నటీనటులు: మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు.
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాతలు: దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్: కే యూ మోహనన్
ఎడిటర్: కే ఎల్ ప్రవీణ్
విడుదల తేదీ: మే 09, 2019
రేటింగ్: 3.25/ 5
శ్రీమంతుడు, భరత్ అనే నేను.... కమర్షియాలిటీకి సోషల్ మెసేజ్ తోడైతే ఎంత బాగుంటుందో చెప్పిన సినిమాలవి. వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టించాయి. విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాయి. ఈ మేళవింపు మహేష్‌బాబుకి బాగా నచ్చేసి ఉంటుంది. అందుకే తన 25వ సినిమాగా అలాంటి కథనే ఎంచుకున్నాడు. స్నేహం, రైతు సమస్య.. ఈ రెండింటినీ, తనదైన మార్క్, తన సినిమాలో ఉండాల్సిన కమర్షియాలిటీ మిక్స్ చేసి... `మహర్షి`గా అల్లుకున్నాడు. మరి ఈ కాంబినేషన్ మళ్లీ వర్కవుట్ అయ్యిందా? `మహర్షి` కమర్షియల్‌గా ఎలా ఉంది? విమర్శకుల ప్రశంసలు దక్కే అవకాశం ఎంత వరకూ ఉంది?
* కథ
రిషి (మహేష్ బాబు)కి గెలవడం తప్ప, ఓడిపోవడం ఇష్టం లేదు. తన తండ్రిలా తన జీవితం కాకూడదని, జీవితంలో ఎప్పుడూ ఓడిపోకూడదని కసిగా బతికేస్తుంటాడు. ఐఐటీ క్యాంపస్ లో రవి (నరేష్), పూజ (పూజా హెగ్డే)లు మంచి స్నేహితులు అవుతారు. అన్ని సెమిస్టర్లలోనూ ఫస్ట్ ర్యాంకుతో పాసైన రిషికి అమెరికాలో ఉద్యోగం వస్తుంది. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలో సీఈఓ అవుతాడు. ఓ సందర్భంలో తన పాత స్నేహితులందరినీ కలుసుకున్న రిషికి రవికి సంబంధించిన ఓ నిజం తెలుస్తుంది. రవి కోసం అమెరికాని, ఉద్యోగాన్ని వదలి రామాపురం అనే ఓ పల్లెటూరికి వెళ్లాల్సివస్తుంది. మరి రవి కోసం రిషి ఎందుకంత రిస్క్ చేశాడు? ఆ ఊరెళ్లాక రిషికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే `మహర్షి` కథ.
* నటీనటులు
మహేష్ నటనకు వంక పెట్టలేం. చాలా అందంగా ఉన్నాడు. కానీ కొన్ని చోట్ల బిగుసుకుపోయినట్టు నటించాడు. తన డ్రస్సింగ్ స్టైల్ బాగుంది. పూజాది నామ మాత్రపు పాత్రే. అసలు పూజ - రిషి దూరం అయిపోవడానికి సరైన కారణమే చూపించలేదు. నరేష్‌కి మంచి పాత్ర దక్కింది. ఆ పాత్రకున్న నిడివి కూడా ఎక్కువే. జగపతిబాబుని మరోసారి స్టైలీష్ విలన్ గా చూపించారు. రావు రమేష్, వెన్నెల కిషోర్, జయసుధ, ప్రకాష్‌రాజ్, నాజర్.. వీళ్లందరివీ చిన్న చిన్న పాత్రలే.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్‌లో ఉంది. కెమెరా పనితనం అబ్బుర పరుస్తుంది. సినిమాని వీలైనంత స్టైలీష్‌గా తీసే ప్రయత్నం చేశారు. పదర పదర పదరా పాట ఆకట్టుకుంటుంది. మాస్ పాటలో ఏమాత్రం ఊపు లేదు. నేపథ్య సంగీతంలో మాత్రం దేవి పనితనం చూపించాడు. దర్శకుడు ఎంచుకున్న కథకు స్పాన్ ఎక్కువ. దాంతో పాటు... అనవసరమైన సన్నివేశాలతో మరింత లాగ్ చేసే ప్రయత్నం చేశాడు. సుదీర్ఘంగా సాగే స్పీచ్‌లు బోర్ కొట్టిస్తాయి.
* విశ్లేషణ
స్నేహం గొప్పదనం చెబుతూ, రైతుల సమస్యని తెరపై చూపిస్తూ, మధ్యమధ్యలో మహేష్ అభిమానులకు కావల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఒకొక్కటిగా మేళవిస్తూ సాగిన సినిమా ఇది. తొలి సగం కాలేజీ నేపథ్యంలో సాగితే రెండో సగం రామాపురం షిఫ్ట్ అవుతుంది. తొలి సగంలో...విద్యావ్యవస్థ, రెండో సగంలో.. రైతుల సమస్య - మహర్షి కీ పాయింట్స్ అయ్యాయి. ఓ మధ్యతరగతి నుంచి వచ్చిన కుర్రాడు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కంపెనీకి సీఈఓగా ఎలా మారాడు? అక్కడి నుంచి రామాపురం ఎందుకొచ్చాడు? అనే పాయింట్ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. కాలేజీ సన్నివేశాలు బాగా అలరిస్తాయి. మహేష్ - నరేష్‌ల మధ్య బాండింగ్ బాగా చూపించారు. విశ్రాంతి ఘట్టం ముందు కథ మలుపుతిరుగుతుంది. తన జీవితానికీ, విజయానికీ కారణమైన స్నేహితుడి రుణం తీర్చుకోవడానికి రిషి ఏం చేశాడన్నది ద్వితీయార్థంలో చూపించారు.
సెకండాఫ్ మొత్తం రైతు సమస్యలపైనే ఫోకస్ చేశారు. శ్రీమంతుడు సినిమాలోలానే ఓ ఊర్లో అడుగుపెట్టిన మహేష్.. ఆ ఊరి రైతుల కోసం ఏం చేశాడన్న పాయింట్‌పైనే ద్వితీయార్థం నడుస్తుంది. పతాక సన్నివేశాల్లోనూ యాక్షన్ కంటే ఎమోషన్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు దర్శకుడు. వ్యవసాయానికి, అన్నం పెట్టే రైతుకి విలువ ఇవ్వాలని, రైతుని సానుభూతితో కాకుండా, గౌరవంతో చూడాలని ఓ సందేశాన్ని అందించాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలు, సంభాషణలు ఆలోచింపజేస్తాయి. అయితే... ప్రతీ సన్నివేశం నిదానంగా సాగడం, సినిమా అంతా ఒకే ఒక్క పాయింట్ చుట్టూ తిరుగుతుండడం, ఊహకి అందని విషయాలు తెరపై జరిగిపోతుండడం..ఇవన్నీ బోర్ కొట్టిస్తాయి.
సినిమా ఎంతకీ అయిపోదేంటి? అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సన్నివేశాల్ని కుదించే అవకాశం ఉన్నా.. దర్శకుడు పట్టించుకోలేదు. ద్వితీయార్థంలో కథానాయిక పాత్ర పూర్తిగా నామమాత్రం అయిపోతుంది. కథానాయకుడ్ని అపార్థం చేసుకోవడానికి తప్ప... ఆ పాత్రకు పెద్దగా పని ఉండదు. కథలోనూ కొన్ని తప్పులు దొర్లుతాయి. ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడ్ని చిన్న గొడవతో రిషి ఎలా దూరం చేసుకున్నాడు? ఓ కంపెనీకి సీఈఓ అయిన తరవాత కూడా రవి గురించి రిషి ఎందుకు ఆరా తీయలేదు? కనీసం మాట్లాడుకోనంత తప్పు నాన్న ఏం చేశాడు? అనేవి ప్రశ్నలుగా మిగిలిపోతాయి.
* ప్లస్ పాయింట్స్
+ మహేష్ నటన
+ నరేష్‌తో ఫ్రెండ్ షిప్ సీన్లు
+ భారీదనం
* మైనస్ పాయింట్స్
- నిడివి
- ఎమోషన్ మిస్ అవ్వడం
* ఫైనల్ వర్డిక్ట్: సుదీర్ఘంగా సాగిన రిషి ప్రయాణం
- రివ్యూ రాసింది శ్రీ.