మనసుకు నచ్చింది మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా, పునర్ణవి, ప్రియదర్శి, అభయ్ తదితరలు
నిర్మాణ సంస్థ: ఆనంది ఆర్ట్స్ & ఇందిరా ప్రొడక్షన్స్
ఛాయాగ్రహణం:రవి యాదవ్
సంగీతం: రధన్
నిర్మాతలు: జెమిని కిరణ్ & సంజయ్
రచన-దర్శకత్వం: మంజుల

రేటింగ్: 2/5

మార్పు అనేది ఎప్పుడూ కొత్త‌వాళ్ల‌తోనే సాధ్యం. కొత్త‌గా మెగాఫోన్ ప‌ట్టేవారైనా, సినిమాలు తీసేవాళ్ల‌యినా.... త‌ప్ప‌కుండా కొత్త ఆలోచ‌న‌ల‌తో రావాలి. లేదంటే... వాళ్ల ప్ర‌య‌త్నానికి అర్థ‌మే ఉండ‌దు.  ఇప్పుడు మంజుల ఘ‌ట్ట‌మ‌నేని కూడా కొత్త‌గా మెగా ఫోన్ ప‌ట్టింది. న‌టిగా ఎలా ఉన్నా, నిర్మాత‌గా ఆమె స‌క్సెస్ కొట్టింది. ఇంట్లో విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులు, జీవితాలు క‌నిపిస్తున్నాయి కూడా. మ‌రి ఈమె కొత్త రంగంలో స‌క్సెస్ అయ్యిందా?  క‌నీసం కొత్త ఆలోచ‌న‌తో అయినా వ‌చ్చిందా?

* క‌థ‌

సూర‌జ్ (సందీప్ కిష‌న్‌) నిత్య (అమైరా ద‌స్తూర్‌) బావా మ‌ర‌ద‌ళ్లు. వాళ్లిద్ద‌రికీ పెళ్లి చేయాల‌ని ఇంట్లోవాళ్లు అనుకుంటారు. పెళ్లి ఫిక్స‌వుతుంది. అయితే పెళ్లి పీట‌లపై నుంచి సూర‌జ్‌, నిత్య ఇద్ద‌రూ పారిపోతారు. గోవాలో త‌మ‌కు న‌చ్చినట్టుంటూ... జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. త‌మ‌కు న‌చ్చిన జీవిత భాగ‌స్వామిని ఎంచుకోవాల‌నుకుంటారు. సూర‌జ్‌కి నిక్కి (త్రిధా చౌద‌రి) ప‌రిచ‌యం అవుతుంది. త‌న‌ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు సూర‌జ్‌. కానీ అదే స‌మ‌యంలో సూరజ్‌పై త‌న‌కున్న‌ది ఇష్టం కాదు, ప్రేమ అనే సంగ‌తి అర్థ‌మ‌వుతుంది నిత్య‌కు. మ‌రి... సూర‌జ్‌, నిత్య‌లు క‌లుసుకున్నారా, లేదా?  అనేదే క‌థ‌. 

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

సందీప్‌ కిష‌న్‌కి హిట్టు ప‌డి చాలా కాల‌మైంది. మ‌రోసారి త‌న‌కు నిరాశ త‌ప్ప‌దు. న‌టుడిగా ఎప్పుడూ సందీప్‌కి మైన‌స్ మార్కులు ప‌డ‌వు. ఆ లోటు కూడా ఈసినిమా తీర్చొచ్చు. కొన్ని చోట్ల మ‌రీ ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్న‌ట్టు అనిపిస్తుంది.

అమైరా ద‌స్తూర్ చూడ్డానికి బాగుంది. మంచి హైటు. కాక‌పోతే త‌న ఎక్స్‌ప్రెష‌న్స్ కూడా మ‌రీ ఓవ‌ర్ గా అనిపిస్తున్నాయి. త్రిదా గ్లామ‌ర్‌గా క‌నిపించింది. ఓ షాట్‌లో బికినీ వేసి మురిపించింది. 

నాజ‌ర్ త‌న అనుభ‌వాన్ని రంగ‌రించాడు. ప్రియ‌ద‌ర్శి ఉన్నా న‌వ్వులు పండ‌లేదు. మంజుల కుమార్తె  జాహ్న‌వి ఓ పాత్ర‌లో క‌నిపించింది. త‌న న‌ట‌న ఓకే అనిపిస్తుంది మిగిలిన వాళ్లెవ‌రికీ అంత ఛాన్స్ లేదు.

* విశ్లేష‌ణ‌

ఇది నువ్వేకావాలి టైపు ప్రేమ క‌థ‌.  స్నేహితులు ప్రేమికులుగా మార‌డ‌మే కాన్సెప్ట్‌. అయితే దాన్ని అలా తీసినా బాగుండేది.  పాత క‌థై అయినా, ఆ ఫీల్ అయినా ఎంజాయ్ చేసేవారు. కానీ... ఈ క‌థ‌కు ప్ర‌కృతి, మ‌న‌సు, ఇన్న‌ర్ సోల్‌... అంటూ ఏవేవో కాన్సెప్టులు క‌లిపి కిచిడీ చేసేశారు. తొలి సన్నివేశాలు చూస్తే ఇదేదో యోగా క్లాసుకో, మెడిటేష‌న్ క్లాసుకో వెళ్లిన‌ట్టు అనిపిస్తుంది. ఏ స‌న్నివేశంలోనూ కొత్త‌ద‌నం క‌నిపించదు. దానికి తోడు న‌టీన‌టుల ఓవ‌ర్ యాక్టింగ్ ఇంకా న‌స పెడుతుంది. తొలి స‌న్నివేశం చూస్తే.. చాలు. ఈ క‌థ‌.. చివ‌రికి ఏమ‌వుతుందో అర్థ‌మైపోతుంది. దాని కోసం రెండున్నర గంట‌లు కూర్చోబెట్టారు.  

ఈ క‌థ‌లో ప్రేమ ఉన్నా, అందులో డెప్త్ లేదు. ప్ర‌కృతి క‌నిపిస్తున్నా, అందులో ర‌మ‌ణీయ‌త లేదు. ప్ర‌ధ‌మార్థంతో పోలిస్తే ద్వితీయార్థం ఇంకా భారంగా సాగుతుంది. క‌థేమీ లేని ఓచోట ఎన్ని మ్యాజిక్కులు చేసినా ఫ‌లితం ఉండ‌ద‌న్న విష‌యం ఈసినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. ద్వితీయార్థంలో ఆ మ్యాజిక్కులు కూడా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. రొటీన్ స్క్రీన్‌ప్లే, రొటీన్ క్లైమాక్స్ ఈ సినిమాని మ‌రింత ఇబ్బంది పెడ‌తాయి. మెగా ఫోన్ ప‌డుతున్న న‌వ‌త‌రం.. క‌చ్చితంగా కొత్త క‌థ‌ల‌తోనే వ‌స్తార‌న్న గ్యారెంటీ లేదు... అని చెప్ప‌డానికి ఈ సినిమాని ఓ ఉదాహ‌ర‌ణ‌గా చూపించొచ్చు.

* సాంకేతిక వ‌ర్గం

ర‌ధ‌న్ పాట‌లు బాగున్నాయి. వాటిని బాగా పిక్చ‌రైజ్ చేశారు. బుర్రా సాయిమాధ‌వ్ క‌లం ఈసారెందుకో అంత‌గా ప‌రిగెట్ట‌లేదు. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంది. ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌ని అందంగా చూపించారు. గోవా బీచ్ మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించేలా తీశారు. మంజుల రాసుకున్న క‌థ‌లో ఏమాత్రం కొత్త‌ద‌నం లేదు. తీత కూడా అలానే ఉంది.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ సంగీతం
+ కెమెరా

* మైన‌స్‌ పాయింట్స్

- రొటీన్ క‌థ‌
- స్లో నేరేష‌న్‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  మ‌న‌కు న‌చ్చ‌డం క‌ష్టం

రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS