మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: మారుతి నగర్ సుబ్రమణ్యం
దర్శకత్వం: లక్ష్మణ్‌ కార్య
కథ - రచన: లక్ష్మణ్‌ కార్య 


నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, రమ్య పసుపులేటి, అంకిత్ కొయ్య , హర్ష వర్ధన్, అజయ్, ప్రవీణ్ , అన్నపూర్ణమ్మ      


నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి


బ్యానర్: పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్
విడుదల తేదీ: 23 ఆగస్టు 2024
 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5


మారుతీ నగర్ సుబ్రమణ్యం సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ లో క్యురియాసిటీ పెంచింది. రావు రమేష్ ప్రధాన పాత్రధారి కావటంతో, ఆయన కామెడీ టైమింగ్ పై అంచనాలతో ముందు నుంచే ఈ మూవీ పై పాజిటీవ్ టాక్ వచ్చింది. పైగా ఈ మూవీని సుకుమార్ భార్య తబిత సమర్పించటం, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావటంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో, రావు రమేష్ హీరోగా సక్సెస్ అయ్యాడో లేదో ఈ రివ్యూలో చూద్దాం.   


కథ : 

సుబ్రహ్మణ్యం(రావు రమేష్) చిన్నప్పట్నుంచి గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా వచ్చిన ప్రతి జాబ్ అప్లై చేస్తూ ఉంటాడు. కానీ ఏది రాదు. పెళ్లి చేసుకుంటాడు. అతని భార్య కళారాణికి(ఇంద్రజ) గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సుబ్రహ్మణ్యంకు DSC రాస్తే టీచర్ గా జాబ్ వచ్చినా కోర్టు కేసు కారణంగా అపాయింట్మెంట్ రాదు. ఎప్పటికైనా ఆ కోర్టు కేసు క్లియర్ అయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, తన డబ్బులతోనే సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. పెళ్లయి 25 ఏళ్ళు అయినా సుబ్రహ్మణ్యం ఇంకా ఏదో అద్భుతం జరుగుతుంది, తనకి గవర్నమెంట్ జాబ్ వస్తుందన్న భ్రమలో బతుకుతూ, భార్య సంపాదన మీద బతికేస్తూ, భార్యకి భయపడుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్(అంకిత్) తను అల్లు అరవింద్ కొడుకని, అల్లు అర్జున్ తమ్ముడుని అని పేదరికం తెలియటానికి  తండ్రి తనని ఇలా ఇక్కడ పెంచుతున్నాడని కలలు కంటూ ఉంటాడు. అంకిత్ తొలిచూపులోనే కాంచన(రమ్య)తో ప్రేమలో పడతాడు. ఒకరోజు అనుకోకుండా సుబ్రహ్మణ్యం అకౌంట్ లో 10 లక్షలు పడతాయి. అవి ఎలా వచ్చాయో, ఎవరు వేసారో తెలీక అయోమయంలో ఉంటారు తండ్రి కొడుకులు. ఏదైతే ఏమయ్యిందిలే ఆ డబ్బులు మనవే అన్న ఉద్దేశ్యంతో ఖర్చుపెట్టేస్తారు. 10 లక్షలు సుబ్రహ్మణ్యం అకౌంట్ లో ఎవరు వేశారు? ఎందుకు వేశారు? సుబ్రహ్మణ్యంకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? అర్జున్ ప్రేమ కథ ఏమయ్యింది?  కళారాణి భర్త విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  


విశ్లేషణ: 

ఈ  మధ్య కాలంలో కామెడీ సినిమాలు పెద్దగా రావటం లేదు. కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పి,  ఏదో పిచ్చి కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చూపిస్తున్నారు. మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీ నవ్విస్తూనే మంచి ఎమోషన్ తో ప్రేక్షకులని మెప్పించారు. క‌థ కంటే కామెడీపైనే ద‌ర్శ‌కుడు ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. అనుకోకుండా అకౌంట్‌లో ల‌క్ష‌లు, కోట్ల‌లో డ‌బ్బులు ప‌డ‌టం, వాటిని జ‌ల్సాల‌కు వాడుకునే వ్య‌క్తులు, ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల‌కు ఏళ్లు ఎదురుచూసే వారి క‌థ‌ల్ని బేస్ చేసుకుని ద‌ర్శ‌కుడు మారుతి నగర్ సుబ్రమ‌ణ్యం రూపొందించారు. ఈ సింపుల్ పాయింట్‌తో రెండున్న‌ర గంట‌లు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డం అంటే క‌ష్ట‌మే. కానీ ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులని  ఎంటర్ టైన్ చేశారు. కామెడీ సినిమా మధ్యలో ఎమోషన్ సీన్స్ కావాలని పెట్టినట్లు అనిపిస్తున్నాయి. నాచురాలిటీ మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అంతా సుబ్రహ్మణ్యం, అతని ఫ్యామిలీ, పాతికేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, సుబ్ర‌హ్మ‌ణ్యం ఇంట్లో భార్య‌, అత్త చేత మాట‌లు ప‌డ‌టం అత‌డి క‌ష్టాలు. కొడుకు భ్ర‌మ‌ల‌తో బతకటం, అర్జున్ ప్రేమ కథ , కాంచన ఫ్యామిలీ, సుబ్రహ్మణ్యం అకౌంట్ లో డబ్బులు పడి ఖర్చుపెట్టడం లాంటివి చూపిస్తారు. ఈ సీన్స్‌లో సిట్యూవేష‌న‌ల్ కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యింది. రావుర‌మేష్‌ కామెడీ టైమింగ్‌, పంచ్‌లు, హావ భావాలు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. సెకండాఫ్‌లోనే ద‌ర్శ‌కుడు అస‌లు క‌థ‌లోకి వెళ్లాడు అకౌంట్ లో పడిన డబ్బులు ఖర్చు పెట్టేయటం వలన వచ్చిన కష్టాలు, క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రెండు మూడు సీన్స్ తప్ప ప్రతి సీన్ కి కామెడీ ఎలివేట్ అవుతూనే ఉంది. సినిమాలో అల్లు అర్జున్ రిఫరెన్సులు పెట్టి, బన్నీ ఫ్యాన్స్ ని బానే బుట్టలో వేశారు. హీరో – హీరోయిన్ ప్రేమ కథని కొత్తగా రాసుకున్నారు. వాళ్ళ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా కామెడీగా సాగాయి. రావు రమేష్ ని ఈ పాత్రకి ఎంచుకుని, అతని చుట్టూ కథ రాసుకోవటమే గొప్ప విషయం. కథ ముఖ్యం కానీ హీరో కాదు అని దర్శకుడు మరో సారి రుజువు చేశారు. మన అకౌంట్ లో మనకే తెలియకుండా డబ్బులు పడితే వచ్చే ఆలోచనలు, వాటి చుట్టూ న‌డిచే అయోమయం కామెడీగా తెరకెక్కించారు. 


నటీ నటులు:

సుబ్రహ్మణ్యం పాత్రకి రావు రమేష్ వంద శాతం న్యాయం చేసాడు. ఆ పాత్రకి రావు రమేష్ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేము. సుబ్రహ్మణ్యం పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందో తన నటనతో చూపించాడు. రావు రమేష్ కామెడీ టైమింగ్ సూపర్ అని చెప్పాలి, పండగ చేసుకో సినిమా తరవాత రావు రమేష్ కి మంచి కారెక్టర్ పడింది ఈ సినిమాతో. సుబ్రహ్మణ్యం పాత్రకి రావు రమేష్ ని ఎంచుకోవటం తోనే సగం సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కళారాణి పాత్రలో ఇంద్రజ నటన కూడా బాగానే ఉంది. ఇంద్రజ పాత్రకి ఎక్కువ స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. చిన్నప్పటినుంచి తాను ఇంకెవరి బిడ్డనో అనుకుంటూ భ్రమలో పెరిగే అర్జున్ పాత్రలో నటించిన అంకిత్ కి మంచి గుర్తింపు దక్కుతుంది. తన పాత్రకి న్యాయం చేసాడు. రమ్యపసుపులేటి కాంచన క్యారక్టర్ లో నేటి తరం అమ్మాయిలకి ప్రతీకగా నిలిచింది. హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి,ప్రవీణ్, అజయ్, అప్పాజీ, వాసు ఇంటూరి వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 


టెక్నికల్:

దర్శకుడు లక్ష్మణ్‌ కార్యకి ఇది రెండో సినిమా. మొదటి సినిమా హ్యాపీ వెడ్డింగ్ తో ప‌ర్వాలేదని పించుకున్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి మెగా ఫోన్ పట్టి కామెడీ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ పల్స్ పట్టుకున్నాడు. మారుతి నగర్ సుబ్రమ‌ణ్యం సినిమాకు కామెడీనే బ‌లం. కానీ ఒక్కో చోట అదే మైనస్ అయ్యింది. కామెడీ కోసమే కొన్ని పాత్ర‌లు క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. కేవలం వినోదానికి పెద్ద పీట‌ వేసి, ఎమోష‌న్స్‌ ని పండించలేకపోయాడు. అర్జున్‌, కాంచ‌న ల‌వ్‌స్టోరీ యూత్ ఆడియెన్స్‌ కోస‌మే బోల్డ్‌గా రాసుకున్న‌ట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాను అనుకున్న కామెడీ జోనర్ తో ఆడియన్స్ కి రీచ్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు చూడటానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిచోట్ల పర్వాలేదనిపించింది. కామెడీ RR బాగా వర్కౌట్ అయింది. ఎడిటింగ్ లో ట్రిమ్ చేయాల్సిన సీన్స్ కొన్ని ఉన్నాయనిపిస్తోంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమా అయినా ఖర్చుకి వెనకాడకుండా నిర్మించినట్లు తెలుస్తోంది.    

 

ప్లస్ పాయింట్స్ 

రావు రమేష్ 
కామెడీ 
కథ  

 

మైనస్ పాయింట్స్ 

లవ్ సీన్స్ 
ఎమోషన్స్ 
కొన్ని పాత్రలు   


ఫైనల్ వర్దిక్ట్: టైమ్ పాస్ సుబ్ర‌హ్మ‌ణ్యం


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS