తారాగణం: రాజా గౌతమ్, చాందిని చౌదరి తదితరులు
ఛాయాగ్రహణం: విశ్వనాద్ రెడ్డి
సంగీతం: నరేష్ కుమార్
దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
రేటింగ్: 2/5
ఇదొక అబ్‌స్ట్రాక్ట్ ప్రపంచం. అంత ఈజీగా అర్థంకాదు. ఇందులో అనేకమైన ఇంటర్‌ప్రిటేషన్ (భిన్న వ్యాఖ్యానాలు) ఉంటాయి...అన్నది సినిమాలో ఓ డైలాగ్. అందుకు తగినట్లుగానే సామాన్య ప్రేక్షకుడికి ఓ పట్టాన అంతుచిక్కని అబ్‌స్ట్రాక్ట్ సజ్జెక్ట్ ఇది.
దర్శకుడి మేథస్సు స్థాయిలోకి వెళ్లి ఆ ప్లేన్‌లో ఆలోచించగలిగినప్పుడు మాత్రమే ఈ కథను అర్థం చేసుకోగలం. ఈ మర్డర్ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్‌లో అడుగడుగునా మలుపులు, అనూహ్య పాత్ర చిత్రణలు కనిపిస్తాయి. మధురం అనే లఘ చిత్రం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఫణీంద్ర నర్సెట్టి క్రౌడ్ ఫండింగ్ విధానంలో ఈ సినిమాను రూపొందించారు. మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో విభిన్న కథాంశంతో తెరకెక్కిన మను ప్రేక్షకుల్నిఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఓ సారి కథలోకి వెళ్లాల్సిందే..
కథ
మను (రాజా గౌతమ్) ఓ చిత్రకారుడు. ఒంటరితనమన్నా, నలుపు రంగు అన్నా చాలా ఇష్టం. తనలోని ఆవేదనలకు , తీరని ఆశలకు నలుపును ప్రతీకలా భావిస్తుంటాడు. తనదైన ఓ ప్రపంచంలో జీవిస్తుంటాడు. అతనికి నీలా (చాందిని చౌదరి) పరిచయమవుతుంది. ఆమెకు ఫొటోగ్రఫీ, సంగీతం అంటే మక్కువ. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు.
ఇంతలో వజ్రాల వ్యాపారి వద్ద పనిచేసే నీలా తండ్రి హత్యకు గురవుతాడు. అందుకు కారణం ఎవరు? ఆ హత్యకు కారణమైన వారు అనూహ్యంగా నీలా ఇంటిలో అద్దెకు ఎందుకు వస్తారు? ఈ క్రమంలో ఏం జరిగింది? తన తండ్రిని చంపిన వారిపై నీలా ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? అన్నదే చిత్ర కథ.
నటీనటులు
సుదీర్ఘ విరామం తర్వాత సినిమా చేసిన రాజా గౌతమ్ మను పాత్రలో ఒదిగిపోయారు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. నీలా పాత్రలో చాందిని చౌదరి అందంగా కనిపించింది. భావోద్వేగభరితమైన పాత్రలో మెప్పించింది. మిగతా పాత్రలు ఫర్వాలేదనిపించాయి.
విశ్లేషణ...
సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక రివేంజ్ థ్రిల్లర్. దీనికి అబ్‌స్ట్రాక్ట్ భావనలను జోడించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ కథ ఏ టైమ్ పీరియడ్‌లో నడుస్తుందో చూపించలేదు. నాయకానాయికలు ఎనభైలకాలం నాటి డయలర్ ఫోన్‌లలో సంభాషిస్తుంటారు. కథలోని పాత్రలు తప్ప బాహ్య ప్రపంచం ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు.
సాధారణంగా మర్టర్ మిస్టరీ థ్రిల్లర్‌ను ఫాస్ట్‌ఫేస్‌లో నడిపించాలి. కానీ ఈ సినిమా ఆసాంతం మందగమనంతో సాగుతుంది. మర్డర్, మిస్టరీ అంశాలు ఏమంత థ్రిల్లింగ్‌గా అనిపించవు. నాయకానాయికల అభిరుచుల్ని ప్రతిబింబించే ఫొటోగ్రఫీ, పెయింటింగ్, ఆర్ట్ వర్క్‌లపై ఎక్కువగా దృష్టిపెట్డడంతో కథను సాగతీస్తున్నారనే భావన కలుగుతుంది. నాయకానాయికల మధ్య లవ్‌ట్రాక్‌ను సుదీర్ఘంగా నడిపించారు. ఆ సన్నివేశాల్లో పొయెటిక్ సంభాషణలు తప్ప ఎక్కడా భావోద్వేగాలు కనిపించలేదు.
ద్వితీయార్థంలో మను, నీలా పాత్రల తాలూకు సస్పెన్స్ వీడిన తర్వాత కథ ఏమాత్రం ఆకట్టుకునేలా అనిపించదు. ప్రతీకార కథలో ఆత్మ అనే పాయింట్ చాలా పాతదే. ఇందులో అదే అంశాన్ని మను, నీలా పాత్రలకు ఆపాదించి సస్పెన్స్‌ను క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదొక అజరామర ప్రేమకథ అంటూ సినిమాను ముగించారు. అయితే దానిని జస్టిఫై చేసే బలమైన అంశాలు ఒక్కటీ కనిపించలేదు.
క్లైమాక్స్ ఘట్టాల్లో మను, నీలా బొమ్మలను రేడియంతో డిజైన్ చేయడం, వాటికి నలుపురంగు పులమడం, మృతదేహాల్లోకి ద్రావణాల్నిఎక్కించడం..అసంబద్ధంగా అనిపిస్తాయి. మొత్తంగా ఈ సినిమా ఆద్యంతం అనేకానేక నైరూప్య భావనల (అబ్‌స్ట్రాక్ట్ ఫీలింగ్స్) సమాహారంగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ సాగుతుంది.
సాంకేతిక వర్గం
విశ్వనాథ్ రెడ్డి ఫొటోగ్రఫీ బాగుంది. సీన్ మూడ్‌ను ప్రతిబింబించేలా కలరింగ్ బాగా కుదిరింది. నరేష్‌కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకే థీమ్‌తో సాగుతూ ఆకట్టుకుంది. చిన్న బడ్జెట్‌లో అయినా సాంకేతికంగా మంచి నాణ్యత కనిపించింది. అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌లోని భావం అర్థం కాకపోయినా చూడటానికి బాగుంటుంది. అయితే అవే అబ్‌స్ట్రాక్ట్ అలోచనలను తెరపైకి తీసుకొస్తే ప్రేక్షకులు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆడియన్స్ సినిమా కోసం తమ మేథాశక్తిని పణంగా పెట్టలేరు. మను సినిమా చూసిన ప్రేక్షకులకు ఇదే భావన కలుగుతుందనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్
+ డైలాగులు
+ కొన్ని సీన్లు
మైనస్ పాయింట్స్
- నిడివి
- అర్థం కాని సన్నివేశాలు
ఫైనల్ వర్డిక్ట్: మను... కన్‌ఫ్యూజ్ థ్రిల్లర్.
రివ్యూ రాసింది శ్రీ