ర్ల‌`పై కూడా అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ సినిమా అందుకొందా, లేదా? `మాచ‌ర్ల‌`తో మ్యాజిక్ జ‌రిగిందా, లేదా? అస‌లు ఈ నియోజ‌క వ‌ర్గంలో ఏం జ‌రిగింది? తెలుసుకొంటే..


* క‌థ‌


సిద్దార్థ్ (నితిన్‌) ఐఏఎస్ చ‌దివి, ఇంట‌ర్వ్యూ ప్రోసెస్ పూర్తి చేసి, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటాడు. త‌న‌కు స్వాతి (కృతి శెట్టి) అనే అమ్మాయి ప‌రిచ‌యం అవుతుంది. తొలి చూపులోనే కృతిని ప్రేమించేస్తాడు సిద్దార్థ్‌. అనుకోకుండా... సిద్దార్థ్ పక్కింట్లోనే స్వాతి చేరుతుంది. మెల్ల‌గా కృతిని త‌న దారిలోకి తెచ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు సిద్దార్థ్‌. ఓ ప‌నిమీద విశాఖ‌ప‌ట్నం వచ్చిన స్వాతి.. ఆ ప‌ని ముగించుకొని తిరిగి మాచ‌ర్ల వెళ్లిపోతుంది. త‌నని వెదుక్కొంటూ సిద్దార్థ్ కూడా మాచ‌ర్ల వెళ్తాడు.


మాచ‌ర్ల‌... రెడ్డప్ప (స‌ముద్ర‌ఖ‌ని) అడ్డా. అక్క‌డ ముఫ్పై ఏళ్లుగా ఎం.ఎల్‌.ఏగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌వుతుంటాడు రెడ్డ‌ప్ప‌. త‌న‌పై పోటీ చేసే ధైర్యం ఏ ఒక్క‌రికీ ఉండ‌దు. త‌న‌ని ఎదరించిన క‌లెక్ట‌ర్ల‌ని సైతం దారుణంగా చంపేస్తుంటాడు రెడ్డ‌ప్ప‌. అక్క‌డే... క‌లెక్ట‌ర్‌గా సిద్దార్థ్ కి పోస్టింగ్ వ‌స్తుంది. మ‌రి.... మాచ‌ర్ల‌లో అడుగుపెట్టిన సిద్దార్థ్ అక్క‌డ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు? రెడ్డ‌ప్ప‌తో ఎలా త‌ల‌ప‌డ్డాడు? అస‌లు స్వాతి ఎవ‌రు? త‌ను విశాఖ‌ప‌ట్నం ఎందుకొచ్చింది? ఇవ‌న్నీ తెర‌పై చూసి తెలుసుకోవాల్సిన సంగ‌తులు.


* విశ్లేష‌ణ‌


ఓ దుర్మార్గుడైన ఎం.ఎల్‌.ఏకీ.. ఓ క‌లెక్ట‌ర్ కీ జ‌రిగే వార్ ఇది. ఎప్పుడూ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌లు జ‌రిగే ఓ నియోజ‌క వ‌ర్గానికి, ఓ శ‌క్తిమంత‌మైన క‌లెక్ట‌ర్ వ‌చ్చి, ఎన్ని క‌లు నిర్వ‌హిస్తే ఎలా ఉంటుంద‌న్న పాయింట్ తో సినిమా తీశారు. ఆ పాయింట్ వ‌ర‌కూ ఓకే. కానీ దాని ముందూ, వెనుక జ‌రిగే త‌తంగం మాత్రం త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా క‌నిపిస్తుంటుంది. తొలి స‌న్నివేశంలోనే విల‌న్ ని క్రూరంగా ప‌రిచ‌యం చేస్తాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఇంట్ర‌వెల్ కి గానీ ఆయ‌న క‌నిపించ‌డు. హీరో - విల‌న్ల క్లాష్ సెకండాఫ్‌లోనే మొద‌ల‌వుతుంది.


తొలి స‌గం అంతా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ తోనూ, ల‌వ్ ట్రాక్ తోనూ, వెన్నెల కిషోర్ తోనూ నింపేశారు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌లో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. హీరోయిన్ తో ల‌వ్ ట్రాక్ ప‌ర‌మ రొటీన్ గా ఉంటుంది. దానికి తోడు వెన్నెల కిషోర్ తో కామెడీ విసుగు పుట్టిస్తుంది. `లేపా..క్షి` పాన్ ఎపిసోడ్ అయితే.. ఇంకా దారుణం. అస‌లు ఇలాంటి ట్రాకుల‌తో న‌వ్వు పుడుతుంద‌ని ద‌ర్శ‌కుడు ఎలా భావించాడో ఏమిటో..? పాటా - ఫైటూ అనే రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు లోబ‌డి ఫ‌స్టాఫ్ న‌డిచిపోతుంది.


ద్వితీయార్థంలో అస‌లైన మ‌జా వ‌స్తుంద‌ని ఆశిస్తే.. అక్క‌డా నిరాశే. బల‌మైన విల‌నిజం అంటే.. విల‌న్ అరుస్తూ, పీక‌లు కోస్తూ ఉండ‌డం కాదు. హీరోపై ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌డం. ఈ సినిమాలో అది జ‌ర‌గ‌లేదు. హీరో - విల‌న్ల మ‌ధ్య ఫైట్ కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. హీరో ఈ సినిమాలో ఓ జిల్లాకి క‌లెక్ట‌రు. కానీ త‌న ఫోక‌స్ అంటా మాచ‌ర్ల‌పైనా, రెడ్డ‌ప్ప పైనా ఉంటుంది. క‌లెక్ట‌ర్ ఎదురుప‌డితే ఎం.ఆర్‌.ఓ ఎలాప‌డితే అలా మాట్లాడేస్తాడా? ఓ ప్రోటో కాల్ ఉంటుంది క‌దా? వీటిపై ద‌ర్శ‌కుడికి స‌రైన అవ‌గాహ‌న లేద‌నిపిస్తుంది.


క‌లెక్ట‌రుగా అడుగు పెట్టిన హీరో.. వీధుల్లో రౌడీల్ని చిత‌గ్గొట్ట‌డం, అంజ‌లితో ఓ ఐటెమ్ గీతానికి స్టెప్పులు వేయ‌డం - ఆ పాత్ర ఔచిత్యానికి చాలా దూరంగా ఉండే విష‌యాలు. ఆ స్థానంలో హీరో మైండ్ గేమ్ తో రెడ్డ‌ప్ప ఆట‌లు క‌ట్టిస్తే బాగుండేది. కానీ అలా మైండ్ గేమ్ నేప‌థ్యంలో స‌న్నివేశాలు రాసుకోవాలంటే ద‌ర్శ‌కుడిలో చాలా విష‌యం ఉండాలి. అది లేక‌పోవ‌డంతో... దాని జోలికి వెళ్ల‌లేదేమో..? సినిమా మొత్తం భూత‌ద్దం ప‌ట్టుకొని వెదికినా.. ఫ్రెష్ గా ఒక్క సీనూ క‌నిపించ‌దు. కొత్త‌గా ఒక్క డైలాగూ వినిపించ‌దు. ఇర‌వై ఏళ్ల అనుభ‌వం సంపాదించుకొన్న నితిన్‌.. ఈ క‌థ‌ని ఎలా ఒప్పుకొన్నాడా? అనే అనుమానం క‌లిగితే అది ప్రేక్ష‌కుడి త‌ప్పు కాదు.


* న‌టీన‌టులు


నితిన్ త‌న ప‌రిధి మేర బాగానే చేశాడు. కానీ... క‌లెక్ట‌రు పాత్ర‌లో కూడా, సిద్దార్థ్ అల్ల‌రి చిల్ల‌ర‌గానే ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. ప‌క్కా మాస్ కుర్రాడిలానే డైలాగులు చెబుతుంటాడు. నితిన్ డాన్సులు బాగుంటాయి. ఈసినిమాలో ఇంకా బాగున్నాయి. త‌న సిగ్నేచ‌ర్ స్టెప్పులు ఆక‌ట్టుకుంటాయి.


నితిన్ తో పోటీ ప‌డుతూ కృతి శెట్టి కూడా కొన్ని మూమెంట్స్ బాగానే చేసింది. బేబ‌మ్మ పాత్ర‌తో పోలిస్తే... కృతి చేసిన‌ మిగిలిన పాత్ర‌ల‌న్నీ తేలిపోతున్నాయి. ఆ కోవ‌లో స్వాతి పాత్ర కూడా చేరిపోతుంది. రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి అనుభ‌జ్ఞుడికి ఇచ్చింది రెండో మూడో సీన్లు. అంతే. ముర‌శీ శ‌ర్మ ది రొటీన్ పాత్రే. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ న‌వ్వుతెప్పించ‌క‌పోగా.. విసుగ క‌లిగించింది. స‌ముద్ర‌ఖ‌ని పాత్ర నిండా త‌మిళ విల‌నిజం ఛాయ‌లే.


* సాంకేతిక వ‌ర్గం


మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ అందించిన పాట‌లు ఏమాత్రం ఆక‌ట్టుకోవు. రీ రికార్డింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. క‌థ‌గా చూస్తే.. ఇది ప‌ర‌మ రొటీన్ క‌థ‌. ఒక్క విష‌యంలోనూ వైవిధ్యం క‌నిపించ‌దు.


ఇంత రొటీన్ క‌థ‌తో.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం అద్భుత‌మే అనుకోవాలి. దాన్నిఆయ‌న నిల‌బెట్టుకోలేదు. నిర్మాణ విలువ‌ల విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డేలేదు. కెమెరా వ‌ర్క్ డీసెంట్ గా ఉంది. కొన్ని మాట‌లు మ‌రీ ముత‌క‌గా వినిపిస్తాయి.


* ప్ల‌స్ పాయింట్స్‌


నితిన్‌
ఫైట్లు


* మైన‌స్ పాయింట్స్‌


క‌థ‌
క‌థ‌నం
కామెడీ
పాట‌లు


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: మాచ‌ర్ల‌లో.. మెరుపులు లేవు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS