మజాకా మూవీ రివ్యూ & రేటింగ్..!

మరిన్ని వార్తలు

చిత్రం: మజాకా
దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన
కథ - రచన:  ప్రసన్న కుమార్ బెజవాడ

నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్, అన్షు, రీతూ వర్మ, రఘుబాబు, శ్రీనివాస రెడ్డి, హైపర్ ఆది, మురళీశర్మ తదితరులు

నిర్మాత: రాజేశ్ దండ‌
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఎడిటర్: చోటా కే ప్రసాద్

బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్

విడుదల తేదీ: 26 ఫిబ్రవరి 2025

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

వరస ఫ్లాప్ లతో నిరాశలో ఉన్న సందీప్ కిషన్ 'మజాకా' పై ఆశలు పెట్టుకున్నాడు. సందీప్ కిషన్ తెలుగులో నటించిన చివరి సినిమా  భైరవకోన యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ లో ధనుష్ దర్శకత్వంలో వచ్చిన 'రాయన్' మూవీలో కూడా సందీప్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ మూవీ సందీప్ కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. రాయన్ ఇచ్చిన పాజిటీవ్ వైబ్స్ తో నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మజాకా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ధమాకా లాంటి హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావు, బెజవాడ ప్రసన్న కుమార్ కాంబోలో వస్తోంది మజాకా. ఈ కథ చిరంజీవి దగ్గరికి వెళ్ళింది. సిద్దు జొన్నలగడ్డ, చిరంజీవి తండ్రి కొడుకులుగా నటించాల్సిన ఈ సినిమా ఇప్పడు రావు రమేష్, సందీప్ కిషన్ చేసారు. రిలీజ్ అయిన ట్రైలర్ కి, మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'మజాకా' మూవీ శివరాత్రి సందర్భంగా బుధవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం సందీప్ కెరియర్ కి ప్లస్ అయ్యిందో లేదో, దర్శకుడికి ధమాకా లాంటి హిట్ తెచ్చిందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

వెంకటరమణ (రావు రమేష్) ఒక ట్రావెల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వెంకట రమణ భార్య ఓ కొడుక్కి జన్మ నిచ్చి పురిటిలోనే మరణిస్తుంది. కొడుకు కృష్ణ (సందీప్ కిషన్)తో కలిసి వెంకటరమణ కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. తల్లి లేని పిల్లాడు అని అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఒక తండ్రిలా కాకుండా స్నేహితుడిలా చనువుగా మెలగుతాడు. కొడుక్కి పెళ్లి చేస్తే ఒక ఫ్యామిలీ ఉంటుంది అని ఆశ పడుతుంటాడు. కొడుకుకి పెళ్లి వయసు రాగానే సంబంధాలు చూడటం మొదలుపెడతాడు. కానీ ఇద్దరు మగవాళ్ళు ఉన్న ఇల్లు అని, ఆడ దిక్కు లేని ఇంటికి ఎలా పిల్లనిస్తామని ఎవరూ ముందుకురారు. అలాంటి టైంలో కొందరు వెంకటరమణ ని ముందు పెళ్లి చేసుకుని కొడుకు కృష్ణ కి పెళ్లి చేయమని చెప్తారు. కొడుకు కోసం లేట్ వయసులో పెళ్ళికి సిద్ధపడతాడు. కరక్ట్ గా అప్పుడే వెంకటరమణ యశోద(అన్షు)ని చూసి లవ్  ఎట్ ఫస్ట్ సైట్ లో పడతాడు. యశోదని పెళ్ళి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే టైం లో కృష్ణ కూడా కాలేజీలో మీరా(రీతు వర్మ)ను ఇష్టపడతాడు. మీరానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కొడుకుకి పెళ్లి చేసే ఏజ్ లో తండ్రి ప్రేమలో పడటం, తండ్రి కొడుకు ఇద్దరు ఎవరి ప్రేమని వారు గెలిపించుకునే ప్రయత్నాల్లో ఉండటమే కథ. చివరికి వీరి ప్రేమ కథలు సుఖాంతం అయ్యాయా? ఎవరి ప్రేమను వాళ్ళు గెలిపించుకునే ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వీరిద్దరి ప్రేమ‌క‌థ‌ల్లో చోటు చేసుకున్న మ‌లుపులు?పెళ్లికి సిద్ధ‌మ‌య్యాక ఎదురైన చిక్కులు? ఈ తండ్రి కొడుకులపై భార్గ‌వ్ వ‌ర్మ (ముర‌ళీశ‌ర్మ‌)కి ఉన్న విరోధం ఏంటి? లాంటి విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

ప్రస్తుతం చాలా మంది అబ్బాయిలు పెళ్లికాక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది కొడుక్కి పెళ్లి చేయాల్సిన ఏజ్ లో తండ్రి ప్రేమలో పడి, లవ్ లెటర్స్ రాస్తూ, బస్ స్టాప్స్, పార్క్ లంటూ తిరుగుతుంటే ఎలా ఉంటుంది అన్న పాయింట్ 'మజాకా' కథ. కథలో కొత్తదనం లేదు. కాకపోతే కామెడీ ట్రాక్ మీద ఎక్కువ ద్రుష్టి పెట్టారు త్రినాధరావు, ప్రసన్న కుమార్. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల కామెడీ తేలిపోయింది. కేవలం కామెడీ జోనర్ కోసం ఈ సినిమా కథ తెరకెక్కించారు అనిపిస్తుంది. వారి హిట్ సినిమాల్లో సీన్స్ నే కొన్ని రిపీట్ చేసినట్లు అనిపిస్తుంది. కృష్ణను తీసుకువెళ్లి ఒకరిని కొట్టమని యశోద అడుగుతుంది. ఈ కాన్వరుజేషన్ చూసినప్పుడు 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో  భూమిక, నాని గుర్తొస్తారు. ఫ్రెండ్ పెళ్లి కోసం హీరోయిన్ అమలాపురం వెళ్ళటం, హీరో కూడా అదే పెళ్ళికి వెళ్లటం, అక్కడ కామెడీ అంతా రొటీన్ గా ఉంటుంది. 'హైపర్' ఆది కామెడీ పరవాలేదు. అది కూడా రొటీన్ గానే ఉంది. ముఖ్యంగా ప్రతి సీన్ న్యాచురల్ గా అనిపించదు కావాలనే కల్పించినట్లు అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లేవు.

ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటే సెకండ్ హాఫ్ అయినా స్పీడ్ గా నడిపిస్తారేమో అని ఆశ పడితే ఇంకా బండి స్లో అయ్యింది. పైగా సెకండ్ హాఫ్ లో సీన్ లు, మరీ సినిమాటిక్ గా ఉన్నాయి. రాత్రి పూట తండ్రి కొడుకు కలిసి లవ్ లెటర్స్ రాయటం. ప్రియురాలి కోసం గోడ‌లు దూక‌డం, బ‌స్సుల్లో ఫాలో అవటం, కామెడీగా తెరకెక్కించినా టూ మచ్ అని కూడా అనిపిస్తుంది. లాజిక్స్ పట్టించుకోకుండా చూసే వారికీ కామెడీ ఎక్కుతుంది. లాజికల్ గా ఆలోచిస్తూ చూసే వారికీ కామెడీ టూ మచ్ గా అనిపిస్తుంది. కాకపోతే హెల్దీ కామెడీ ఉండటం గమనార్హం. ఈ మధ్య సినిమాల్లో కామెడీ అంటే అశ్లీలత, అసభ్య పదాలు, బూతులు, డబల్ మీనింగ్ డైలాగ్స్. కానీ మజాకా లో అలాంటివి కనిపించవు. ఫ్యామిలీ తో పాటు కలిసి కూర్చొని చూసే మూవీ.

ఇద్దరి ప్రేమ కథ ఒకేసారి జరుగుతుంటుంది. ఒకరి విషయం ఒకరికి తెలిసిన తరవాత ఇద్దరూ కలిసి ప్రేమించిన అమ్మాయిల కోసం పడే పాట్లు, భార్గ‌వ్ వ‌ర్మ ప‌గ‌, ప్ర‌తీకారంతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఆకట్టుకునే సీన్స్ కానీ, కొత్తదనం కానీ లేకపోయినా కామెడీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగారు. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ కొంచెం సర్ప్రయిజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ లో క‌థ‌లో ఒక ట్విస్డ్ట్ చోటు చేసుకుంటుంది. క్లైమాక్స్ బాగుంది.

నటీ నటులు:

ఈ సినిమాలో కృష్ణ పాత్రలో సందీప్ నటన బాగుంది. ఇలాంటి పాత్రలు సందీప్ కి కొట్టిన పిండి. తండ్రి కొడుకులుగా సందీప్, రావు రమేష్ అద్భుతంగా నటించారు. వీరి కెమిస్ట్రీ బాగుంది. తండ్రి కొడుకుల అనుబంధమే సినిమాకి ప్రధాన బలం. ఆ పాత్రల్లో రావు రమేష్, సందీప్ ఒదిగిపోయారు. వీరిద్దరి నటన ఎనర్జిటిక్ గా ఉంది. ఇద్దరి కామెడీ  టైమింగ్ కూడా బాగుంది. లేటు వ‌య‌సులో ప్రేమ‌లో పడిన వ్యక్తిగా రావు రమేష్ నటన సూపర్. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం తరువాత రావు రమేష్ కి మంచి పాత్ర పడింది. రావు రమేష్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. వెంకటరమణ పాత్రలో రావు రమేష్ పరకాయ ప్రవేశం చేశాడు. ఈ సినిమా తరవాత రావు రమేష్ కోసం కొన్ని కథలు పుట్టుకురావటం గ్యారంటీ అనిపిస్తుంది. యశోద పాత్రలో అన్షు మెప్పించింది. చాలా కాలానికి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి. రీతు వర్మ క్యారక్టర్ రొటీన్ గా ఉంది. నటనకి ఎక్కువ స్కోప్ లేదు. మురళీ శర్మ పాత్రకి న్యాయం చేసారు. శ్రీనివాసరెడ్డి, హైపర్ ఆది కామెడీ టైమింగ్ ని ఇంకొంచెం వాడుకుంటే బాగుండేది.

టెక్నికల్ :

టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడుకి అలవాటైన జోనర్ కావటంతో రిస్క్ తీసుకోకుండా అదే జోనర్ ట్రైచేసాడని అనిపిస్తుంది. పూర్తిగా కామెడీని నమ్ముకుని సినిమా మొత్తం చిత్రించారు. ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ క్యాచీగా ఉన్నాయి. చివరికి ఎమోషనల్ డైలాగ్స్ కూడా చాట భారతంలా కాకుండా టూకీగా ఉన్నాయి. కథ ప‌రంగా ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే మంచి విజయం దక్కేది. రొటీన్ కథ అయినా రెండున్నర గంటలపాటు కామెడీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ బాగుంది. లియోన్ జేమ్స్ బ్యాక్ గ్రౌండ్  స్కోర్ సినిమాకి మైనస్. పాటలు ఒకటి రెండు  పర్వాలేదు. కానీ సినిమాలో వాటి ప్లేసింగ్ కుదర్లేదు. కావాలని పాటలు చొప్పించినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. ఇంకా కొన్ని సీన్స్ కట్ చేసినా ఓకే. రాజేష్ దండా ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారని తెలుస్తోంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

సందీప్ కిషన్
రావు రమేష్ 
కామెడీ 
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

న్యాచురాలిటీ మిస్సింగ్ 
ఓవర్ సినిమా లిబర్టీ 
ట్విస్ట్ లు, ఎమోషన్స్ మిస్సింగ్  
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

ఫైనల్ వర్దిక్ట్ : లాజిక్స్ లేని 'మజాకా'

 


 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS