తారాగణం: ఆకాష్ పూరి, నేహా శెట్టి, మురళి శర్మ, విషు రెడ్డి
నిర్మాణ సంస్థ: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ & PC
సంగీతం: సందీప్ చౌతా
ఛాయాగ్రహణం: విష్ణు శర్మ
ఎడిటర్: జునైద్
నిర్మాతలు: చార్మీ & పూరి జగన్నాధ్
రచన-దర్శకత్వం: పూరి జగన్నాధ్
రేటింగ్: 2.25/5
కొంతకాలంగా పూరికి విజయాల్లేవు. అతనిపై ఎవ్వరికీ నమ్మకాలూ లేవు. సినిమాలు చేస్తున్నాడు గానీ - అందులో కిక్ లేదు. తన ఫ్యాన్స్‌ని సైతం పూరి దారుణంగా నిరాశ పరుస్తున్నాడు. ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో పూరి నుంచి వచ్చిన సినిమా `మెహబాబూ`. ఈ సినిమాతో మూడు బరువు బాధ్యతలు తన నెత్తిమీద వేసుకున్నాడు. ఒకటి... దర్శకుడిగా తను ఫామ్‌లోకి రావాలి. రెండోది... తనయుడ్ని హీరోగా నిలబెట్టాలి. మూడోది నిర్మాతగా గట్టెక్కాలి. ఇన్ని సవాళ్ల మధ్య వచ్చిన `మెహబూబూ` ఎలా ఉంది? పూరిని ఒడ్డున పడేస్తుందా, లేదంటే ఇంకాస్త ముంచి వెళ్తుందా? చూద్దాం...
* కథ
రోషన్ (పూరి ఆకాష్) హైదరాబాద్ అబ్బాయి. చిన్నప్పటి నుంచి తనకు పూర్వ జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. మరోవైపు పాకిస్థాన్‌లో ఉన్న అఫ్రిన్ (నేహాశెట్టి)దీ ఇదే పరిస్థితి. ఇంట్లో తనకు పెళ్లి సంబంధం ఖాయం చేస్తారు. కానీ చదువుకోవాలన్న నెపంతో హైదరాబాద్ వస్తుంది. ఇక్కడ ఓ ప్రమాదం నుంచి అఫ్రిన్‌ని రోషన్ కాపాడతాడు. కానీ ఆ సమయంలో ఇద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకోరు. చివరికి ఏదోలా కలుసుకుంటారు. కానీ ఆ సమయానికి అఫ్రిన్ పాకిస్థాన్ వెళ్లిపోతుంది. అదే సమయంలో.. తన పూర్వ జన్మ ప్రేమికురాలు అఫ్రినే అనే నిజం రోషన్‌కి తెలుస్తుంది. ఆ తరవాత రోషన్ ఏం చేశాడు? తన ప్రేమని ఎలా కాపాడుకున్నాడు? అనేదే కథ.
* నటీనటులు
ఆకాష్ పూరి మంచి నటుడే. తనలో ఈజ్ ఉంది. కాకపోతే... ఇలాంటి పాత్రలు చేయడానికి ఇంకాస్త టైమ్ ఉంది. పూరి తొందరపడ్డాడేమో అనిపిస్తుంది. రెండేళ్లు ఆగితే... ఆకాష్ అన్నింట్లోనూ పర్‌ఫెక్ట్ అయిపోతాడు. నేహా శెట్టి అందంగా ఉంది. నటన పరంగానూ ఓకే అనిపించుకుంది. తనకు మరిన్ని అవకాశాలు రావొచ్చు.
చాలా కాలం తరవాత షాయాజీ షిండేకి మంచి పాత్ర దక్కింది. మురళీ శర్మ మినహాయిస్తే... మిగిలిన వాళ్లంతా తెలుగు తెరకు కొత్త. ఏ పాత్రా పెద్దగా రిజిస్టర్ అవ్వదు.
* విశ్లేషణ..
పూరి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్టు కొట్టాల్సిన తరుణమిది. మరోవైపు తనయుడ్నీ నిలబెట్టాలి. అందుకే కథ విషయంలో రిస్క్ తీసుకోదలచుకోలేదు. అదే పాత ఫార్మెట్ కథని ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడాలనుకున్నాడు. ప్రేమికులు విడిపోవడం - మళ్లీ కలుసుకోవడం.. ఏనాటి ఫార్మెట్? పూర్వ జన్మల గాథ కూడా కొత్త పాయింటేం కాదు. కాకపోతే ఈసారి దానికి మిలటరీ నేపథ్యాన్ని తీసుకున్నాడు.
దురదృష్టం ఏమిటంటే.. ఈ నేపథ్యమే కథకు అతకలేదు. మిలటరీ చుట్టూ తెరకెక్కించిన సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అస్సలు పండలేదు. అలాంటప్పుడు వాళ్ల మధ్య భావోద్వేగాలు ఎలా పండుతాయి? సెకండాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాకే. అక్కడ ఏం జరిగి ఉంటుందో.. ఫస్టాఫ్‌లో ఇంటర్ కట్స్ పడినప్పుడే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. కథలో ఎమోషన్‌లేనప్పుడు పాత్రధారులు అరచి గీ పెట్టినా ఫలితం ఉండదు. ఈ కథలో ఆ ఎమోషన్ కరువయ్యింది.
అయితే అక్కడక్కడ పూరి తన మార్క్ డైలాగులతో కనికట్టు చేసే ప్రయత్నం చేశాడు. `సేవ్ టైగర్స్` నేపథ్యంలో వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో తీసిన సన్నివేశం, అందులోని డైలాగులు చప్పట్లు కొట్టించేలా చేశాయి. అయితే ఇలాంటివి అక్కడక్కడ వదిలితే బాగుండేది. సెకండాఫ్‌లో రిలీఫ్‌కి ఎక్కడా ఛాన్స్ లేకుండా చేసుకున్నాడు పూరి. తన సినిమాల్లో కనిపించే వేగం ఈసినిమాలో మిస్సయ్యింది. దాంతో పూరి సినిమాలనగానే ఏం ఆశిస్తారో అవేం ఇందులో కనిపించలేదు.
ఇండియా- పాకిస్థాన్ ప్రేమ కథ పాయింట్‌లో, దేశ భక్తినిమిక్స్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుందామనుకున్నాడు పూరి. అయితే ఆ మేళవింపు అతక్కపోవడంతో తన ప్రయత్నం బెడసికొట్టింది. లాజిక్కులు మిస్సయిన సన్నివేశాలు, సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా పూరి సినిమాలు బాగుంటాయి. వార్ ఎపిసోడ్లు తీర్చిదిద్దిన విధానం నచ్చుతుంది. హిమాలయాల నేపథ్యం తీసుకోవడంతో కొత్త ఫ్లేవర్ వచ్చినట్టైంది.
సందీప్ చౌతా సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. మెహబూబా పాట హాంట్ చేస్తుంది. పూరి డైలాగుల విషయంలో మరోసారి మెరిశాడు. కానీ కథా రచయితగా ఫెయిల్ అయ్యాడు. తన కథని ప్రతిభావంతంగా తెరకెక్కించడంలో దర్శకుడిగానూ రాణించలేకపోయాడు.
* బలాలు
+ పూరి డైలాగులు
+ యుద్ధ సన్నివేశాలు
* బలహీనతలు
- కథ, కథనం
- ఎమోషన్స్ టచ్ చేయలేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: ఫలించని ప్రేమ యుద్ధం
రివ్యూ రాసింది శ్రీ