నటీనటులు: ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి తదితరులు
దర్శకత్వం: రాజ్ ఆర్
నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి
సంగీతం: మార్క్ కె.రాబిన్
సినిమాటోగ్రఫర్: బాలు శాండిల్యాస
విడుదల తేదీ: జూన్ 21, 2019
రేటింగ్: 3/5
``గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో``
- అన్నారు దాశరథి.
మనం చదివిందే చరిత్ర, తెలుసుకున్నదే జీవితం కాదు. మనకు ఎదురుగాని గొప్ప మనుషులు, గొప్ప జీవితాలూ చాలా ఉంటాయి.
కొన్ని గొప్ప కథలు చరిత్రకు ఎక్కలేదు. కొన్ని గొప్ప జీవితాలు ఏ కథా చెప్పలేదు. అలాంటి కథల్లో ఒకటి చింతకింది మల్లేశం జీవితం.
ఆయన చదివింది ఆరో తరగతే. కానీ ఇంజనీరింగ్ పట్టభద్రులకూ అర్థం కాని `ఆసు` యంత్రాన్ని కనిపెట్టి చేనేత రంగానికి ఎంతో సేవ చేసిన ఘనుడు మల్లేశం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. ఆయన కథే ఇప్పుడు `మల్లేశం`గా రూపుదిద్దుకుంది. మరి ఈ మల్లేశం చేనేత కార్మికులకు ఇచ్చిన వరం ఏమిటి? ఆయన కథని ఎందుకు తెలుసుకోవాలి? అసలింతకీ ఈ బయోపిక్ ఎలా ఉంది?
* కథ
మల్లేశం (ప్రియదర్శి)కి తన తల్లి లక్ష్మి (ఝాన్సీ) అంటే ఎంతో ప్రేమ. ఉదయం నుంచి రాత్రి వరకూ మగ్గంతో కుస్తీ పడుతుంటుంది లక్ష్మి. కష్టాన్ని చూడలేక ఆమెకేదోలా సహాయం చేద్దామనుకుంటాడు. మగ్గం చేసే పని ఓ యత్రం చేస్తే ఎలా ఉంటుంది? అమ్మకి శ్రమ తప్పుతుంది కదా అనే ఆలోచన వస్తుంది. అప్పటి నుంచీ ఆసు యంత్రం కనుక్కోవాలన్న తపన మొదలవుతుంది. తన జీవితం మొత్తం ఈ యంత్రం కనుక్కోవడానికే కేటాయిస్తాడు మల్లేశం. మధ్యలో ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ తట్టుకుని స్నేహితులు, భార్య అందించిన సహకారంతో.. తన ఆరో తరగతి తెలివితేటలతో ఏం సాధించడాన్నదే కథ.
* నటీనటులు
ప్రియదర్శిని కేవలం హాస్యనటుడిగానే చూశాం. తనలోని పరిపూర్ణ నటుడు ఈ సినిమాతో కనిపిస్తాడు. అన్ని రకాల ఎమోషన్లనీ చక్కగా పండించాడు. అల్లరి, పంతం, అమాయకత్వం, పౌరుషం.. ఇలా అన్నీ ఆ పాత్రలో కనిపిస్తాయి. ఝాన్సీది కీలకమైన పాత్ర. అమ్మగా ఒదిగిపోయింది. అనన్య నటన కూడా అత్యంత సహజసిద్ధంగా ఉంది. ఏ పాత్ర చూసినా. ఆ పాత్రే కనిపిస్తుంది తప్ప, నటీనటులు కనిపించరు. ప్రతీ పాత్రకూ కొత్త వాళ్లని తీసుకోవడం వల్ల ఏ పాత్రకూ ఇమేజ్ అడ్డం రాలేదు.
* సాంకేతిక వర్గం
ఇలాంటి కథల్ని సినిమాలుగా తీయాలంటే నిర్మాతలకు చాలా ధైర్యం ఉండాలి. దర్శకుడికి ఓ అభిరుచి ఉండాలి. అవి రెండూ ఈ దర్శక నిర్మాతలకు ఉన్నాయి. అందుకే ఎవ్వరికీ పట్టని ఓ పద్మశ్రీ గ్రహీత కథ తెరపైకొచ్చింది. ఎక్కడా కమర్షియల్ సూత్రాలకు లొంగిపోకుండా ఈ కథని నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశారు. మాటలు, సన్నివేశాలు చాలా సహజంగా ఉన్నాయి. పాటలూ ఆకట్టుకుంటాయి. ఆనాటి వాతావరణాన్ని తెరపై ప్రతిబింబించేందుకు చేసిన కృషి ప్రసంశనీయం.
* విశ్లేషణ
ఓ విజేత కథలనే బయోపిక్‌లుగా తీస్తుంటారు. మల్లేశం కూడా విజేతే. ఆరో క్లాసు చదివిన కుర్రాడు - అసు యంత్రాన్ని కనిపెట్టడం నిజంగా ఓ అద్భుతం. అయితే.. అది కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు మూడు ముక్కల్లో జరిగిపోలేదు. అందుకోసం ఎన్నో కష్టనష్టాల్ని అనుభవించాల్సివచ్చింది. అదంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. కేవలం ఆసు యంత్రం, వాటి కోసం మల్లేశం పడిన శ్రమ మాత్రమే ఈ సినిమా కాదు. అంతకు మించిన అంశాలూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తల్లిమీద మల్లేశంకు ఉన్న ప్రేమ. ఆ ప్రేమే ఓ యంత్రం కనిపెట్టాలన్న ఆలోచనకు బీజం వేసింది. రెండోది భార్యాభర్తల అనుబంధం. ఇందులో మల్లేశం ప్రేమకథ, తన భార్య కథ తప్పకుండా కదిలిస్తుంది. ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకూడదు, ఆత్మహత్య అస్సలు చేసుకోకూడదు, ప్రయత్నిస్తే మరో మార్గం దొరక్కపోదు అన్న సందేశాన్ని అందించింది మల్లేశం.
ఆసు యంత్రం కనుక్కునే ప్రయత్నంలో మల్లేశం చాలాసార్లు ఓడిపోయాడు. ఇంట్లో వాళ్లూ, స్నేహితులు `ఇకనైనా ఇలాంటి ప్రయత్నాలు ఆపేయ్` అంటారు. అంతెందుకు..? థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు కూడా `ఇన్నిసార్లు ఎందుకు ప్రయత్నించడం` అనిపిస్తుంది. అన్ని అవమానాలు మోసి, విజేతగా నిలబడడం మామూలు విషయం కాదు. ఈ కథని.. తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ సంస్కృతిని మళితం చేస్తూ తీయడం గొప్ప విషయం అనుకోవాలి. పాతిక ముఫ్ఫై ఏళ్ల క్రితం కథ ఇది. దర్శకుడు తన టేకింగ్‌తో ఆనాటి రోజుల్లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిపోయాడు. మల్లేశం బాల్యం, స్నేహితులతో ఆడిన ఆటలు, చిరంజీవి సినిమా చూడడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సరదాగా అనిపిస్తాయి.
మల్లేశం ప్రేమకథ కూడా హృద్యంగా ఉంది. పట్టణంలో తను పడిన కష్టాలు చూస్తే గుండెలు బరువెక్కిపోతాయి. పాటలు, మాటలు అలరిస్తుంటాయి. ఇలా అన్ని ఎమోషన్లూ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. కాకపోతే ద్వితీయార్థం కాస్త ఇబ్బంది పెడుతుంది. సూటిగా చెప్పాల్సిన విషయాన్ని కూడాసుదీర్ఘంగా చెప్పడంతో బోర్ కొడుతుంది. సెమీ డాక్యుమెంటరీ లక్షణాలు చాలా సన్నివేశాల్లో కనిపిస్తాయి. ఆసు యంత్రం గురించి, చేనేత కార్మికుల పనితీరు గురించి తెలిసినవాళ్లు బాగా కనెక్ట్ అయినా, తెలియనివాళ్లకు అది కూడా ఓ సైన్స్‌లా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని లోపాలు, సర్దుబాట్లు, లోట్లు ఉన్నా - మల్లేశం ప్రయత్నం మాత్రం విజయవంతమైంది.
* ప్లస్ పాయింట్స్
+ కథ
+ నటీనటులు
* మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: మల్లేశం... ఓ అసామాన్యుడి కథ
- రివ్యూ రాసింది శ్రీ.