మొన్న ఎన్టీఆర్ - రామ్‌చరణ్, గోపీచంద్, వరుణ్ సందేశ్ నిన్న సందీప్‌కిషన్, శర్వానంద్, నాగశౌర్య!
చిత్రసీమకు ఏదో అయ్యింది. దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. లవ్ స్టోరీలు, ఫ్యాక్షన్ స్టోరీలూ వరుసకట్టినట్టు - ఇప్పుడు `గాయాలు` కూడా క్యూ కట్టేసి, అదో ట్రెండ్‌గా మారిపోయినట్టుంది. కొంతమంది షూటింగ్‌లో దెబ్బలు తింటుంటే, ఇంకొంతమంది రోడ్డు ప్రమాదానికి గురై - గాయాలపాలవుతున్నారు. యువ హీరోలు ప్రమాదాల బారీన పడడం టాలీవుడ్‌ని కలవరపాటుకి గురి చేస్తోంది. హీరోల కెరీర్‌కీ, చాలా సినిమాలకు ఈ గాయాలు స్పీడ్ బ్రేకర్లుగా మారిపోతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ కోసం కసరత్తులు మొదలెట్టిన రామ్‌చరణ్ కి ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ రామ్ చరణ్ గాయపడ్డాడు. దాంతో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఆగిపోయింది.
మరోవైపు ఎన్టీఆర్ కూడా ఓ యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు చేతికి దెబ్బ తగిలించుకున్నాడు. అలా.. రాజమౌళి హీరోలిద్దరూ అనూహ్యంగా షూటింగ్‌కి దూరమయ్యారు. వారిద్దరూ కోలుకుని మళ్లీ షూటింగ్ మొదలెట్టిన లోగా.. మరికొంతమంది యువ కథానాయకులు గాయాల జాబితాల చేరిపోయారు. శర్వానంద్ స్కై డైవింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. తన భుజానికి ఆపరేషన్ కూడా చేయాల్సివచ్చింది. ఇప్పుడు శర్వా రెండు నెలల పాటు షూటింగులకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో శర్వా చేతిలోని సినిమాలు ఆగిపోయాయి. `96` రీమేక్‌కి అర్థాంతరంగా పేకప్ చెప్పాల్సివచ్చింది. `రణరంగం` కూడా అంతే. శర్వా కోలుకునేంత వరకూ ఈ రెండు సినిమాలకూ కామా పెట్టాల్సిందే. ఓ సినిమా షూటింగ్ ఆగిపోతే ఎంత నష్టమో ఆలోచించుకోవాలి. అనుకున్న సమయానికి సినిమా రాదు. ముందే ఫిక్సయిన కాల్షీట్లన్నీ తారుమారు అయిపోతాయి.
హీరో కోలుకుని సెట్లోకి అడుగుపెట్టినా - కాంబినేషన్ యాక్టర్లు దొరకడం కష్టమైపోతారు. దాంతో షూటింగ్ సవ్యంగా నడవదు. రిలీజులకు సమయం పట్టేస్తుంది. అప్పుల మీద వడ్డీలు పెరుగుతుంటాయి. నిర్మాతలకు ఇది భరించలేని భారంగా తయారవుతుంది. సందీప్ కిషన్ కూడా ఇలానే ఫైట్ సీన్లో గాయపడ్డాడు. తన మొహానికి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. అదే కంట్లో గుచ్చుకుంటే ఏమయ్యేది? వాళ్ల ప్రాణాలు, కెరీర్.. రిస్కులో పడినట్టే కదా?? సందీప్ కోలుకున్నా - మొహంపై గాట్లు, మచ్చలు పోవడానికి టైమ్ పడుతుంది. ఈలోగా షూటింగ్ జరగదు. మళ్లీ సెట్లో అడుగుపెట్టినా ఇదివరకటిలా ఆత్మ విశ్వాసంతో షూటింగ్ చేయలేడు.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన నిర్ణక్ష్యమో, ఎదుటి వాడి తప్పిదమో... ఏమైనా కావొచ్చు. ప్రమాదం ఏ రూపంలో అయినా పొంచి ఉండొచ్చు. హీరోలు, హీరోయిన్లు... ఆ మాటకొస్తే అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. సాంకేతిక నైపుణ్యం పెరిగిన రోజులివి. ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన సౌకర్యాలు, సౌలభ్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. వీలైనంత వరకూ రిస్కులు తగ్గించుకోవాలి. లేదంటే నటీనటుల కెరీయర్లే కాదు, జీవితాలూ రోడ్డున పడతాయి. సినిమాలకూ తీరని నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంలో యువ కథానాయకులు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే.