మదగజరాజా మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: మదగజరాజా 
దర్శకత్వం: సుందర్ సి 
కథ - రచన: సుందర్ సి

నటీనటులు: విశాల్, అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంతానం, సోనుసూద్, మనోబాల, సుబ్బరాజు, శరద్ సక్సెనా, మణివణ్ణన్ తదితరులు

నిర్మాతలు: మనోహర్ ప్రసాద్ అక్కినేని,  ఆనంద్ ప్రసాద్ అక్కినేని, షణ్ముగం ఏసీ, అరుణ్ కుమార్ ఏసీఎస్.

సంగీతం: విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్, ఎన్‌బీ శ్రీకాంత్

బ్యానర్: జెమిని ఫిల్మ్ సర్క్యూట్
విడుదల తేదీ: 31 జనవరి 2025

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

మదగజరాజా మూవీ ఎప్పుడో పన్నెండు ఏళ్ళ క్రితం రిలీజ్ కావాల్సిన సినిమా. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చి, కోలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచింది. పుష్కర కాలం తరవాత వచ్చినా అనూహ్యంగా ఈ మూవీ విజయం సాధించటం గమనార్హం. దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. సంక్రాంతికి తెలుగులో పెద్ద సినిమాల హడావుడితో థియేటర్స్ కొరత ఉండటంతో ఇప్పుడు రిలీజ్ చేసారు. కోలీవుడ్ లో మంచి ఆదరణ లభించిన 'మదగజరాజా ' తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

మ‌ద‌గ‌జ‌రాజా (విశాల్‌) అరకులో ఓ కేబుల్ ఆప‌రేట‌ర్‌. తండ్రి స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఎస్సైగా ప‌నిచేస్తుంటాడు. మదగజరాజా తండ్రికి సాయంగా ఉంటూ అన్ని పనులు చక్కబెడుతుంటాడు. అదే ఊరిలో ఉండే మాధ‌వి (అంజ‌లి)తో ప్రేమలో పడతాడు రాజా. కొన్ని కారణాల వలన మాధవితో లవ్ బ్రేకప్ అయిపోతుంది. ఇంకోవైపు తన చిన్ననాటి మాస్టర్ త‌న కూతురు పెళ్లికి రావాలంటూ ఫోన్ చేస్తాడు. దీంతో రాజా, అతని స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఆ పెళ్ళికి వెళ్తారు. అక్కడే మాయ (వరలక్ష్మీ శరత్ కుమార్) తో మళ్ళీ ప్రేమలో పడతాడు. కొన్ని సమస్యల వలన మాస్టారు కూతురి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. రాజా, అత‌ని స్నేహితులంతా క‌లిసి ఆ స‌మ‌స్య‌ని పరిష్కరించి ఆ పెళ్లి జరిగేలా చేస్తారు. అప్పుడే తన ఫ్రెండ్స్ కి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉందని తెలుసుకుంటాడు రాజా. అసలు ఆ సమస్యలకి కారణం కాక‌ర్ల విశ్వ‌నాథ్ (సోనూసూద్‌) అని తెలుసుకొని తనని కలవటానికి హైద‌రాబాద్‌ వెళ్తాడు. అన్ని రకాలా అండదండలున్న విశ్వనాథ్ మీడియాని తన గుప్పిట్లో పెట్టుకుని ప్ర‌భుత్వాన్నే శాసిస్తుంటాడు. అసలు రాజు ఇష్టపడిన మాధవి ఎందుకు దూరమైంది? మాస్టారు కూతురి పెళ్ళిలో ఏర్పడిన సమస్య ఏంటి? విశ్వనాథ్ తో తన ఫ్రెండ్స్ కి ఉన్న సమస్యలేంటి?  మీడియా అధినేత  విశ్వనాథ్ ప్లాన్ ఏంటి?  ఎందుకు పాలిటిక్స్‌లోకి రావాలనుకొన్నాడు?  విశ్వనాథ్‌ ప్రయత్నాలకు రాజు ఎందుకు అడ్డంకిగా మారాడు? రాజా చివరికి మాధవిని చేసుకున్నాడా? మాయని చేసుకున్నాడా? బిజినెస్ టైకూన్ మీడియా అధినేత అయిన  విశ్వనాధ్ ని రాజా ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి ఏమయ్యింది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

సుందర్ సి తన సినిమాల్ని పక్కాగా కమర్షియల్ గా తీస్తారు. తన సినిమాలో యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్ అన్ని ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ కి పెద్ద పీట వేస్తారు. పైగా 'మదగజరాజా' పన్నెండేళ్ల క్రితం తీసిన మూవీ కావటంతో విశాల్ హీరోయిజాన్ని దృష్టిలోపెట్టుకుని బాగా హైలెట్ చేశారు. పాటలు కూడా కలర్  ఫుల్ గా ఉన్నాయి. ఈమూవీకి అంజలి , వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్ కూడా బాగా కలిసి వచ్చింది. ఒక రాష్ట్ర సీఎం ని శాసించే వ్యక్తిని ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు. అతని అహాన్ని ఎలా అణిచాడు అన్నది ఈ సినిమా కథ. ఇది రొటీన్ కథే. బాగా డబ్బు,  పలుకుబడి ఉన్నవాడిని హీరో ఎదుర్కోవటం మనం ఇది వరకు సినిమాల్లో చూసిందే. ఇలాంటి స్టోరీల్లో హీరో  శక్తివంతమైన విలన్ ని బుద్ధిబలంతో కానీ బుజ బలంతో కానీ ఎదుర్కొంటాడు. కానీ  ఈ సినిమాలో దర్శకుడు ఈ రెండిటిని కాకుండా కామెడీని ఎంచుకున్నాడు. కథ ప్రారంభం నుంచి చివరి వరకు వినోదానికి ప్రాధాన్యత ఇచ్చారు.

అస్సలు లాజిక్ అన్న మాటకి ఆస్కారమే లేదు మదగజరాజా మూవీలో. ప్రస్తుతం వింటేజ్ సినిమాలు అంటూ రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు ఫ్రెష్ గా రిలీజైన ఈ సినిమా కూడా అదే ఫీల్ ఇస్తుంది. 12 ఏళ్ల క్రితం రాసిన కథ, తీసిన సినిమా అని ప్రతి ఫ్రేమ్ గుర్తుకు తెస్తుంది. సోనూసూద్ ఒక బిజినెస్ మెన్. సీఎం అయినా అతని దగ్గరికే రావాలి. అలాంటిది అతని ఇంట్లోకి ఒక సామాన్యుడు CBI అంటూ నేరుగా వెళ్ళటం కొంచెం అతిగా అనిపిస్తుంది. సినిమాటిక్ లిబర్టీస్ తో కమర్షియల్ అంశాలు మిక్స్ చేసి ఒక కామెడీ మూవీ తీశారు. కామెడీ కావటంతో కోలీవుడ్ ఆడియన్స్ మదగజరాజని ఆదరించారు.

ఈ మధ్య కాలంలో కోలీవుడ్  దర్శకులు, హీరోలు ప్రయోగాల బాట పట్టి కామెడీ సినిమాలు, మాస్ మెచ్చే కమర్షియల్ సినిమాలు తీయటం తగ్గించారు. ఈ అంశమే మదగజరాజకి కలిసి వచ్చింది. హీరో ఫ్రెండ్ గా సంతానం చేసిన కామెడీ నవ్విస్తుంది. మినిస్ట‌ర్ అత్తిలి స‌త్తిబాబు(మనోబాల‌) చుట్టూ ఉన్న సీన్స్ కూడా  ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తాయి. అరవ కామెడీ తెలుగు వాళ్లకి పెద్దగా నచ్చకపోవచ్చు కానీ సంతానం విడాకుల కేసు నుంచి, స్క్రీన్ పై కనిపిస్తే చాలు పంచ్ డైలాగ్స్, నవ్వులు ఉంటాయి. శృతి మించిన కామెడీ కొంచెం అసహనానికి గురిచేస్తుంది. హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసం పెట్టారు తప్ప పెద్దగా నటనకి స్కోప్ లేదు. తెలుగు న‌టులున్నా డ‌బ్బింగ్ వారిది కాకపోవటం ఓన్ చేసుకోలేము. డబ్బింగ్ కూడా కుదరలేదు. కొన్ని చోట్ల తెలుగు పేర్లు, కొన్ని చోట్ల తమిళ పేర్లు కనిపిస్తాయి. తమిళంలో హిట్ అయ్యింది కనక తెలుగులో కూడా వసూళ్లు బాగుంటాయని ఆశపడి తెలుగులో రిలీజ్ చేసారు. పైగా ఈ వారం తెలుగులో ఏ సినిమాలు రిలీజ్ కాకపోవటంతో మదగజరాజకి ప్లస్ అయ్యింది.

నటీ నటులు:

విశాల్ నటనకి వంకలు పెట్టాల్సిన పనిలేదు. తన రొటీన్ జోనర్ కావటంతో ఈజీగా ఉంది విశాల్ నటన. యాక్ష‌న్ సీన్స్ లో మంచి ఎనర్జిటిక్ గా కనిపించాడు విశాల్. రొమాంటిక్ సీన్స్ లో కూడా మెచ్యూర్డ్ గా నటించాడు. ఇద్దరి హీరోయిన్స్ తో విశాల్ కెమిస్ట్రీ  బాగా వర్కౌట్ అయ్యింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ గ్లామర్ ఒలికించింది. అంజ‌లి నటన హుందాగా ఉంది. తన అందంతో ఆకట్టుకుంటుంది. వీరిద్దరికి నటనకి పెద్దగా ఆస్కారం లేదు. సోనూసూద్ విలన్ గా అద్భుతంగా నటించాడు. క్లైమాక్స్ లో సోను నటన బాగుంది. సంతానం, మనోబాల కామెడీ సినిమాకి ప్లస్. మిగతా నటీనటులు వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ :

12  ఏళ్ళ క్రితం దర్శకుడి ఆలోచనలోంచి పుట్టిన ఈ కథ కూడా అలాగే ఉంది. అసలు కొత్తదనం లేదు. కథ అంటూ ఏం లేదు. కామెడీ తప్ప. అప్పటి సినిమాని నమ్మకంగా ఇప్పుడు రిలీజ్ చేయటాన్ని మెచ్చు కోకుండా ఉండలేం. మేకర్స్ ప్రయత్నాలు ఫలించి తమిళంలో వసూళ్లు రావటంతో తెలుగులో రిలీజ్ చేసారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరులో ఉన్న తెలుగు ప్రేక్షకులకి 'మదగజరాజా' అంతగా నచ్చకపోవచ్చు. ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీ గా ఉన్న విజయ్ ఆంటోని ఈ మూవీ అందించిన సంగీతం బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యింది. పాటలు పరవాలేదనిపించాయ్. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫి పరవాలేదు. ప్రవీణ్ కేఎల్, ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

విశాల్
సంతానం, మనోబాల
కామెడీ
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్

డబ్బింగ్
లాజిక్స్ మిస్సింగ్
రొటీన్ కథ

ఫైనల్ వర్దిక్ట్ : లాజిక్స్ లేని మ్యాజిక్ మూవీ 'మదగజరాజా'


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS