లైకా ప్రొడక్షన్ - శంకర్ మధ్య జరిగిన వివాదం తెలిసిందే. ఈ సినిమా కోసం శంకర్ ఇచ్చిన బడ్జెట్ ఒకటి.. అవుతోంది మరోటి. ఈ విషయం గ్రహించిన లైకా.. సినిమాని ఆపేసింది. శంకర్ కూడా టీమ్ నుంచి బయటకు వచ్చేసి రామ్ చరణ్ తో సినిమా మొదలెట్టాడు. శంకర్ పై నిర్మాతలు కోర్టు కెక్కారు. ఇప్పుడు నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో.. చరణ్ సినిమాని పక్కన పెట్టి మరీ.. ఇండియన్ 2 సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు శంకర్.
నిజానికి శంకర్ మిస్టర్ పర్‌ఫెక్ట్ టైపు. ప్రతీ సీనూ చెక్కుకుంటూ పోతాడు. తనకు నచ్చేంత వరకూ ఏ విషయంలోనూ రాజీ పడడు. కానీ... ఇండియన్ 2ని మాత్రం ఇప్పుడు చుట్టేయాలని ఫిక్సయ్యాడట. ఇండియన్ 2 కోసం శంకర్ ముందు చాలా తక్కువ సమయం ఉంది. అంతలోనే..ఈ సినిమాని ఏదో లా పూర్తి చేసి వదిలించుకోవాలని భావిస్తున్నాడు. నిర్మాతలతో గొడవల నేపథ్యంలో అసలు ఈ సినిమాపై శంకర్‌కి ఎలాంటి ఆసక్తి లేదని, ఏదోలా పూర్తి చేస్తే చాలని భావిస్తున్నాడని చెన్నై వర్గాల టాక్.
ఇండియన్ 2 కోసం ఇది వరకే కొంతమంది ఆర్టిస్టుల్ని ఎంపిక చేశారు. అయితే మధ్యలో షూటింగ్ కి బ్రేక్ రావడం వల్ల.. వాళ్ల కాల్షీట్లు ఇప్పుడు గందరగోళంలో పడ్డాయి. వాళ్లు లేకపోయినా సరే, ఈ సినిమాని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న నటీనటులతోనే ఈ సినిమా పూర్తి చేయబోతున్నాడట. బడ్జెట్ విషయంలోనూ శంకర్ కి పెద్ద వెసులుబాటు లేకపోవడం మరో మైనస్ పాయింట్ గా మారింది. ఇప్పుడు నిర్మాతలు ఇచ్చిన బడ్జెట్ తోనే సినిమా పూర్తి చేయాల్సిన అగత్యం ఏర్పడింది. అందుకే భారతీయుడు ని శంకర్ లైట్ తీసుకుంటున్నాడని టాక్.