చిత్రం: మిస్ శెట్టి - మిస్టర్ పొలిశెట్టి
నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి
దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: వంశీ - ప్రమోద్
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: నిరవ్ షా
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్స్: యువీ క్రియేషన్స్
విడుదల తేదీ: 7 సెప్టెంబర్ 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
హీరోయిన్లలో హీరో రేంజ్ ఇమేజ్ దక్కించుకొంది.. అనుష్క. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంత పేరు తెచ్చుకొందో, లేడీ ఓరియెంటెడ్ కథలతో అంతగా పాపులారిటీ సంపాదించింది. అయితే కొంత కాలంగా అనుష్క వెండి తెరపై కనిపించలేదు. మీడియా ముందుకూ రావడం లేదు. అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుందన్న ఊహాగానాలూ వినిపించాయి. అయితే సుదీర్ఘ విరామం తరవాత.. అనుష్క నటించిన `మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి` ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క సినిమా అవ్వడం, యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకొన్న నవీన్ పొలిశెట్టి హీరో కావడం, ఈ కాంబినేషన్‌పై ఆసక్తి కలగడం వల్ల.. సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి.. ఈ ఇద్దరు శెట్టిలూ ఎలా ఉన్నారు? వీళ్ల కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందా, లేదా?
కథ: అన్విత (అనుష్క) ఒక చెఫ్. పెళ్లంటే సరైన అభిప్రాయం ఉండదు. తల్లి (జయసుధ)ని కోల్పోయి ఒంటరితనం ఫీల్ అవుతుంది. తన ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకొంటుంది. అందులోనూ పెళ్లి కాకుండా, ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోకుండా. కృత్రిమ గర్భం ద్వారా ఓ బిడ్డ కనడానికి సరైన పార్టనర్ కోసం అన్వేషణ మొదలెడుతుంది. ఈ ప్రయాణంలో సిద్దూ (నవీన్ పొలిశెట్టి) పరిచయం అవుతాడు. తనో స్టాండప్ కమెడియన్. అన్విత పెట్టిన ప్రపోజల్ సిద్దూ అంగీకరించాడా? వీళ్లిద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం ప్రేమకు దారితీసిందా, లేదా? అన్విత కోరిక ఎలా ఫలించింది? అనేది వెండి తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
విశ్లేషణ: ఓ భారీ సెంటిమెంట్, పేథాస్ సీన్ తో సినిమా మొదలవుతుంది. అన్విత పరిచయం, తల్లితో అనుబంధం, అమెరికా నుంచి అన్విత ఇండియాకొచ్చి, ఇక్కడ తన పార్టనర్ వేట మొదలెట్టే సీన్లన్నీ... నిదానంగా సాగుతాయి. ఎప్పుడైతే స్టాండప్ కమెడియన్ గా సిద్దూ ఎంట్రీ ఇచ్చాడో అక్కడి నుంచి వినోద యాత్ర మొదలవుతుంది. స్టాండప్ కామెడీ చుట్టూ కథలు తిరగడం... తెలుగు వరకూ కొత్తే. కాబట్టి ఆయా సన్నివేశాలు ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తాయి. స్టాండప్ కామెడీని కేవలం కామెడీ కోసమే వాడారు అనే ఫీల్ రాకుండా ఈ సెగ్మెంట్ ని కథలో కూడా బాగా మిక్స్ చేశారు. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ అదిరిపోయే స్థాయిలో ఉంటుంది. అది ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. నవీన్ టైమింగ్ వల్లే చాలా సీన్లు పండాయి. అన్విత మనసులోని మాట తెలుసుకొనే నేపథ్యంలో.. సిద్దూ హావభావాలు, అందులోంచి వచ్చే వినోదం.. బాగా వర్కవుట్ అయ్యాయి.
సెకండాఫ్‌లో కథ ముందుకు సాగలేకపోయింది. అసలు పాయింట్ ఫస్టాఫ్ లో రివల్ అయిపోయింది. ఆ తరవాత కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కొత్త పాత్రలు వస్తున్నా, వాటి వల్ల కథకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ఆ సీన్లన్నీ సోసో..గా సాగిపోయాయి. కాకపోతే.. నవీన్ పొలిశెట్టి టైమింగ్ వల్ల సాధారణ సన్నివేశాలు సైతం మెరిశాయి. నవీన్ కనిపించినప్పుడల్లా ఏదో రకంగా టైమ్ పాస్ అయిపోతుంది. అసలైన సీరియస్ ఎమోషన్ చెప్పే సందర్భంలో మాత్రం కథనం గాడి తప్పుతుంది. క్లైమాక్స్ కూడా త్వరగా తేల్చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ ఎమోషనల్ సీన్లు పడి ఉంటే బాగుండేది. అన్వితలో వచ్చిన మార్పు కూడా కృత్రిమంగా అనిపిస్తుంది. పైగా చాలా ఫ్లాట్ నేరేషన్ తో సాగే కథ ఇది. తరవాత ఏం జరగబోతోంది అనేది ఊహించడం పెద్ద కష్టమేం కాదు. స్టాండప్ కామెడీ అంటే.. క్లాస్ టచ్‌తో సాగుతుంది. మల్టీప్లెక్స్, యూత్ కి మాత్రమే కేటర్ చేయగల సన్నివేశాలు ఉన్నాయిందులో. అన్ని వర్గాలకూ, అందరికీ సులభంగా అర్థమయ్యే కథ కాదిది.
నటీనటులు: అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకొంది. ఆమె తన అనుభవాన్ని రంగరించింది. అనుష్క స్థాయి, ఆమెకున్న క్రేజ్, స్టార్ డమ్ ఈ పాత్రకు బాగా కలిసొచ్చాయి. అయితే నటిగా ఆమెకు సవాల్ విసిరే సన్నివేశాలు లేవు ఇందులో. ఈ సినిమాని సోలోగా తన భుజాలపై వేసుకొని నడిపించాడు నవీన్ పొలిశెట్టి. తన కామెడీ టైమింగ్, తనపై తెరకెక్కించిన సన్నివేశాలు ఈ సినిమాకి శ్రీరామ రక్ష. ఓ దశలో ఇది అనుష్క సినిమా కాదు... నవీన్ పొలిశెట్టి సినిమా అనిపిస్తుంది. అంతలా డామినేట్ చేశాడు. కథంతా వీరిద్దరి మధ్యే తిరుగుతుంది. మిగిలిన పాత్రలు సపోర్టింగ్ రోల్స్ అంతే. ఉన్నంతలో మురళీ శర్మని దర్శకుడు బాగా వాడుకొన్నాడనిపిస్తుంది. అభినవ్ గోమట్టం ఓకే అనిపిస్తాడు.
సాంకేతిక వర్గం: యూవీ క్రియేషన్స్ ఎప్పుడూ ఖర్చుకి వెనుకాడదు. ఈ సినిమాని కూడా రిచ్ గా, లావిష్ గా తీసే ప్రయత్నం చేశారు. ఫొటోగ్రఫీ ఆకట్టుకొంటుంది. రధన్ సంగీతం మాత్రం బలహీనంగా వినిపించింది. సరైన పాట ఒక్కటీ లేదు. లైటర్ వేలో సాగే సీన్లు బాగానే రాసుకొన్న దర్శకుడు కీలకమైన ఎమోషన్ సీన్లు వచ్చే సరికి తేలిపోయాడు. ఈ విభాగంలోనూ కాస్త వర్కవుట్ చేసి ఉంటే, ఫలితం మరింత బాగుండేది. అనుష్క ఇమేజ్, నవీన్ కామెడీ టైమింగే ఈ సినిమాని ఆదుకోవాలి.
ప్లస్ పాయింట్స్
నవీన్ పొలిశెట్టి
ఫస్టాఫ్ లో కామెడీ సీన్లు
కథా నేపథ్యం
మైనస్ పాయింట్స్
వీక్ క్లైమాక్స్
పాటలు
ఓ వర్గానికి పరిమితమయ్యే ఫన్
ఫైనల్ వర్డిక్ట్: క్లాస్ కామెడీ కోసం...